డెత్ ట్రాప్స్‌గా మారుతున్న మ్యాన్‌హోల్స్! వర్షంలో హైదరాబాద్ ఎంత సేఫ్?
x

డెత్ ట్రాప్స్‌గా మారుతున్న మ్యాన్‌హోల్స్! వర్షంలో హైదరాబాద్ ఎంత సేఫ్?


హైదరాబాద్‌లో భారీ వర్షం అంటే... ట్రాఫిక్ జామ్‌లు, నీటమునిగిన రోడ్లు మాత్రమే కాదు... కనిపించని మరో ప్రాణాపాయం కూడా ఉంటుంది. అదే మ్యాన్‌హోల్స్. వరద నీటిలో అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించడం అసాధ్యం. ఒక్క అడుగు తప్పినా ప్రాణాలు పోయే ప్రమాదం. ప్రతి వర్షాకాలంలో ఇదే ఆందోళన కనిపిస్తున్నా... ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు.

తాజాగా మియాపూర్‌లో 70 ఏళ్ల బాలయ్య వరద నీటిలో ఓపెన్ మ్యాన్‌హోల్‌లో కొట్టుకుపోయిన ఘటన మరోసారి నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఘటన జరిగి ఐదు రోజులు గడిచినా ఆయన ఆచూకీ ఇంకా లభించలేదు.NDRF, HYDRAA, GHMC, ఫైర్ సర్వీసెస్, హైదరాబాద్ వాటర్‌బోర్డు బృందాలు సంయుక్తంగా ఐదో రోజూ గాలింపు కొనసాగిస్తున్నాయి. డ్రోన్లు, సీవర్ కెమెరాలు, జెట్టింగ్ యంత్రాల సహాయంతో మ్యాన్‌హోల్స్ నుంచి నాలాలు, ఔట్‌ఫాల్ పాయింట్లు, చెరువుల వరకు శోధిస్తున్నారు. అయినప్పటికీ బాలయ్య ఆచూకీ ఇంకా లభించలేదు. భారీ వరద ప్రవాహం, సంక్లిష్టమైన సీవర్ నెట్‌వర్క్, మురుగునీటిలో పేరుకుపోయిన చెత్త గాలింపునకు ప్రధాన అడ్డంకులుగా మారాయి.

బాలయ్య ఘటన ఒక్కటే కాదు. ప్రతి వర్షాకాలంలో హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్ ప్రమాదాలు పునరావృతమవుతూనే ఉన్నాయి. అసలు నగరంలో ఎన్ని మ్యాన్‌హోల్స్ ఉన్నాయి? ఎందుకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి? ఈ ఘటనతో వర్షాకాలంలో హైదరాబాద్‌లో ప్రజల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్‌కు బాధ్యత ఎవరిది? ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకుంటారు? బాలయ్య కోసం గాలింపు కొనసాగుతుండగానే... నగరంలో మ్యాన్‌హోల్ భద్రతపై ఆందోళన మరింత పెరుగుతోంది.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ప్రస్తుతం సుమారు 3 లక్షల సీవర్ మ్యాన్‌హోల్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాటర్ బోర్డు అంచనా. నగరవ్యాప్తంగా దాదాపు 3,600 కిలోమీటర్ల సీవర్ నెట్‌వర్క్ విస్తరించి ఉంది. 2025లో ప్రత్యేక డీసిల్టింగ్ డ్రైవ్ నిర్వహించి 1.22 లక్షల మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేసినట్లు వాటర్ బోర్డు వెల్లడించింది.

ప్రతి వర్షాకాలంలో మ్యాన్‌హోల్ ప్రమాదాలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.

భారీ వర్షాలతో మ్యాన్‌హోల్స్ పూర్తిగా నీటిలో మునిగిపోవడం.

మూతలు పగిలిపోవడం లేదా దొంగతనానికి గురికావడం.

ప్లాస్టిక్, చెత్త, సిల్ట్ పేరుకుపోవడంతో సీవర్ లైన్లు బ్లాక్ కావడం.

సీవర్‌లో ఒత్తిడి పెరగడంతో మూతలు పైకి లేచి మురుగునీరు బయటకు రావడం.

డీసిల్టింగ్ అనంతరం కొన్ని చోట్ల మూతలను సరిగా అమర్చకపోవడం.

పాత సీవర్ లైన్లు, బలహీనమైన స్లాబ్‌లు ప్రమాదాలకు దారితీయడం.

వరద నీటిలో మ్యాన్‌హోల్స్ కనిపించక పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవడం.

ప్రజల్లో ఎందుకు భయం పెరుగుతోంది?

వర్షం కురిసిన తర్వాత రోడ్లపై నిలిచే నీటిలో మ్యాన్‌హోల్ ఎక్కడ ఉందో గుర్తించడం దాదాపు అసాధ్యం. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులకు ఇది ప్రాణాంతకంగా మారుతోంది. ప్రతి వర్షాకాలంలో మ్యాన్‌హోల్స్‌లో పడిపోవడం, వాహనాలు చిక్కుకుపోవడం, వరద ప్రవాహంలో కొట్టుకుపోవడం వంటి ఘటనలు పునరావృతమవుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

గత పదేళ్లలో ప్రధాన ఘటనలు:

రామ్‌కోట్ / సుల్తాన్‌బజార్

సీవర్ మ్యాన్‌హోల్‌లోకి దిగి శుభ్రం చేస్తున్న ఇద్దరు కార్మికులు విషవాయువుల ప్రభావంతో మృతి చెందారు. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. మరో ఘటన మ్యాన్‌హోల్ శుభ్రం చేస్తూ నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మాన్యువల్ క్లీనింగ్, భద్రతా పరికరాల లేమిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

బంజారాహిల్స్, మలక్‌పేట్ తదితర ప్రాంతాల్లో మ్యాన్‌హోల్ స్లాబ్‌లు కూలడం, రోడ్లు కుంగిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదు.

మౌలాలిలో ఐదేళ్ల బాలిక ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడినా స్థానికులు వెంటనే రక్షించారు. అనంతరం GHMC, HYDRAA, వాటర్ బోర్డు మధ్య బాధ్యతలపై చర్చ జరిగింది.

మియాపూర్ భారీ వర్షాల సమయంలో ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడి వృద్ధుడు మృతి చెందడం నగరాన్ని కలిచివేసింది. ఈ ఘటనతో మ్యాన్‌హోల్స్ భద్రతపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ప్రతి వర్షాకాలంలో ఓపెన్ మ్యాన్‌హోల్స్, సీవర్ ప్రమాదాలు, మాన్యువల్ క్లీనింగ్ ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలువాటర్ బోర్డు ప్రతి ఏడాది డీసిల్టింగ్ డ్రైవ్ నిర్వహిస్తూ వేలాది మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేస్తోంది. వర్షాకాలంలో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్‌ను వెంటనే మూసివేయాలని, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఉన్నాయి. అలాగే ప్రజలు ఎక్కడైనా ఓపెన్ మ్యాన్‌హోల్ కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని GHMC, వాటర్ బోర్డు విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఇంకా సమాధానం దొరకని ప్రశ్నలు:

నగరంలోని 3 లక్షల మ్యాన్‌హోల్స్‌పై సమగ్ర భద్రతా ఆడిట్ జరిగిందా?

ఓపెన్ మ్యాన్‌హోల్స్‌కు బాధ్యత ఎవరిది?

ప్రతి వర్షాకాలంలో ఒకే తరహా ప్రమాదాలు ఎందుకు పునరావృతమవుతున్నాయి?

ప్రమాదం జరిగిన తర్వాత కాకుండా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు?

మ్యాన్‌హోల్ ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు?

హైదరాబాద్‌లో ప్రతి వర్షాకాలం వచ్చినప్పుడల్లా మ్యాన్‌హోల్స్ మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే ప్రమాదాలను అరికట్టే వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సాంకేతికత, క్రమం తప్పని తనిఖీలు, బాధ్యతాయుతమైన నిర్వహణ, ప్రజల అప్రమత్తత... ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే నగరంలో మ్యాన్‌హోల్ ప్రమాదాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది.

Read More
Next Story