
బాపూఘాాట్ నిర్మాణానికి లైన్ క్లియర్
బాపూ సరోవర్ నిర్మాణానికి అవసరమైన 84 ఎకరాల భూమి రక్షణశాఖ నుండి వచ్చేసింది
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పట్టుదల కారణంగా బాపూఘాట్ సరోవర్ కు లైన్ క్లియర్ అయ్యింది. బాపూఘాట్ ప్రాంతంలో మూసీ సుందరీకరణలో భాగంగా బాపూ సరోవర్ ప్రాజెక్టును రేవంత్ ప్రభుత్వం టేకప్ చేసింది. దీనికి కేంద్ర రక్షణశాఖ అనుమతిస్తు శుక్రవారం రాష్ట్రప్రభుత్వానికి సమాచారం అందించింది. దాంతో రు. 550 కోట్ల ప్రాజెక్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయినట్లయ్యింది.
రక్షణశాఖ నుండి అనుమతి రావటంతో రేవంత్ రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ధన్యవాదాలు తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టాల్సిన ప్రాంతంలో మిలిట్రీ భూములున్నాయి. గోల్కొండ ఆర్టిలరీ ప్రాంతంలోకి బాపూఘాట ప్రతిపాదిత భూములు వస్తాయి. దాంతో బాపూ సరోవర్ నిర్మించాలంటే రక్షణశాఖ అనుమతి తప్పనిసరి అయ్యింది. ఇక్కడ రక్షణ శాఖ అనుమతి అంటే ప్రాజెక్టుకు అవసరమైన భూమిని రాష్ట్రప్రభుత్వానికి అప్పగించేందుకు రక్షణశాఖ అంగీకరించొనట్లే అనుకోవాలి. బహుశా ఇక్కడ వదులుకుంటున్న భూమికి ప్రత్యామ్నాయంగా రక్షణశాఖకు రాష్ట్రప్రభుత్వం ఇంకెక్కడో భూమిని కేటాయించటమో లేకపోతే సరైన ధరను చెల్లించటమో తప్పకపోవచ్చు.
బాపూ సరోవర్ నిర్మాణానికి అవసరమైన 84 ఎకరాల భూమి రక్షణశాఖ నుండి వచ్చేసింది కాబట్టి వీలైనంత తొందరలోనే నిర్మాణ పనులను ప్రారంభించాలని ప్రభుత్వం అనుకుంటోంది. దీని నిర్మాణానికి అవసరమైన సుమారు రు. 550 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. మూసీనది, ఈసా నదులు కలిసే సంఘమ స్ధలంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో బాపూఘాట్ ను అభివృద్ధి చేయాలని రేవంత్ ప్రభుత్వం డిసైడ్ చేసిన విషయం తెలిసిందే.

