
హైదరాబాద్ నగరంలో బంకు వద్ద పెట్రోల్, డీజిల్ నో స్టాక్ బోర్డు (ఫొటో : ఎక్స్ పోస్టు)
ట్యాంకర్ల రాకలో జాప్యం: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత పెరుగుతోంది
ఇంధనం కోసం పడిగాపులు.. బంకుల వద్ద గందరగోళం
తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. బంకుల వద్ద “నో స్టాక్” బోర్డులు దర్శనమివ్వడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, సరఫరా లోపాలు, పుకార్ల ప్రభావం కలిసి ఇంధన సంక్షోభాన్ని మరింత తీవ్రమయ్యేలా చేశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాహనదారులు బంకుల వద్ద క్యూల్లో నిలబడే పరిస్థితి నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనచోదకులు సతమతం అవుతున్నారు.తాత్కాలికంగా ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి బ్రేక్ పడినా హార్మూజ్ జలసంధి వద్ద చమురు నౌకలు నిలిచి పోవడంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడనుందనే భయంతో వాహనచోదకులు పెట్రోల్, డీజిల్ ఫుల్ ట్యాంకు చేయిస్తుండటంతో బంకుల్లో ఖాళీ అయి నో స్టాక్ బోర్డులు వేలాడుతున్నాయి.దీనికి తోడు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలైన బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్ ప్లాంట్ల నుంచి ఆయిల్ ట్యాంకర్లు రావడంలో జరుగుతున్న జాప్యం పెట్రోల్, డీజిల్ కొరతకు దారి తీసింది. తాము ట్యాంకర్లకు డబ్బులు కట్టి నాలుగురోజులవుతున్నా ట్యాంకర్లు రావడం లేదని పెట్రోల్ పంపుల యజమానులు చెబుతున్నారు.పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయనే పుకార్లతో వాహనచోదకులు బంకుల ముందు బారులు తీరుతున్నారు. దీని వల్ల బంకుల్లో ఉన్న నిల్వలు కాస్తా ఖాళీ అవుతున్నాయి. ఇలా కారణాలేమైనా పెట్రోల్, డీజిల్ కొరత తెలంగాణను కుదిపేస్తోంది.
పెట్రో ధరలు పెరుగుతాయనే భయంతో...
హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాల్లో పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు వేలాడుతున్నాయి. కొన్ని బంకుల వద్ద వాహనచోదకులు మండే ఎండల్లోనూ పెట్రోల్, డీజిల్ కోసం క్యూలలో వేచిఉంటున్నారు. వాహనచోదకులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ప్రైవేటుతోపాటు సివిల్ సప్లయిస్, పోలీసు, జైళ్ల శాఖ పెట్రోల్ బంకుల్లోనూ చమురు నిల్వలు అయిపోవడంతో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. ఎన్నికలు ముగియడంతో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుందని ప్రచారంతో ఎక్కువ మంది తమ వాహనాల్లో పెట్రోల్, డీజిల్ ఫుల్ ట్యాంకు చేయించుకుంటున్నారు.
కోటా పద్ధతిలో ఆయిల్ విక్రయం
హన్మకొండ జిల్లాల్లో చమురు నిల్వలు తక్కువగా ఉన్నాయని ద్విచక్ర వాహనాలకు రూ.500, కార్లు, ఇతర వాహనాలకు రూ.2,000 విలువైన పెట్రోల్, డీజిల్‌ను కోటా పద్ధతిలో విక్రయిస్టున్నారు. ఖమ్మం జిల్లాలో చాలా బంకుల్లో పెట్రోల్ అయిపోయిందని బోర్డులు పెట్టారు. భూపాలపల్లి జిల్లాలో డీజిల్ కొరతతో భారీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జనగామ, కామారెడ్డి జిల్లాల్లో పెట్రోల్ బంకుల వద్దకు పెద్దసంఖ్యలో వాహనాలు రావడంతో యజమాని తాళాలు వేసి వెళ్లిపోయారు.
డీజిల్ కోసం ట్రాక్టర్ల పడిగాపులు
వరి కోతల సీజన్ కావడంతో హార్వెస్టర్లు, ట్రాక్టర్లతో డీజిల్ కోసం బంకుల వద్ద పడిగాపులు పడ్డారు. డీజిల్ కొరతతో తాము వరి కోతలు ఎలా చేపట్టాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. భువనగిరి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో పెట్రోలు కొరతతో బంకుల వద్ద ఎక్కడ చూసినా నోస్టాక్ బోర్డులే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో చమురు కొరత తీవ్రం
పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వందలాది వాహనాలు పెట్రోల్, డీజిల్ కోసం తెలంగాణ బంకుల వద్దకు రావటంతో ఒత్తిడి పెరిగింది. సూర్యాపేట, మిర్యాలగూడ, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద ఏపీ వాహనాల రద్దీ కనిపిస్తోంది. దీంతో తెలంగాణవాసులకు పెట్రోల్,డీజిల్ కొరత ఏర్పడింది. తమ పంపుల్లో ఉన్న పెట్రోల్, డీజిల్ ను పొరుగు రాష్ట్రం వారు పోయించుకువెళుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ సరిహద్దు జిల్లాల పెట్రోల్ బంకుల్లో చమురు కొరత తీవ్రంగా ఉంది.
ట్యాంకర్ల సరఫరాల జాప్యం
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి చమురు సరఫరాలో తాత్కాలిక అంతరాయం ఏర్పడటం ఆయిల్ కొరతకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. రిఫైనరీల నిర్వహణ పనులు లేదా లాజిస్టిక్స్ సమస్యల వల్ల ఆయిల్ ట్యాంకర్ల సరఫరా ఆలస్యమవుతోంది. ట్యాంకర్ డ్రైవర్ల సమ్మె రవాణా వ్యవస్థలో అంతరాయం వల్ల సరఫరాలో జాప్యం జరుగుతుంది. ఆయిల్ డిమాండ్ ఆకస్మికంగా పెరగడం కూడా కొరతకు దారితీస్తోంది. పంటల సీజన్, వేసవి కాలంలో జనరేటర్ల వినియోగం పెరగడం వల్ల డీజిల్ వినియోగం అధికమవుతోంది. అదే సమయంలో ప్రజల్లో కొరతపై భయం పెరగడంతో అనవసరంగా నిల్వ చేసుకునే ధోరణి కూడా కనిపిస్తోంది.
బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు
తెలంగాణ రాష్ట్రంలో 4,281 పెట్రోలు బంకులు ఉన్నాయి. ఇందులో 20 శాతం పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోనే 1,200కు పైగా బంకులు ఉన్నా, చమురు కంపెనీల ప్లాంట్లు సమీపంలోనే ఉన్నా ట్యాంకర్ల రాకలో జాప్యంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. నగరంలోనూ పలు పెట్రోల్ పంపుల వద్ద నోస్టాక్ బోర్డులు వేలాడదీశారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
వినియోగదారుల అవస్థలు
తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద “నో స్టాక్” బోర్డులు కనిపించడం కలకలం రేపుతోంది. నగరాలు, పట్టణాలు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంధన కొరత ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రత్యేకంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో బంకుల వద్దకు వెళ్లిన వినియోగదారులు ఖాళీ ట్యాంకులతో తిరిగి వెళుతున్నారు. కొందరు బంకుల్లో పరిమితంగా మాత్రమే ఇంధనం విక్రయిస్తుండగా, మరికొన్ని పూర్తిగా మూసివేసి “నో స్టాక్” బోర్డులు పెట్టడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా ఆయిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడటమేనని సమాచారం.
పెట్రోల్, డీజిల్ నిల్వలున్నాయి : పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
తెలంగాణ రాష్ట్రoలో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా సమృద్ధిగా ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం తెలిపారు. సోమవారం 27 వ తేదీన డిమాండ్ ను మించి పెట్రోల్ , డీజిల్ లను 29,939 కిలో లీటర్లు సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సగటున రోజుకు 5,883 కిలో లీటర్లు పెట్రోల్, 7,348 కిలో లీటర్లు డీజిల్ కు డిమాండ్ ఉండేదని ఆయన తెలిపారు. కానీ 27 వ తేదీన 11,490 కిలో లీటర్లు పెట్రోల్, 18,449 కిలో లీటర్లు డీజిల్ ను వాహనదారులకు సరఫరా చేసినట్లు తెలిపారు. పెట్రోలు, డీజిల్ సరఫరాను క్షేత్ర స్థాయి అధికారులు, పెట్రోల్ కంపెనీల ప్రతినిధులతో రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అపోహలతో పెట్రోల్, డీజిల్ ను నిల్వచేసుకోవద్దని వినియోగదారులకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సూచించారు.
అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేస్తోంది. సరఫరా వ్యవస్థలో తాత్కాలిక అంతరాయాలు, ప్రజల్లో అపోహలే ఈ పరిస్థితికి కారణమని అధికారులు చెబుతున్నారు. వినియోగదారులు భయంతో అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోకుండా సహకరిస్తే పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది.
Next Story

