
SIR నోటీసుల కలకలం.. అద్వానీ, జైశంకర్, ధన్‌ఖర్ పేర్లపై ఈసీ క్లారిటీ
ఢిల్లీలో SIRలో నోటీసులు అందుకున్న అద్వానీ, ధన్‌ఖర్, జైశంకర్, రేఖా గుప్తా, కేజ్రీవాల్ సహా ఓటర్ల వివరాలను అధికారులు ధృవీకరించారు. జాబితాలో పేర్లను చేర్చనున్నారు.
ఢిల్లీలో కొనసాగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియ S.I.R ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నోటీసులు అందుకున్న పలువురు ప్రముఖ ఓటర్ల వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ధృవీకరించారు. వారి పేర్లను నవంబర్ 4న విడుదల చేసే తుది ఓటర్ల జాబితాలో ఉంచనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖులకు SIR నోటీసులు అందాయి.
వారి గణన పత్రాల్లో గత రికార్డులతో సరిపోలని వివరాలు.. అలాగే 2002లో జరిగిన గత SIR జాబితాతో మ్యాపింగ్ కాకపోవడం వంటి కారణాలతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. నోటీసుల తర్వాత.. బూత్ స్థాయి అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది సంబంధిత ఓటర్లను కలిసి.. అవసరమైన పత్రాలను పరిశీలించారు. ఆ పరిశీలనలో వివరాలు సరైనవిగా తేలడంతో.. పలువురు ప్రముఖ ఓటర్ల పేర్లను తుది జాబితాలో చేర్చేందుకు క్లియర్ చేశారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ SIRలో మొత్తం 33.13 లక్షల మంది ఓటర్ల వివరాల్లో అసమానతలు గుర్తించారు. వీరిలో సుమారు 13.79 లక్షల మంది వివరాలు 2002 నాటి గత SIR జాబితాతో మ్యాప్ కాలేదు. మరో 19.33 లక్షల మందికి గణన పత్రాల్లో లాజికల్ డిస్క్రెపెన్సీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే.. నోటీసు రావడం అంటే ఓటరు పేరు నేరుగా తొలగించినట్టేమీ కాదని ఢిల్లీ ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. తమ వాదనను వినిపించేందుకు ఓటర్లకు అవకాశం ఉంటుందని, అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాతే వారి అర్హతపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రముఖ ఓటర్లలో చాలామంది వివరాలు ధృవీకరణ పూర్తి చేసుకోవడంతో.. వారి పేర్లు తుది జాబితాలో చేర్చే ప్రక్రియ సాగుతోంది. ఢిల్లీ తుది ఓటర్ల జాబితా నవంబర్ 4న విడుదల కానుంది.

