
డీజీపీ ఆనంద్‌కు తలనొప్పిగా మారిన ఆ నలుగురు అధికారులు ఎవరు?
వరంగల్ పర్యటనలో నలుగురు అధికారుల పనితీరుపై డీజీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) సీవీ ఆనంద్ తాజాగా నలుగురు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత చెప్పినా మారడం లేదని అసహనం వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫర్స్‌లలో సైతం హెచ్చరించామని, కానీ వారి వైఖరి మారడం లేదని అన్నారు. వారిపై తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా పర్యాటనలో భాగంగా సీవీ ఆనంద్.. పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నలుగురు అధికారుల తీరును తప్పుబట్టారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, తమ పనితీరును మెరుగుపరుచుకోని సదరు అధికారులపై అతి త్వరలోనే కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. అయితే ఆయన ఆ అధికారులు ఎవరు? ఏ జిల్లాలో పనిచేస్తున్నారు? వంటి వివరాలను వెల్లడించలేదు. దీంతో రాష్ట్రమంతా డీజీపీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ నలుగురు అధికారులు ఎవరు? అన్న అంశంపైనే చర్చిస్తోంది. వారు ఏం చేశారు? వారికి సీవీ ఆనంద్ ఇచ్చిన సూచనలు ఏంటి? అసలు ఏం జరిగింది? అన్న చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి.

