పాలస్తీనా విషయంలో భారత్ వైఖరి బాధించిందా?
x

పాలస్తీనా విషయంలో భారత్ వైఖరి బాధించిందా?

‘ది ఫెడరల్’ తో మాట్లాడిన పాలస్తీనా రాయబారీ


Click the Play button to hear this message in audio format

భారత్ లో పాలస్తీనా రాయబారీగా ఉన్న అబ్దుల్లా మహ్మద్ అబు పవేశ్ వచ్చి ఏడాదిన్నర గడించింది. ఈ సమయంలో ఆయన తనదైన ముద్ర వేయగలిగారు. ఐక్యరాజ్యసమితిలో ఎనిమిదేళ్లపాటు పనిచేసిన ఆయన, న్యూయార్క్ నుంచి వచ్చినప్పటికి, సాధారణంగా నిశ్శబ్దంగా ఉండే ఈ రాయబార కార్యాలయం కార్యకలాపాలతో సందడిగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియాలో ఇజ్రాయెల్ వాణి బలంగా ఉన్న ఈ సమయంలో ఆయన పాలస్తీనా ప్రజల అభిప్రాయాలను వివిధ దేశాల్లోకి తీసుకోవడానికి సమయాన్ని, శక్తిని వెచ్చిస్తున్నారు. ఆయన ఘనత ఏమిటంటే, పాలస్తీనియన్ల దుస్థితిని ప్రజలకు వినిపించడంలో ఆయన విజయం సాధించారు.
ఒక దౌత్యవేత్తగా, ఆయన తన మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేదా ఆయన తరచుగా చెప్పినట్లుగా, పాత్రికేయులు తనపై ప్రశ్నల వర్షం కురిపించడానికి స్వేచ్ఛ ఉంది. వాటికి తాను సమాధానం చెప్పాల్సి ఉంటుంది, “ఒక దౌత్యవేత్తగా నా నమ్మకాలకు, నా పరిమితులకు అనుగుణంగా; నేను ఇక్కడ రాజకీయ వ్యాఖ్యాతగా లేను’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
'ది ఫెడరల్'కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ముఖాముఖిలో రాయబారి తన నిరాశను వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సులో పాలస్తీనా భాగం కాకపోవడం పట్ల, ముఖ్యంగా భారత్ "గ్లోబల్ సౌత్ ఛాంపియన్" అయినందున, గాజాలో ఇజ్రాయెల్ చర్యలను భారత్ తో సహా అనేక దేశాలు ఖండించకపోవడం పట్ల పాలస్తీనియన్ల ఆందోళన గురించి, నెతన్యాహు ఓడిపోయినప్పటికీ, ఇజ్రాయెల్‌లోని తదుపరి ప్రభుత్వం రెండు దేశాల పరిష్కారాన్ని అంగీకరిస్తుందని తాను పెద్దగా ఆశించడం లేదని ఆయన తెలిపారు.
పాలస్తీనాపై బ్రిక్స్ న్యూఢిల్లీ ప్రకటనతో మీరు సంతోషంగా ఉన్నారా?
బ్రిక్స్ ప్రకటనలో అంతర్జాతీయ సమాజంలో ప్రతిచోటా పాలస్తీనాకు ప్రాతినిధ్యం ఉండాలని పిలుపునిచ్చింది. అయినప్పటికీ, దురదృష్టవశాత్తు, మమ్మల్ని ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. ఏమి జరిగిందో నాకు తెలియదు, కానీ మేము అక్కడ లేము. ఇది వింతగా ఉంది, నిజానికి, వింత కంటే ఎక్కువ అని నేను చెబుతాను, ఎందుకంటే మమ్మల్ని అన్ని బ్రిక్స్ సదస్సులకు ఆహ్వానించేవారు. అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ వాటిలో కొన్నింటికి హాజరయ్యారు, ముఖ్యంగా రెండేళ్ల క్రితం ఆయన రష్యా వెళ్ళినప్పుడు.
గ్లోబల్ సౌత్‌కు ప్రాతినిధ్యం వహించడం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇది చాలా విచిత్రంగా ఉంది. గ్లోబల్ సౌత్ అగ్రగామిగా మనం భావించే దేశానికి నిలయమైన భారత్ లో ఈ సదస్సు జరిగింది. దక్షిణాది-దక్షిణాది సహకారం గురించి మాట్లాడినప్పుడు, భారత్ ఎల్లప్పుడూ ఒక నాయకుడిగా, అగ్రగామిగా ఉంది. కాబట్టి, దక్షిణాది అగ్రగామి దేశానికి పాలస్తీనాను ఆహ్వానించకపోవడం చాలా విచిత్రంగా ఉంది.
ప్రస్తుతం భారత్-పాలస్తీనా సంబంధాలను మీరు ఎలా చూస్తున్నారు?
ఇటీవల కాలంలో భారత్ కొన్ని సానుకూల చర్యలు తీసుకుందని నేను భావిస్తున్నాను. మేము రమల్లాలో అధికారిక పర్యటన చేశాము. అలాగే అధికారిక స్థాయిలో సమావేశాలు కూడా జరిగాయి. కానీ, పాలస్తీనా ప్రజల హక్కుల కోసం నిలబడటంలో భారత్ వైఖరి ఎంత స్థిరంగా ఉందా? ద్వైపాక్షిక సంబంధాల భవిష్యత్తు ఏమిటి? అనే ప్రశ్న ఇంకా ఉందని నేను భావిస్తున్నాను.
ద్వైపాక్షిక సంబంధాల భవిష్యత్ ఏంటీ?
మనం భారత్-పాలస్తీనా సంబంధాల గురించి మాట్లాడినప్పుడు, మనం భారత్ మొత్తమ్మీద మాట్లాడతాము. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, మేము ఎల్లప్పుడూ భారత్ గురించి సానుకూలంగానే మాట్లాడాము. ప్రస్తుత ప్రభుత్వంతో, భారత్-పాలస్తీనా సంబంధాలను మరింత మెరుగుపరచవచ్చని మేము విశ్వసిస్తున్నాము.
ఇప్పటికే చాలా సానుకూల చర్యలు వచ్చాయి. భవిష్యత్తులో ఈ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము. నిస్సందేహంగా, మా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, మేము ఈ ప్రభుత్వంతో పాటు, భవిష్యత్తులో వచ్చే ఏ ప్రభుత్వంతోనైనా, భారత్ లో ఎవరు అధికారంలో ఉన్నా వారితో కలిసి పనిచేస్తాము. ఇది మా బాధ్యత.
2014 నుంచి పాలస్తీనాకు న్యూఢిల్లీ నుంచి వచ్చే మద్దతు తగ్గిపోయింది. పాలస్తీనా వాదానికి మద్దతు ఇచ్చిన సుదీర్ఘ చరిత్రను దృష్టిలో ఉంచుకుంటే, నేడు భారత్ నిలబడిన తీరు పట్ల పాలస్తీనియన్లు నిరాశ చెందారా?
అవును, పాలస్తీనియన్లకు ఏకైక, చట్టబద్ధమైన ప్రతినిధిగా పిఎల్‌ఓను గుర్తించిన మొదటి అరబ్-యేతర దేశం భారతే. న్యూఢిల్లీ నుంచి ఒక పిఎల్‌ఓ కార్యాలయం పనిచేసేది. ఈ రోజు మనం కూర్చున్న ఇదే కార్యాలయం, భారత ప్రజల నిధులతో నిర్మించబడి మన రాయబార కార్యాలయంగా మారింది.
భారత్ అకస్మాత్తుగా దూరం జరగడం పాలస్తీనా ప్రజలకు ఎలా అనిపించింది?
పాలస్తీనా గురించి, మాకు బలమైన మద్దతుదారులుగా ఉంటూ, నిస్సందేహంగా బేషరతుగా మాతో నిలబడిన దేశాల గురించి మాట్లాడినప్పుడు, అది ఒక్క అడుగు వెనకడుగు అయినా సరే, ప్రతి ఒక్క కదలిక గమనిస్తున్నారు. అవును, మన పొరుగు దేశాలతో సహా అనేక దేశాలు ఇజ్రాయెల్ పట్ల మరింత సానుకూల దృక్పథాన్ని అవలంబించాయి.
పాలస్తీనాతో తమ సాంప్రదాయ సానుకూల సంబంధాలతో పోలిస్తే, కొన్ని దేశాలు ఇజ్రాయెల్‌తో సానుకూల సంబంధాలను ఏర్పరచుకోవడంలో చాలా ముందుకు వెళ్ళాయి. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిగిన కొన్ని గంటల్లోనే భారతదేశం ఖండించినప్పటికీ, గాజాలో ఇజ్రాయెల్ చర్యను న్యూఢిల్లీ ఇంకా ఖండించలేదు?
హమాస్ దాడిని ఖండించిన ఏకైక దేశం భారత్ కాదు. అనేక ముస్లిం దేశాలతో సహా చాలా దేశాలు హమాస్‌కు వ్యతిరేకంగా మాట్లాడాయి. కానీ వివేకవంతులుగా, పాలస్తీనియన్లమైన మేము వివేకవంతులమని నేను నమ్ముతాను, అక్టోబర్ 7 దాడికి మూలకారణమైన సమస్య మూలాన్ని మేము విస్మరించలేము. ఆ దాడి శూన్యంలో జరగలేదని భారత్ కు తెలుసని నేను గట్టిగా నమ్ముతున్నాను.
మా ప్రధానమైన, న్యాయమైన ఆందోళన ఏమిటంటే, దేశాలు అక్టోబర్ 7 దాడులను ఖండించాయి. కానీ గాజాలో 73,000(ఇందులో దాదాపు ముప్పై వేల మంది హమాస్ తీవ్రవాదులు అని ఇజ్రాయెల్ ప్రకటించింది.) మంది ప్రజలు, వారిలో ఎక్కువ మంది మహిళలు పిల్లలతో సహా పౌరులే, చంపబడుతున్నప్పుడు మౌనం వహించాయి.
ఇది పరిస్థితిని సమగ్రంగా, ఏక దృష్టితో చూడటం కాదు. 1,200 మంది ఇజ్రాయెలీలను చంపిన దాడిని దేశాలు నిస్సందేహంగా ఖండించి, ఇజ్రాయెల్ చర్యల గురించి ఎందుకు మౌనం వహించాయని ప్రశ్నించే హక్కు పాలస్తీనియన్లకు పూర్తిగా ఉంది. ఈ ప్రశ్నను భారత ప్రభుత్వంతో విస్తృత అంతర్జాతీయ సమాజంతో లేవనెత్తే హక్కు మాకు ఉంది.
గాజాలో ఇజ్రాయెల్ చర్యలను వర్ణించడానికి 'జాతి నిర్మూలన' అనే పదాన్ని ఉపయోగించారు. భారత్ ఈ చర్చకు దూరంగా ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
నాకు తెలిసినంత వరకు, లేదు, గాజాలో ఇజ్రాయెల్ చర్యలను భారత అధికారిక వైఖరి జాతి నిర్మూలన అని పిలవడం లేదు. అయినప్పటికీ, గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ జాతి నిర్మూలన చర్యలకు పాల్పడిందని ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్ నిర్ధారించింది. కమిషన్ ఛైర్మన్ నవీ పిళ్ళై, విచారణల అనంతరం, మారణహోమంపై కుదిరిన ఒప్పందంలో పేర్కొన్న విధంగా గాజా మారణహోమం నిర్వచనానికి సరిపోతుందని నిర్ధారించారు.
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. హోలోకాస్ట్, మారణహోమంపై అధ్యయనాలు చేసే పండితులు కూడా ఇజ్రాయెల్ చర్యను మారణహోమంగా అభివర్ణించారు. జెనిన్ ప్రభుత్వ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరపడం, అంబులెన్స్‌లను సంఘటనా స్థలానికి చేరుకోకుండా అడ్డుకోవడం పాలస్తీనియన్లను నాశనం చేయడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమే. ఇవి యూదుల ఆధిపత్యాన్ని విశ్వసించే ప్రభుత్వం చేసే చర్యలు.
యూదు ప్రజల జీవితంతో పోలిస్తే పాలస్తీనియన్ ప్రజలుగా మా జీవితం ఏమీ లేదు. బ్రిటిష్ పాలనలో భారతీయుల ప్రాణాలకు విలువ లేకుండా పోయిన ఇలాంటి సమస్యలనే మీరు కూడా ఎదుర్కొన్నారు. నేను ఏప్రిల్ 1919 నాటి జలియన్‌వాలా బాగ్ మారణకాండ గురించి మాట్లాడుతున్నాను, అక్కడ బ్రిటిష్ జనరల్ భారతీయులకు గుణపాఠం నేర్పాలనుకోవడంతో దాదాపు 1,000 మంది భారతీయులు చంపబడ్డారు.
వారి ప్రాణాలకు అర్థం లేకుండా పోయింది. ఆ దాడికి ఆదేశించిన వ్యక్తి ఎన్నడూ శిక్షించబడలేదు లేదా జైలుకు వెళ్లలేదు. గాజాలోని నిస్సహాయ ప్రజలను శిక్షించడం ద్వారా ఇజ్రాయెలీయులు చేసినట్లే, బ్రిటిష్ అధీనంలో ఉన్నవారికి ఒక గుణపాఠం నేర్పాలన్నది అతని ఆలోచన.
హమాస్ దాడికి ప్రణాళిక వేస్తోందని యూఏఈ అధ్యక్షుడు బిన్ జాయెద్ స్వయంగా బెంజమిన్ నెతన్యాహును హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి? దీనిపై మీ అభిప్రాయం?
అందుకే అక్టోబర్ 7వ తేదీ దాడి ఒక బూటకపు దాడి అని చాలామంది నమ్ముతున్నారు. ఇది ఇజ్రాయెలీ మీడియా నుంచి వచ్చింది, మేము చెప్పడం లేదు. ఇది హారెట్జ్ దర్యాప్తు. అక్టోబర్ 7న ఏమి జరిగిందో ఒక అంతర్జాతీయ విచారణ కమిటీ దర్యాప్తు చేస్తుందని మేము ఎప్పుడూ చెబుతూనే ఉన్నాము. ఇజ్రాయెలీయులు కూడా దీనిపై దృష్టి పెట్టలేదు. ఈ ఆరోపణల మూలాలను తెలుసుకోవడానికి జాతీయ విచారణ కమిటీని ఏర్పాటు చేయలేదు.
వచ్చే నెల ఎన్నికల్లో నెతన్యాహు ఓడిపోతే పరిస్థితులు మారుతాయని మీరు అనుకుంటున్నారా?
ఇజ్రాయెల్‌లో తదుపరి ప్రభుత్వానికి ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నాయకత్వం వహించినా లేదా మరెవరైనా నాయకత్వం వహించినా, మా ప్రకారం, దానివల్ల ఎలాంటి తేడా ఉండదు. ఏ ఇజ్రాయెలీ రాజకీయ పార్టీ కూడా రెండు దేశాల పరిష్కారాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు.
Read More
Next Story