కేంద్రాన్నినమ్మి మొక్కజొన్న రైతులు మునిగిపోయారా ?
x
Telangana Agriculture Minister Tummala Nageswar Rao

కేంద్రాన్నినమ్మి మొక్కజొన్న రైతులు మునిగిపోయారా ?

పంటలకొనుగోలుకు అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని లేఖలో కోరారు


మద్దతుధర ప్రకటించి చేతులు దులుపుకోవటం వల్ల కేంద్రప్రభుత్వాన్ని నమ్ముకుని మొక్కజొన్నను పండించిన రైతులు నిండా ముణిగిపోతున్నారా ? మార్కెట్‌ధర మద్దతు ధరకన్నా రు. 700 తక్కువగా ఉండటంతో ఏమిచేయాలో రైతులకు దిక్కుతోచటంలేదు. అందుకనే మొక్కజొన్న రైతుల కష్టాలను గమనించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రప్రభుత్వానికి ఆదివారం లేఖ రాశారు. మొక్కజొన్న పంటను కొనుగోలు చేయటానికి ఈ సీజన్‌లో అయినా ముందుకు రావాలని, పంటలకొనుగోలుకు అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని లేఖలో కోరారు. ఇపుడు కొనుగోలు చేస్తున్న శనగ, పొద్దుతిరుగుడు పంటలపైన ఉన్న 25శాతం పరిమితిని ఎత్తేసి పండిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని తుమ్మల డిమాండ్ చేశారు.

రైతుల ఆదాయాన్ని 2024కల్లా రెట్టింపు చేస్తామని హామీఇచ్చిన కేంద్రప్రభుత్వం హామీని నిలబెట్టుకోవటంలో విఫలమైందన్నారు. పంటలకు మద్దతు ధర ప్రకటించటం వరకే కేంద్రం పరిమితమైందని వాస్తవ కొనుగోళ్ళకు మద్దతు ధరలు లభించటంలేదని దుయ్యబట్టారు. మార్కెట్ ధరకు మద్దతు ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నపుడు పంటల కొనుగోళ్ళకు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం మద్దతు ఇవ్వకపోవటాన్ని ఏ విధంగా అర్ధంచేసుకోవాలని ప్రశ్నించారు. పండిన పంటను పూర్తిగా కొనుగోలు చేయకుండా కేంద్ర పరిమితులు విధించటంతోనే రైతుల పట్ల కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధి అర్ధమవుతోందని ఎద్దేవాచేశారు. వరి అదికంగా ఉత్పత్తి అయినప్పటికీ, ధాన్యం సేకరణను ప్రతి ఏడాది తగ్గించేస్తోందని ఆరోపించారు. దొడ్డు బియ్యం సేకరణలో కేంద్రం చివరి నిముషంలో మాటమార్చటంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తుమ్మల లేఖలో వివరించారు.

సోయాబీన్, చిక్కుడు, వేరుశెనగ, పెసలు, పొద్దుతిరుగుడు పంటల విషయంలో మొత్తం ఉత్పత్తిలో కేంద్రం 25శాతం మాత్రమే కొనుగోలు చేయటం వల్ల మిగిలిన పంటకు మద్దతు ధర ప్రకటించి రాష్ట్రమే కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. ఫలితంగా రాష్ట్రప్రభుత్వంపై విపరీతమైన ఆర్ధికభారం పడుతోందని చెప్పారు. రాష్ట్రంలో విస్తృతంగా పండే మొక్కజొన్న పంట విషయంలో కూడా కేంద్రం కేవలం మద్దతుధర ప్రకటించి చేతులు దులిపేసుకుందని మండిపడ్డారు. కొనుగోళ్ళ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి కేంద్రం చేయూత ఇవ్వటంలేదని ఆరోపించారు. కేంద్రం తీరువల్ల తమ పంటలను ఎక్కడ అమ్ముకోవాలో రైతులకు అర్ధంకావటంలేదని చెప్పారు. బహిరంగ మార్కెట్లో పంటలకు మద్దతు ధరలు లభించకపోవటంతో రైతులు అవస్తలు పడుతున్నట్లు తెలిపారు.

ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న పంట మొత్తాన్ని సేకరించిన రాష్ట్రప్రభుత్వం కనీసం యాసంగి సీజన్ లో అయినా పూర్తి పంటలకు కేంద్రం అనుమతి ఇస్తుందన్న ఆశ అడియాసైందన్నారు. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం 200 మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభించి 1.20 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసినట్లు వివరించారు. మొక్కజొన్న పంటను కేంద్రప్రభుత్వ సంస్ధ నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని, అలాగే శనగ, పొద్దుతిరుగుడు పంట కొనుగోళ్ళపై 25 శాతం పరిమితిని ఎత్తేయాలని మంత్రి డిమాండ్ చేశారు.

Read More
Next Story