
“డిప్లొమా తర్వాత B.Tech ఉంటుందా? ‘శక్తి’తో కొత్త టెన్షన్!”
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం.
1) “డిప్లొమా తర్వాత B.Tech ఉంటుందా? ‘శక్తి’తో కొత్త టెన్షన్!”
2) “మా స్కూల్లో సౌకర్యాలు లేవు”.. హైకోర్టుకు పిల్లల లేఖలు!
3) హైదరాబాద్ ఓటుకు టాలీవుడ్ సెలబ్రిటీలు గుడ్‌బై?
1) “డిప్లొమా తర్వాత B.Tech ఉంటుందా? ‘శక్తి’తో కొత్త టెన్షన్!
”తెలంగాణ ప్రభుత్వం కార్మిక, ఉపాధి కల్పన శాఖను, 'శక్తి' (SKILL, Human Capital and Knowledge Training Initiatives - SHAKTI) శాఖగా పేరు మార్చింది. ఈ డిపార్ట్‌మెంట్ పరిధిలోనే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ని తీసుకొస్తూ ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (YISU) పరిధిలోకి తెస్తూ తెచ్చిన జీవో నంబర్ 97ను జారీ చేసింది.
ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
పాలిటెక్నిక్ ఒకచోట.. ఐటీఐ మరోచోట.. స్కిల్ ట్రైనింగ్ ఇంకోచోట! ఈ విధానం మార్చి.. చదువు → స్కిల్ → ట్రైనింగ్ → ఉద్యోగం అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. పరిశ్రమలకు ఏ స్కిల్స్ కావాలో.. అవే నేర్పాలి. శిక్షణ పూర్తయ్యాక.. ఉద్యోగానికి నేరుగా కనెక్ట్ చేయాలి. ఇదే ‘శక్తి’ వెనుక ప్రభుత్వ లాజిక్!
అయితే, విద్యార్థులు ఎందుకు రోడ్డెక్కుతున్నారు?
పాలిటెక్నిక్ అంటే కేవలం స్కిల్ కోర్సు కాదు. డిప్లొమా → ECET → B.Tech ఇదే వేలాది మంది విద్యార్థుల కెరీర్ మార్గం. ఇప్పుడు వారి భయం.. “మా డిప్లొమా విలువ తగ్గుతుందా?” “ECET Engineering Common Entrance Test ఉంటుందా?” “B.Tech లేటరల్ ఎంట్రీ కొనసాగుతుందా?” “మా సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు?” అన్నింటికంటే పెద్ద ప్రశ్న.. “మేము పాత విధానంలో అడ్మిషన్ తీసుకున్నాం.. మరి మధ్యలో వ్యవస్థ ఎందుకు మారుతోంది?” విద్యార్థులు అడుగుతున్నారు..“మా డిప్లొమా పరిస్థితి ఏంటి? బీటెక్ చేసే అవకాశం ఉంటుందా?” ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్‌టాపిక్!
స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో సాంకేతిక విద్యా వ్యవస్థలో భారీ రీసెట్ చేయడంపై విద్యార్థులు, అధ్యాపకుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ముందస్తు చర్చలు లేకుండా విద్యార్థులు, అధ్యాపకులను ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని నిరసిస్తున్నారు. ఎందుకంటే,
1) ఉన్నత చదువులపై అస్పష్టత: పాలిటెక్నిక్ తర్వాత ఈసెట్ (ECET) ద్వారా నేరుగా ఇంజనీరింగ్ (ల్యాట్రల్ ఎంట్రీ) చేసే అవకాశాలు కోల్పోతామని, మళ్లీ ఇంటర్మీడియట్ చదవాల్సి వస్తుందేమోనని విద్యార్థులు భయపడుతున్నారు.
2) డిప్లొమా గుర్తింపు కోల్పోవడం: మూడేళ్ల పాలిటెక్నిక్ టెక్నికల్ డిప్లొమా కోర్సు ప్రాధాన్యత తగ్గిపోయి, కేవలం పరిశ్రమలకు అవసరమైన కార్మికులుగా (లేబర్ కేటగిరీ) చూసే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
3) ఎస్బీటీఈటీ (SBTET) స్వతంత్రత దెబ్బతింటుంది: సాంకేతిక విద్యా మండలి స్వతంత్ర వ్యవస్థ కోల్పోయి, కోర్సులు నిర్వీర్యం అవుతాయని భావిస్తున్నారు.4) ప్రైవేటీకరణ భయాలు: పీపీపీ (PPP) విధానం వల్ల భవిష్యత్తులో ఫీజులు విపరీతంగా పెరిగి, పేద, గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్య దూరం అవుతుందని ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో పాలిటెక్నిక్, ఐటీఐ విద్యలో విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించి 112 పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 33,140 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. అలాగే 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్.. అంటే ATCల్లో 15,860 మంది విద్యార్థులు చేరారు. ఇక 230 ప్రైవేట్ ఐటీఐల్లో 63,968 మంది, 63 ప్రభుత్వ ఐటీఐల్లో 18,484 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మొత్తంగా పాలిటెక్నిక్, ATC, ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో కలిపి 98,312 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు.
అడ్మిషన్లు పూర్తయిన తర్వాత వ్యవస్థలో మార్పులు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం పెరిగి.. నిరసనలు మొదలయ్యాయి. వారు చెప్పేదేమిటంటే, విద్యార్థుల విద్య, నైపుణ్య శిక్షణ, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలతో ముడిపడిన కీలక మార్పు ఇది! అంటే..ఒక శాఖ మార్పు కాదు.. వేలాది మంది విద్యార్థుల చదువు వ్యవస్థలో మార్పు!
స్కిల్ యూనివర్సిటీ తీసుకురావడం తప్పు అని విద్యార్థులు చెప్పడం లేదు. కానీ.. స్కిల్ పేరుతో తమ భవిష్యత్తుపై ప్రయోగాలు చేయొద్దన్నదే వారి డిమాండ్! ఇప్పటికే అడ్మిషన్ పొందిన విద్యార్థుల విషయంలో ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇవ్వాలి. డిప్లొమా గుర్తింపు ఉంటుందా? ECET కొనసాగుతుందా? B.Tech అవకాశం ఉంటుందా? సిలబస్ ఎలా ఉంటుంది? పరీక్షలు ఎవరు నిర్వహిస్తారు? సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం రావాలి.
2) “మా స్కూల్లో సౌకర్యాలు లేవు”.. హైకోర్టుకు పిల్లల లేఖలు!
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈసారి ఆ సమస్యలను చెప్పడానికి విద్యార్థులు ఎంచుకున్న మార్గం ప్రత్యేకంగా నిలిచింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు 20 వేల మంది విద్యార్థులు.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్ట్‌కార్డులు రాశారు.
తమ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేవని.. ఉపాధ్యాయుల కొరతతో చదువుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు ఈ పోస్ట్‌కార్డుల్లో తమ చేతిరాతతో వివరించారు. తమకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21A కింద విద్యా హక్కు సక్రమంగా అందేలా చూడాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ పోస్ట్‌కార్డులు వెలుగులోకి తీసుకొచ్చాయి.చాలా పాఠశాలల్లో సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేదని విద్యార్థులు చెబుతున్నారు. బాలురు, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేకపోవడం మరో సమస్యగా పేర్కొన్నారు. అంతేకాదు.. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన పెంచాల్సిన సైన్స్ ల్యాబొరేటరీలు, పుస్తక పఠనాన్ని ప్రోత్సహించే లైబ్రరీలు, ఆటల కోసం ప్లేగ్రౌండ్లు, క్రీడా సామగ్రి కూడా చాలా చోట్ల అందుబాటులో లేవని విద్యార్థులు తమ లేఖల్లో ప్రస్తావించారు.
ఇక మరో కీలక సమస్య.. ఉపాధ్యాయుల కొరత. టీచర్లు లేకపోవడంతో తరగతులు సక్రమంగా జరగడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అంటే.. పాఠశాలకు వస్తున్నా చదువుకోవడానికి అవసరమైన వాతావరణం లేకపోతే.. విద్యార్థుల భవిష్యత్తుపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఇదే ప్రశ్నను ఇప్పుడు ఈ పోస్ట్‌కార్డులు నేరుగా హైకోర్టు దృష్టికి తీసుకెళ్తున్నాయి.
ఈ పోస్ట్‌కార్డుల్లో విద్యార్థులు రాసిన విషయాలు.. ప్రభుత్వ పాఠశాలల్లోని పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.
ఐదో తరగతి చదువుతున్న శ్రావణి తన లేఖలో.. తమ పాఠశాలలో తరగతి గదులు లేవని, మంచినీటి సదుపాయం లేదని, కంప్యూటర్లు కూడా లేవని రాసింది. తమకు ఈ సదుపాయాలు కల్పించాలని హైకోర్టును కోరింది.
మరో విద్యార్థిని వైష్ణవి తన పాఠశాలకు వెళ్లేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందిని వివరించింది. గువ్వలదిన్నె గ్రామం నుంచి నందిన్నె పాఠశాలకు వెళ్లేందుకు ఉదయం నాలుగు కిలోమీటర్లు.. సాయంత్రం మరో నాలుగు కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని తెలిపింది.
బస్సు సౌకర్యం లేకపోవడంతో కొంతమంది విద్యార్థులు చదువును మధ్యలోనే వదిలేస్తున్నారని.. తమకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరింది.ఇలాంటి లేఖలు వేల సంఖ్యలో రావడంతో.. ఇది ఒక్క పాఠశాలకు సంబంధించిన సమస్య కాదని, గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లోని విద్యార్థులు ఎదుర్కొంటున్న విస్తృత సమస్యలకు ప్రతిబింబంగా మారింది.
ఇప్పుడు ఈ 20 వేల పోస్ట్‌కార్డుల అంశం తదుపరి దశకు చేరింది. విద్యార్థులు రాసిన ఈ లేఖలను తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించి.. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా అంటే PILగా పరిగణించాలని ప్రచార నిర్వాహకులు కోరుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం ప్రతి చిన్నారికి విద్య హక్కు ఉందని.. ఆ హక్కు కేవలం పాఠశాలలో అడ్మిషన్ ఇవ్వడంతోనే పూర్తికాదని, కనీస మౌలిక వసతులు, ఉపాధ్యాయులు, సురక్షితమైన విద్యా వాతావరణం కూడా అవసరమని వారు చెబుతున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, విద్యాశాఖ వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
20 వేల పోస్ట్‌కార్డులు.. 20 వేల గొంతులు.. ఒకే డిమాండ్. “మాకు చదువుకునే హక్కు ఉంది.. ఆ హక్కుకు తగ్గ పాఠశాలలను కల్పించండి.” ఇప్పుడు ఈ విద్యార్థుల చేతిరాతలోని ఆవేదన.. తెలంగాణ హైకోర్టు దృష్టికి చేరడంతో.. న్యాయస్థానం ఎలా స్పందిస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది.
3) హైదరాబాద్ ఓటుకు టాలీవుడ్ సెలబ్రిటీలు గుడ్‌బై?
హైదరాబాద్‌లో నివసిస్తున్న టాలీవుడ్ ప్రముఖులు.. ఇప్పుడు తమ ఓటు హక్కును వదులుకుంటున్నారా? జూబ్లీహిల్స్‌లో ఓటర్లుగా ఉన్న పలువురు సినీ ప్రముఖులు.. తమ ఓటును ఆంధ్రప్రదేశ్‌లోని స్వగ్రామాలకు మార్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. అంటే SIR ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బూత్ స్థాయి అధికారులు ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలువురు టాలీవుడ్ ప్రముఖులను అధికారులు సంప్రదించినప్పుడు.. హైదరాబాద్‌లోని ఓటును తొలగించి, ఏపీలోని తమ స్వగ్రామాల్లోనే ఓటును కొనసాగించేందుకు వారు ఆసక్తి చూపినట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అయితే.. హైదరాబాద్‌లో దశాబ్దాలుగా నివసిస్తున్న సినీ ప్రముఖులు ఎందుకు తమ ఓటును సొంత ప్రాంతాలకు మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు? అసలు కారణమేంటి?
తెలంగాణ CEO కార్యాలయ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. పలువురు టాలీవుడ్ ప్రముఖులు తమ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని స్వగ్రామాల్లోనే ఓటు హక్కును కొనసాగించాలని భావించారు. దీనికి ప్రధాన కారణం.. సొంత ఊరితో ఉన్న అనుబంధమే అని అధికారులు చెబుతున్నారు.
చాలామంది సినీ ప్రముఖులు హైదరాబాద్‌లో స్థిరపడినప్పటికీ.. వారి స్వగ్రామాల్లో వ్యవసాయ భూములు, ఇళ్లు లేదా ఇతర ఆస్తులు ఉన్నాయి. వ్యక్తిగతంగా కూడా తమ సొంత ప్రాంతాలతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం విషయానికి వస్తే.. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. దశాబ్దాలుగా హైదరాబాద్‌లో ఉంటూ ఇక్కడే సొంత ఇళ్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు.అయినప్పటికీ.. ఓటు విషయంలో మాత్రం తమ స్వగ్రామాలకే ప్రాధాన్యం ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇక తెలంగాణలో జరుగుతున్న SIR ప్రక్రియలో హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల్లో శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన ఓటర్ల వివరాలను అధికారులు గుర్తించారు.ఈ నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్‌లోనే అత్యధికంగా ఓటర్లు ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలిపోయినట్లు గుర్తించారు.
మొత్తంగా 1,48,859 మంది ఓటర్లు శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు తేలింది. మరో 8,232 మంది మరణించినట్లు, 13,500 మంది ఓటర్ల అడ్రస్ లభ్యం కాలేదని అధికారులు గుర్తించారు.అలాగే 7,279 మంది ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదై ఉన్నట్లు గుర్తించారు.
ఇలాంటి వివరాలను పరిశీలించే క్రమంలోనే.. జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు కలిగిన పలువురు టాలీవుడ్ ప్రముఖులు తమ ఓటును ఏపీలోని స్వగ్రామాల్లో కొనసాగించేందుకు ఆసక్తి చూపినట్లు అధికారులు వెల్లడించారు.
ఇక తెలంగాణలో SIR ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ ప్రక్రియలో 93 లక్షల మంది ఓటర్లను అనామలిస్ జాబితాలో చేర్చినట్లు అధికారులు వెల్లడించారు. వీరికి నోటీసులు జారీ చేసి.. తమ ఓటు హక్కుకు సంబంధించిన వివరాలు, అవసరమైన పత్రాలను సమర్పించే అవకాశం కల్పించనున్నారు. నోటీసులు అందుకున్న వారు సెప్టెంబర్ 16లోగా స్పందించాల్సి ఉంటుంది.
అంటే.. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న SIR ప్రక్రియ కేవలం సాధారణ ఓటర్ల వివరాల పరిశీలనకే పరిమితం కాలేదు. సెలబ్రిటీల ఓట్ల విషయంలోనూ ఆసక్తికర పరిణామాలు బయటకు వస్తున్నాయి.హైదరాబాద్‌లో దశాబ్దాలుగా నివసిస్తున్నప్పటికీ.. ఓటు మాత్రం తమ సొంత ప్రాంతంలో కొనసాగించుకోవాలన్న టాలీవుడ్ ప్రముఖుల నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

