
ఉదయనిధి వార్తలపై ఎన్‌డీటివి, ఇండియా టుడేకు రూ.100 కోట్ల లీగల్ నోటీసు
ఉదయనిధి స్టాలిన్‌పై ప్రసారమైన కథనాలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఎన్‌డీటివి, ఇండియా టుడేలకు డీఎంకే నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపింది.
తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌కు సంబంధించిన వార్తల విషయంలో ఎన్‌డీటీవీ, ఇండియా టుడే మీడియా సంస్థలకు డీఎంకే లీగల్ నోటీసులు పంపింది. తమ నాయకుడి ప్రసంగాన్ని వక్రీకరించి ప్రసారం చేశారని ఆరోపిస్తూ, బేషరతుగా క్షమాపణ చెప్పాలని, వివాదాస్పద వీడియోలను తొలగించాలని, అలాగే రూ.100 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులో డిమాండ్ చేసింది.
‘ప్రసంగాన్ని వక్రీకరించారు’
ఉదయనిధి స్టాలిన్ తరపున డీఎంకే ఎంపీ, సీనియర్ న్యాయవాది పి. విల్సన్ ఈ లీగల్ నోటీసులు జారీ చేశారు. ఎన్‌డీటీవీ మేనేజింగ్ ఎడిటర్ శివ్ అరూర్, ఇండియా టుడే సీనియర్ ఎడిటర్ అక్షిత నందగోపాల్‌కు ఈ నోటీసులు పంపినట్లు తెలిపారు.
తంజావూరులో కావేరీ జలాల కోసం జరిగిన రైతుల సమావేశంలో ఉదయనిధి చేసిన ప్రసంగాన్ని కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చూపించాయని డీఎంకే ఆరోపించింది. అసలు విషయాన్ని మార్చి వివాదం సృష్టించేలా వార్తలు ప్రసారం చేశారని పేర్కొంది.
క్షమాపణతో పాటు రూ.100 కోట్ల డిమాండ్..
ఉదయనిధిపై వచ్చిన కథనాలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. అందుకే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, ఆ వార్తలకు సంబంధించిన వీడియోలు, ప్రసారాలను అన్ని వేదికల నుంచి తొలగించాలని కోరారు.
అలాగే రూ.100 కోట్ల నష్టపరిహారాన్ని కావేరీ నీటి కొరతతో నష్టపోయిన రైతులకు విరాళంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నోటీసు అందిన 48 గంటల్లోపు స్పందించాలని మీడియా సంస్థలను కోరారు.
అసలు వివాదం ఏమిటి?
తంజావూరులో జరిగిన రైతు సభలో ఉదయనిధి స్టాలిన్ నటి త్రిషను ఉద్దేశించి ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు.
ఆరోపణలను ఖండించిన ఉదయనిధి..
విడుదల అనంతరం ఉదయనిధి స్పందిస్తూ, తాను నటి త్రిష గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. కావేరీ జలాల సమస్యపై మాత్రమే మాట్లాడానని తెలిపారు. తన ప్రసంగంలోని కొన్ని భాగాలను కట్ చేసి, కాపీ చేసి, తప్పుగా ప్రచారం చేశారని ఆరోపించారు.
పోలీసులు తనను ఒక ఉగ్రవాదిలా అరెస్టు చేశారని కూడా విమర్శించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు రోజు జరిగిన ఈ అరెస్టుపై డీఎంకే కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం లీగల్ నోటీసుల దశకు చేరుకోవడంతో తమిళనాడు రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

