
కిడ్నీ సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసా ?
షుగర్ సమస్య ఉన్నవారికి కిడ్నీ సమస్య కాని లేదా కంటి సమస్య కాని వస్తుంది.
కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా ? నెఫ్రాలజీ డాక్టర్ కిరణ్మయి చెప్పిన ప్రకారం షుగర్ సమస్య ఉన్నవారికి కిడ్నీ సమస్య కాని లేదా కంటి సమస్య కాని వస్తుంది. ముఖ్యంగా కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత జనాల దైనందిన జీవితంలో మార్పుల కారణంగా చిన్నవయసులోని వారికి కూడా షుగర్, బీపీలు తొందరగా ఎటాక్ అవుతున్నట్లు తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు డాక్టర్ కిరణ్మయి చెప్పారు. షుగర్ వ్యాధిని గనుక కంట్రోల్ లో ఉంచుకోకపోతే కిడ్నీ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం దేశం మొత్తంమీద తెలంగాణలోనే కిడ్నీ సమస్య బాదితులు ఎక్కువగా ఉన్నారు. తెలంగాణలోని ప్రతి లక్షమందిలో కిడ్నీ వ్యాధి పీడితులు 10,600 మంది ఉన్నట్లు అధ్యయనంలో బయటపడింది. అలాగే 19 మంది కిడ్నీ వ్యాధితో చనిపోతున్నట్లు తేలింది అని చెప్పారు. కిడ్నీ వ్యాధితో చనిపోతున్న వారి సంఖ్య రాజస్ధాన్ లో అత్యల్పంగా 6.1 గా నమోదైతే తెలంగాణలో మరణాల సంఖ్య 19.84 గా నమోదు అవుతోందని తెలిపారు.
వ్యాధి ముదిరిపోయేంత వరకు తమకు కిడ్నీ వ్యాధి సోకిందని తెలుసుకోలకపోవటమే అసలైన సమస్యగా డాక్టర్ తెలిపారు. కాళ్ళవాపు, ఆకలి మందగించటం, నిద్ర సరిగా ఉండకపోవటం, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళాల్సి రావటం లాంటి లక్షణాలను కిడ్నీ వ్యాధి సోకిందనేందుకు లక్షణాలుగా గుర్తించాలని కిరణ్మయి చెప్పారు. అయితే చాలామంది ఈ లక్షణాలను సరిగా పట్టించుకోవటంలేదన్నారు. ప్రారంభదశలో ఈ లక్షణాలను గుర్తించి అప్రమత్తం కాకపోవటం వల్లే చివరకు కిడ్నీ సమస్య బాగా పెరిగిపోతోంది అని డాక్టర్ వివరించారు.
కిడ్నీ సమస్య రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవచ్చని కూడా చెప్పారు. వేళకు ఇంటి భోజనంచేయటం, ఆల్కహాలు, సిగిరెట్లకు దూరంగా ఉండటం, స్వీట్లు ఎక్కువగా తినకూడదని, ప్రతిరోజు క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయటంవల్ల కిడ్నీ సమస్యలు రాకుండా కొంతవరకు నియంత్రించుకోవచ్చని డాక్టర్ కిరణ్మయి వివరించారు.

