
‘మూసీ మురికి కడిగేస్తానంటే, అడ్డుకుంటారేమిటి?’
ముందు మూసీ ప్రాజక్టు రిపోర్టు చదవండని విమర్శకులకు సలహా
మూసీ నది ప్రక్షాళన కోసం చేపట్టే ప్రాజెక్టులో పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవరినీ నిరాశ్రయులను చేయమని, ఏ ఒక్కరికీ నష్టం జరక్కుండా వారందరికీ మరింత మెరుగైన వసతులతో ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రాజెక్టును ఆపడం కాకుండా సూచనలు ఇవ్వాలని ఆయన ప్రతిపక్షాలను కోరారు.
గతంలో ప్రాజెక్టును ప్రారంభించి వదిలేశారని, ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్తోందని సీఎం పేర్కొన్నారు.
’అభ్యంతరాలు ఉంటే సలహాల రూపంలో తెలియజేయవచ్చు. సూచనలు ఇవ్వడానికి ఇబ్బంది ఉంటే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తాము. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబుతో కమిటీ ఏర్పాటు చేసి సూచనలు స్వీకరిస్తాం,’ రేవంత్ చెప్పారు.
మూసీ ప్రక్షాళనకు సంబంధించిన ప్రణాళికలను క్షుణ్ణంగా చదివి, ప్రజలకు ఉపయోగపడే సలహాలు, సూచనలు చేస్తే ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.
ఇదే సమయంలో హైదరాబాద్ అభివృద్ధిపై కూడా సీఎం దృష్టి పెట్టారు. దేశంలో కీలక నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ప్రత్యేకతను వివరించారు. కాలుష్యం, ట్రాఫిక్, వరదల వంటి సమస్యలను ఇతర నగరాలు ఎదుర్కొంటున్నాయని, హైదరాబాద్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. నగరాన్ని మూడు జోన్లుగా విభజించినట్లు చెప్పారు. క్యూర్, ప్యూర్, రేర్ పేర్లతో విభజించి, సేవలు, పరిశ్రమలు, వ్యవసాయం రంగాల్లో అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.
కాలుష్య పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ బయటకు తరలిస్తామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అండర్ పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్‌లు నిర్మిస్తున్నామని చెప్పారు. మెట్రో విస్తరణకు చర్యలు కొనసాగుతున్నాయని, లాస్ట్ మైల్ కనెక్టివిటీపై దృష్టి పెట్టామని వివరించారు. మూసీ వెంట గండిపేట నుంచి గౌరెల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించి ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. చిన్న వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలు కల్పిస్తామని చెప్పారు. పాలనలో పారదర్శకత కోసం కొత్త విధానాలు అమలు చేస్తున్నామని, స్మార్ట్ గవర్నెన్స్‌పై దృష్టి సారించామని వివరించారు. నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించి పరిపాలన సులభతరం చేస్తున్నామని చెప్పారు. మొత్తంగా అభివృద్ధి కోసం రూపొందించిన రోడ్‌మ్యాప్‌కు అందరూ సహకరించాలని సీఎం కోరారు.

