హైదరాబాద్ లో సుమతి IPS విజిబుల్ పోలీసింగ్
x
మల్కాజిగిరి పోలీసు కమిషనర్ బి సుమతి ( ఫొటో : ఎక్స్ /మల్కాజిగిరి పోలీసు)

హైదరాబాద్ లో సుమతి IPS 'విజిబుల్ పోలీసింగ్'

మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణ, సైబర్ నేరాల గురిపెట్టిన కమిషనర్


మల్కాజిగిరి పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐపీఎస్ అధికారి బి సుమతి దూకుడు ప్రదర్శిస్తున్నారు. మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణ, సైబర్ నేరాల అరికట్టడమే లక్ష్యంగా “విజిబుల్ పోలీసింగ్”కు శ్రీకారం చుట్టారు. అండర్‌కవర్ ఆపరేషన్లు, డ్రోన్ పర్యవేక్షణ, హాస్టళ్ల సెక్యూరిటీ ఆడిట్లు, డ్రగ్ స్పాట్ టెస్టులతో మల్కాజిగిరి కమిషనరేట్‌లో కొత్త తరహా పోలీసింగ్ అమలు చేస్తున్నారు.

అండర్ కవర్ ఆపరేషన్

మల్కాజిగిరి పోలీసు కమిషనరు బి.సుమతి (B.Sumathi) విజిబుల్ పోలీసింగ్, పటిష్ఠమైన భద్రత, సెక్యూరిటీ ఆడిట్ ద్వారా సురక్షితమైన సమాజం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.మల్కాజిగిరి పోలీసు కమిషనర్‌గా మే 1వతేదీన బాధ్యతలు స్వీకరించిన సుమతి దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో అండర్ కవర్ ఆపరేషన్ చేసి సంచలనం సృష్టించారు. మహిళల భద్రతను పరిశీలించడానికి దిల్‌సుఖ్‌నగర్‌లో సల్వార్-సూట్ ధరించి, అర్ధరాత్రి ఒంటరిగా నిలబడి అండర్ కవర్ ఆపరేషన్ చేశారు.

సెక్యూరిటీ ఆడిట్ ను ప్రారంభిస్తున్న మల్కాజిగిరి పోలీసు కమిషనర్ బి సుమతి ( ఫొటో : ఎక్స్ /మల్కాజిగిరి పోలీసు)

డ్రగ్స్‌పై ఉక్కుపాదం

దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్ ప్రాంతాల్లో వేలాది మంది విద్యార్థులు ఉండటంతో అక్కడ డ్రగ్స్ ప్రభావాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాత్రివేళల్లో విద్యార్థుల కదలికలను డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. అనుమానాస్పద వ్యక్తులపై తక్షణమే పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులకు ప్రత్యేక డ్రగ్ డిటెక్షన్ కిట్లు అందించారు.పాన్ డబ్బాల ద్వారా నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్ విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.విద్యా కేంద్రంగా ఉన్న దిల్ సుక్ నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి చెప్పారు.
"తెలంగాణలో ఉన్న యువకులు కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలే తప్ప, క్షణికానందం కోసం డ్రగ్స్ కు బానిస కావొద్దు. ఒక్కసారి మత్తు పదార్థాల నిరోధక చట్టం కేసులో చిక్కుకుంటే, మీ కెరీర్ అక్కడితో ముగిసిపోతుంది" అని సీపీ పేర్కొన్నారు.

హాస్టళ్లలో పోలీసుల సమావేశం ( ఫొటో : ఎక్స్ /మల్కాజిగిరి పోలీసు)

హాస్టళ్లపై ప్రత్యేక నిఘా

సరూర్‌నగర్, ఎల్‌బీనగర్ పరిధిలోని హాస్టళ్లలో ప్రత్యేక సెక్యూరిటీ ఆడిట్లు నిర్వహించారు. హై రిజల్యూషన్ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు గమనిస్తే వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని హాస్టల్ నిర్వాహకులకు పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారిన హాస్టళ్లపై సీజ్ చర్యలు తీసుకోవడానికీ వెనుకాడబోమని సీపీ సుమతి స్పష్టం చేశారు.

శామీర్ పేటలో విజిబుల్ పోలీసింగ్ ( ఫొటో : ఎక్స్ /మల్కాజిగిరి పోలీసు)

విజిబుల్ పోలీసింగ్

శామీర్‌పేట పరిధిలోని డబుల్ బెడ్‌రూమ్ కాలనీల్లో సమావేశాలు నిర్వహిస్తూ డ్రగ్స్, సైబర్ మోసాల ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వ్యక్తిగత సమాచార భద్రత, ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణపై పోలీసులు ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నారు.
విజిబుల్ పోలీసు నిఘా, సామాజిక భద్రతా కార్యక్రమాలను బలోపేతం చేయడానికి మల్కాజిగిరి పోలీసు కమిషనర్ చర్యలు తీసుకున్నారు.

తెలంగాణ విశిష్ట మహిళా పురస్కారం

గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తూ, వందలాది మంది మావోయిస్టులు లొంగిపోవడంలో బి సుమతి కీలక పాత్ర పోషించారు.2022వ సంవత్సరంలో తెలంగాణ విశిష్ఠ మహిళా పురస్కారం అందుకున్నారు. ఈమె మహిళా భద్రత, సైబర్ క్రైమ్, మావోయిస్టుల లొంగుబాటులో కీలక పాత్ర పోషించారు.సాంకేతికతతో కూడిన పోలీసింగ్ కు, అలాగే మహిళలపై వేధింపులను అరికట్టడానికి సీపీ సుమతి ప్రాధాన్యమిస్తున్నారు.

మహిళల భద్రత, యువత భవిష్యత్తు, సాంకేతికత ఆధారిత పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన సీపీ బి.సుమతి చర్యలు ప్రస్తుతం మల్కాజిగిరి కమిషనరేట్‌లో చర్చనీయాంశంగా మారాయి.

Read More
Next Story