
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ (ఫొటో : ఎక్స్ పోస్టు/కిషన్ రెడ్డి)
రైల్వే స్టేషన్లకు అప్రోచ్ రోడ్లు విస్తరించండి: సీఎంకు కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్ పెట్టేందుకు కీలక ప్రతిపాదనలు
హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి టెర్మినల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ల వద్ద అప్రోచ్ రోడ్ల విస్తరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం లేఖ రాసిన ఆయన, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆలస్యం కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు అప్రోచ్ రోడ్ల విస్తరణకు వీలుగా భూసేకరణ చేయాలని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి టెర్మినల్, పునరాభివృద్ధి చెందుతున్న సికింద్రాబాద్ స్టేషన్ వద్ద మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో పలుమార్లు విన్నవించినా పనులు ప్రారంభం కాలేదని మంత్రి చెప్పారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్ వద్ద రోడ్డు విస్తరించండి
చర్లపల్లి రైల్వే స్టేసన్ వద్ద రోడ్లను విస్తరించాలని, గోడౌన్ రోడ్డు నుంచి కొత్త స్టేషన్ వరకు రహదారిని 200 అడుగులకు విస్తరించాలని కేంద్రమంత్రి సీఎంను కోరారు. భరత్ నగర్ వైపు ఉన్న 30 అడుగుల రోడ్డును 100 అడుగులకు విస్తరించాలని సూచించారు. ఈసీ నగర్ నుంచి ఎంఎంటీఎస్ ప్లాట్‌ఫాం వైపు ఉన్న రోడ్డును 100 అడుగులకు విస్తరించాలని కోరారు.స్టేషన్ వద్ద వాహనాల పార్కింగ్ ఇతర అవసరాల కోసం కొత్త బిల్డింగ్ వైపు మూడు ఎకరాలు, ఎంఎంటీఎస్ వైపు 2.70 ఎకరాల భూమి కేటాయించాలని సీఎంను అభ్యర్థించారు.రైల్వే శాఖ ఇప్పటికే రూ.4 కోట్లు జమ చేసినందున, స్టేషన్‌కు నీటి కనెక్షన్ త్వరగా ఇవ్వాలని కోరారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్డు అభివృద్ధి చేయండి
సికింద్రాబాద్ స్టేషను వద్ద ఉత్తర టెర్మినల్ రహదారిని ప్రయాణికుల రాకపోకలకు వీలుగా ఆల్ఫా హోటల్ నుంచి రేతీఫైల్ బస్టాండ్ వరకు ఉన్న రహదారిని 120 అడుగులకు విస్తరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ గతంలో ఉన్న ముఖ్యమంత్రికి 2022, జూన్ 15వతేదీన, 2023వ సంవత్సరం మార్చి 7వతేదీన రెండు ఉత్తరాలు రాశానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా 2024వ సంవత్సరం సెప్టెంబరు 8 వతేదీన సీఎం రేవంత్ రెడ్డి కి కూడా ఉత్తరం ద్వారా విషయం తెలియజేశానని, అయినప్పటికీ ఈ విషయంలో ఇప్పటి వరకూ పనులు ప్రారంభం కాలేదని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా చర్యలు తీసుకోండి
సీఎంగా రేవంత్ రెడ్డి గతంలో తెలంగాణ ప్రభుత్వ అధికారులకు సమస్య పరిష్కరించి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. అధికారుల బృందం రైల్వేస్టేషన్ అప్రోచ్ రోడ్లను పరిశీలించి చర్యలకు ఉపక్రమించినప్పటికీ, ఇంతవరకు ఎలాంటి ఫలితం లేదన్నారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా చొరవ చూపించి, నగరానికి ఎంతో అవసరమైన చర్లపల్లి రైల్వేస్టేషన్ కు ఇరువైపులా అప్రోచ్ రోడ్ల విస్తరణ, పార్కింగ్ తదితర అవసరాల నిమిత్తం అవసరమైన భూమి కేటాయింపు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అప్రోచ్ రోడ్డు విస్తరణకు అన్ని రకాల సహాయ సహకారాలను తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో కోరారు.
Next Story

