వేసవి రద్దీకి తిరుమలలో విస్తృత ఏర్పాట్లు
x

వేసవి రద్దీకి తిరుమలలో విస్తృత ఏర్పాట్లు

భక్తుల సౌకర్యం కోసం నీడ, తాగునీరు, వైద్య సేవలు, క్యూలైన్ల సదుపాయాలు విస్తృతంగా ఏర్పాటు చేశారు.


వేసవి రద్దీ పెరుగుతున్న వేళ తిరుమలలో భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. తాజా చర్యలతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. వేసవి సెలవులు, అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సుమారు రూ.2 కోట్లతో ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు ఎండ నుంచి ఇబ్బంది పడకుండా బాటగంగమ్మ సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో నీడ కల్పించే షెల్టర్లు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల కోసం అదనపు తాత్కాలిక షెల్టర్లు, కూల్ పెయింటింగ్ పనులు చేశారు. నాలుగు మాడ వీధుల్లో ప్రత్యేక పెయింట్ వేసి నేల వేడి తగ్గేలా చర్యలు తీసుకున్నారు. భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు క్యూలైన్ల వెంట తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. అలాగే పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టి చెత్తను తరచుగా తొలగిస్తున్నారు.

ఆరోగ్య విభాగం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకులు మొబైల్ వాటర్ డ్రమ్ములతో భక్తులకు తాగునీరు అందిస్తున్నారు. రోజుకు మూడు బ్యాచుల్లో 45 మంది సేవకులు ఈ పనిలో పాల్గొంటున్నారు. వైద్య సేవల కోసం తిరుమలలో 16 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. అదనంగా క్యూలైన్ల వద్ద మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేశారు. లడ్డూల సరఫరా కూడా పెంచారు. సాధారణంగా 3.50 లక్షల లడ్డూలు ఉండగా, రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 3.50 లక్షల లడ్డూలను నిల్వలో ఉంచారు.

వసతి విషయంలో పరిమితులు ఉన్నప్పటికీ, సుమారు 7500 గదులు అందుబాటులో ఉన్నాయి. గదులు లభించని భక్తులు లాకర్ల సదుపాయం వినియోగించుకోవచ్చు. పెద్ద కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తలనీలాల సమర్పణ కోసం ప్రధాన కల్యాణకట్టతో పాటు మరో 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1152 మంది క్షురకులు సేవలు అందిస్తున్నారు.

Read More
Next Story