తెలంగాణలో చిన్నబోతున్న కుటుంబాలు !
x

తెలంగాణలో చిన్నబోతున్న కుటుంబాలు !

సోషియో ఎకనామిక్ సర్వేలో జనాభా, లింగ నిష్పత్తి, భాష, బాల్య వివాహాలు, కుటుంబ నిర్మాణంపై కీలక వివరాలు వెల్లడి.


తెలంగాణ కుటుంబాలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగుచూశాయి. రానురాను రాష్ట్రంలోని కుటుంబాల పరిమాణం తగ్గిపోతోంది. కుటుంబాలు చిన్నవిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు ఉండే ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు చిన్నబోతున్నాయి. తాజాగా జరిగిన సామాజిక, ఆర్థిక, కుల సర్వేలో ఈ కొత్త ధోరణి స్పష్టమైంది. సర్వే ప్రకారం రాష్ట్రంలో సగటు కుటుంబ పరిమాణం 3.16గా నమోదైంది. గతంలో పెద్ద కుటుంబాలు సాధారణంగా ఉండగా, ఇప్పుడు దంపతులు, ఒక పిల్లతో చిన్న కుటుంబాలు పెరుగుతున్నట్లు తేలింది.

సామాజిక వర్గాల వారీగా చూస్తే ఓసీలలో కుటుంబ పరిమాణం అత్యల్పంగా 2.9గా ఉంది. బీసీలలో 3.1, ఎస్సీలలో 3.2, ఎస్టీలలో 3.3గా ఉంది. ముస్లింలలో అత్యధికంగా 3.5గా నమోదైంది. లింగ నిష్పత్తి పరంగా రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 979 మంది మహిళలు ఉన్నారు. బీసీ-సీ వర్గంలో 1023, ఎస్సీలలో 1007గా మంచి నిష్పత్తి కనిపించింది. ఓసీలలో ఇది 946తో తక్కువగా ఉంది. వయస్సు ప్రాతిపదికన విశ్లేషణలో ఓసీలలో వృద్ధుల శాతం ఎక్కువగా ఉండగా, పిల్లలు తక్కువగా ఉన్నట్లు తేలింది.

0 నుంచి 14 ఏళ్ల పిల్లలలో బీసీ-ఈ వర్గంలో అధిక శాతం నమోదైంది. ఐదు సంవత్సరాల లోపు పిల్లలు 9.8%, 6 నుంచి 14 ఏళ్ల వయస్సు వారు 16.6%గా ఉన్నారు. భాష పరంగా తెలుగు ప్రధాన స్థానంలో ఉంది. రాష్ట్రంలో 80.2% మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఎస్టీలలో 66.4% మంది గిరిజన భాషలు మాట్లాడుతుండగా, 31.7% మంది తెలుగు ఉపయోగిస్తున్నారు. ముస్లింలలో 23.2% మంది తెలుగు మాట్లాడుతున్నట్లు సర్వే తెలిపింది.

చట్టపరంగా నిషేధం ఉన్నప్పటికీ బాల్య వివాహాలు ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బాలికల్లో 5.6%, బాలురలో 5.0% బాల్య వివాహాలు నమోదయ్యాయి. ఈ సమస్య ఓసీ, ముస్లిం వర్గాల్లో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వితంతువుల శాతం 5.4గా ఉంది. ఇందులో ఎస్సీలలో అత్యధికంగా 6.2% నమోదు కాగా, ముస్లింలలో తక్కువగా 4.1% ఉంది. విడాకుల రేటు 0.6%గా ఉంది.

ఇక కుటుంబాల నాయకత్వంలో పురుషుల ఆధిపత్యం కొనసాగుతోంది. మహిళలు కేవలం 25.1% కుటుంబాలకు మాత్రమే నాయకత్వం వహిస్తున్నారు. ఎస్సీ, ముస్లిం వర్గాల్లో ఇది కొంత ఎక్కువగా ఉంది. మొత్తంగా ఈ సర్వే రాష్ట్రంలో కుటుంబ నిర్మాణం, జనాభా ధోరణులు, సామాజిక మార్పులపై కీలక చిత్రాన్ని చూపించింది. భవిష్యత్ విధానాల రూపకల్పనకు ఈ వివరాలు ఆధారంగా ఉపయోగపడే అవకాశముంది.

Read More
Next Story