
ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంట : రైతుకు పరిహారం ఏది?
అకాల వర్షాల దెబ్బకు రైతన్న విలవిల:నష్టపరిహారం కోసం ఎదురుచూపులు
ఫసల్ బీమా లేదు..పంట నష్టపరిహారం లేదు.. అన్నదాతకు అండ ఎవరు?
తెలంగాణలో ఖరీఫ్ నుంచి ఈ వేసవి వరకు వరుసగా కురిసిన భారీవర్షాలు, వరదలు, అకాల వడగళ్ల వానలతో లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం అందలేదు. ఫసల్ బీమా అమలు కాకపోవడం, పంట నష్టపరిహారం కూడా జాప్యం కావడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలు ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజనులో కురిసిన భారీవర్షాలు, వెల్లువెత్తిన వరదలు, ఈ వేసవికాలంలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వర్షాలతో వివిధ పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారాన్ని అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఖరీఫ్ సీజన్ నుంచి రబీ సీజన్ దాకా అధిక వర్షాలు, వరదలు, వడగళ్ల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు జరిపిన సర్వేలోనూ తేలింది. సర్వేల్లో దెబ్బతిన్న పంటలకు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని ప్రతిపాదనలు రూపొందించినా, ప్రభుత్వం మాత్రం రైతన్నలను ఆదుకోలేదు. తెలంగాణలో ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయక పోగా, మరో వైపు పంట నష్టపరిహారాన్ని కూడా ఇవ్వలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ వేసవికాలంలో గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వడగళ్ల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు.మార్కెట్ కు తీసుకువచ్చిన వరి ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
చేతికి వచ్చిన ధాన్యం కల్లంలో నీటిపాలైంది.నష్ట పోయిన రైతులు సర్కారు సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
మార్కెట్ లో వర్షాలకు తడిసిన ధాన్యం
రైతుల ఆవేదన
గతంలో భారీవర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు వ్యవసాయ శాఖ నుంచి నష్టపరిహారం అందలేదు. వ్యవసాయ శాఖ దెబ్బతిన్న పంటల గురించి నివేదికలు సిద్ధం చేసినా పరిహారం మాత్రం ఇవ్వడం లేదు. రైతులు వేలాది రూపాయల అప్పులు చేసి పెట్టుబడి పెట్టి వేసిన పంటలు అకాల వర్షాల వల్ల చేతికి రాక నష్టపోయారు. మళ్లీ కురిసిన అకాల వర్షాల వల్ల వివిధ పంటలు దెబ్బతిన్నాయి. తెలంగాణలోని లక్షలాది మంది రైతులు ఆవేదన చెందుతున్నారు.
అమలు కాని ఫసల్ బీమా యోజన
తెలంగాణలో పంటల బీమా పథకం అయిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) గత కొన్ని సంవత్సరాలుగా అమలులో లేదు.ఈ బీమా పథకానికి రాష్ట్ర వాటా నిధులు చెల్లించకుండా గత ప్రభుత్వం ఈ ఫసల్ బీమా పథకం నుంచి వైదొలిగింది. దీంతో తెలంగాణ రైతులకు బీమా రక్షణ కరువైంది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఫసల్ బీమాలో చేరుతామని ప్రకటించినా అమలు చేయలేదు. దీంతో గత ఖరీఫ్ సీజనులో జరిగిన నష్టాలకు ఈ బీమా వర్తించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
అకాల వర్షాలతో మొలకెత్తిన సోయాబీన్
పంట నష్టపరిహారం ఏది?
అకాల వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ పేరుతో పరిహారం ప్రకటిస్తుంది. కానీ అది రైతులకు చేరడం లేదు. పంట నష్టపరిహారం సర్వేలకే, ప్రతిపాదనలకే పరిమితం అయింది. వర్షం కురిసినప్పుడు అధికారులు వచ్చి దెబ్బతిన్న పంటల ఫొటోలు తీసుకుని, సర్వేలు చేసి వెళుతున్నారు. కానీ ఆ నివేదికలు సెక్రటేరియట్ స్థాయికి చేరి, నిధులు విడుదలయ్యే సరికి నెలలు, ఏళ్లు గడుస్తున్నాయి.పొలాలు సాగు చేసి నష్టపోయిన కౌలు రైతులకు ఒక్క రూపాయి సాయం కూడా అందడం లేదు.రాష్ట్ర ఖజానాలో నిధుల కొరత వల్ల రైతులకు పంట నష్టపరిహారం అందడం లేదు. ఎకరం పంట సాగుకు రూ.30వేలు పెట్టుబడి పెడితే, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిని పంట నష్టపరిహారం రాకపోవడం వల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
రైతు సంఘం డిమాండ్
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపరిహారం కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా 'డిజాస్టర్ ఫండ్' కేటాయించాలని, పంట నష్టం జరిగిన 15 రోజుల్లోపే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. సమగ్ర పంటల బీమా పథకం కింద ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ప్రతి ఎకరాకు బీమా రక్షణ కల్పించాలని ఆయన కోరారు. ‘‘పంట పండితే మార్కెట్‌లో ధర ఉండదు.. ప్రకృతి కన్నెర్ర చేస్తే చేతికి పంట రాదు.. ప్రభుత్వం నుంచి పరిహారం అందదు’’ఇదే నేడు తెలంగాణ రైతు ఎదుర్కొంటున్న త్రిశంకు స్వర్గం అని మల్లారెడ్డి ఆవేదనగా చెప్పారు.
తడిసిన ధాన్యం, మక్కలు
తెలంగాణలో 2026 మే నెలలో కురిసిన అకాల వడగళ్ల వర్షాల వల్ల పలు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మే9,10 తేదీల్లో రాత్రివేళ కురిసిన భారీవర్షాలతో మార్కెట్ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం, మక్కలు తడిసి ముద్దయ్యాయి.కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాల వల్ల వరి పంటతో పాటు మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన మక్కలు, ధాన్యం రాశులు వరద నీటిలో తడిసిపోయాయి.మే నెలలో కురిసిన అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి.
అకాల వర్షాలతో నేలకొరిగిన వరి కంకులు
కన్నీరుమున్నీరవుతున్న రైతులు
ఎంతో కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే తరుణంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.వ్యవసాయ శాఖ అధికారుల ప్రాథమిక నివేదికల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 61,000 నుంచి 65,000 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు అంచనా.
28వేల మంది రైతులు ఈ అకాల వర్షాల వల్ల నష్టపోయారు.రూ.330 కోట్ల పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ లెక్కలు కట్టారు.కానీ పైసా పరిహారం కూడా రైతులకు అందించలేదని కరీంనగర్ రైతు డి వేణుమాధవరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
ఏ పంటలు దెబ్బతిన్నాయంటే...
జిల్లాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల ప్రధానంగా వరి, జొన్న, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.59,000 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఎక్కువ భాగం కోతకు సిద్ధంగా ఉన్న పొలాలు లేదా కొనుగోలు కేంద్రాల్లో (IKP) ఆరబోసిన ధాన్యం ఉంది.రెండు వేల ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం జరిగింది.వేసవి కాలంలో కురిసిన అకాల వర్షాల వల్ల మామిడి తోటలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో భారీ ఈదురు గాలుల వల్ల 8వేల ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలాయి.చేతికి వచ్చిన పంట నేలపాలవ్వడంతో గ్రేడింగ్ దెబ్బతిని మార్కెట్ ధర పడిపోయింది.రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో టమోటా, మిరప తోటలు వెయ్యి ఎకరాల్లో నీట మునిగాయి.రాష్ట్రంలోని 150 మండలాల్లో పంట నష్టం తీవ్రత అధికంగా ఉంది.వరంగల్,హన్మకొండ జిల్లాల్లో ధాన్యం తడిసిపోవడం వల్ల అత్యధిక నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారుల నివేదికలే చెబతుతున్నాయి. జగిత్యాల, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో మామిడి, మొక్కజొన్న పంటలకు కోలుకోలేని దెబ్బ తగిలింది.నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో వడగళ్ల వానల వల్ల వరి పంట నేలకొరిగింది.సూర్యాపేట,నల్గొండ జిల్లాల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు వరద నీటిలో తడిశాయి.రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10వేలు చొప్పున పరిహారం అందించే దిశగా సర్వే నిర్వహించినా పరిహారం మాత్రం జాడ లేదు.తడిసిన ధాన్యాన్ని కూడా ఎటువంటి కోతలు లేకుండా కనీస మద్దతు ధరకు (MSP) కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.తడిసిన ధాన్యం విషయంలో తేమ శాతం నిబంధనలను సడలించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
నిర్మల్ జిల్లాలో దగ్ధమైన జొన్న పంట
కాలి బూడిదైన జొన్న, మొక్కజొన్న పంటలు
తెలంగాణలో ఎండకాలం వేడికి తోడు, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం లేదా సాంకేతిక లోపాలు అన్నదాతల పాలిట నిప్పులవుతున్నాయి. పొలాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల చేతికి వచ్చిన జొన్న, మొక్కజొన్న పంటలు కళ్లముందే కాలి బూడిదయ్యాయి.ఖమ్మం, సూర్యాపేట, జనగామ, ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్ జిల్లాల్లో గత వారం రోజులుగా పొలాల్లో మంటలు చెలరేగుతున్నాయి. ఎండ తీవ్రత వల్ల పంట పూర్తిగా ఎండిపోయి ఉండటంతో, చిన్న స్పార్క్ తగిలినా క్షణాల్లో మంటలు వ్యాపిస్తున్నాయి.కోతకు సిద్ధంగా ఉన్న జొన్న చేల మీదుగా వెళ్తున్న విద్యుత్ తీగలు ఒకదానికొకటి రాపిడి చెందడం లేదా లూజ్ కాంటాక్ట్ వల్ల నిప్పురవ్వలు ఎగిరి పడటంతో ఎకరాల కొద్దీ పంట కాలిపోయింది.
ఎకరానికి రూ.40వేలు నష్టం
మొక్కజొన్న సాగు చేసిన రైతులు కంకులు కోసి పొలంలోనే ఆరబోసిన తరుణంలో ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకుంటున్నాయి. ఒక్కో రైతుకు ఎకరాకు రూ.40వేల నుంచి రూ.60వేల వరకు పెట్టుబడి నష్టం వాటిల్లింది.రైతులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించినప్పటికీ, ఫైర్ ఇంజన్లు వచ్చేలోపే పంట మొత్తం కాలిపోయిందని మరో రైతు బాపన్న చెప్పారు.
‘‘ఆరు నెలలు కష్టపడి, అప్పులు తెచ్చి పండించాను. రేపు కోత కోద్దామనుకునే లోపే నా కళ్లముందే అంతా బూడిదైపోయింది. ఒక్క గింజ కూడా ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి లేదు’’ అని ఆదిలాబాద్ జిల్లా జొన్న రైతు ఎస్ విలాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడమే రైతులకు ఇప్పుడున్న ఏకైక ఆశ.ఖరీఫ్ నష్టానికి సంబంధించి సర్వే ప్రక్రియ పూర్తయింది, కానీ పూర్తిస్థాయి నగదు జమ ఇంకా పెండింగ్‌లోనే ఉంది.ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పరిహారం అందించాలని, పండ్ల తోటల రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.రైతులు ఇప్పుడు ఈ మే నెల అకాల వర్షాల నష్టంతో పాటు, పాత ఖరీఫ్ బాకీల కోసం కూడా ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Next Story

