
క్యాన్వాస్ వెంచర్స్ బియ్యంపై FDA అలర్ట్..
FDA అలర్ట్ తర్వాత తెలంగాణ బియ్యంపై పెరిగిన స్క్రూటినీ?
తెలంగాణ నుంచి అమెరికాకు భారీగా బియ్యం ఎగుమతి అవుతోంది. ముఖ్యంగా తెలంగాణ సోనా, ఆర్.ఎన్.టీ-9001తో పాటు బాస్మతి బియ్యానికి అమెరికా మార్కెట్‌లో డిమాండ్ ఉంది. దేశవ్యాప్తంగా 2024-25లో 2.019 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయింది. తెలంగాణ, దేశ బియ్యం ఉత్పత్తిలో 11.62 శాతం వాటాతో ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. అయితే, 2026 సెప్టెంబర్ 15న హైదరాబాద్‌కు చెందిన క్యాన్వాస్ వెంచర్స్ సంస్థకు సంబంధించిన బియ్యం ఉత్పత్తుల్ని అమెరికా ఎఫ్.డీ.ఏ. దిగుమతి హెచ్చరిక రెడ్ లిస్ట్‌లో చేరడం చర్చకు దారితీసింది.
అమెరికా ఎఫ్.డీ.ఏ. రెడ్‌లిస్ట్ హెచ్చరిక 99-08 కింద, పురుగుమందుల అవశేషాల సమస్య ఉన్న నిర్దిష్ట సంస్థలు, ఉత్పత్తులను భౌతిక తనిఖీ లేకుండానే నిలిపివేసే విధానం ఉంది. ఇది దేశవ్యాప్తంగా అన్ని బియ్యం ఎగుమతులపై నిషేధం కాదు. హైదరాబాద్‌లోని క్యాన్వాస్ వెంచర్స్ సంస్థ ఉత్పత్తులకు సంబంధించిన చర్య మాత్రమే.
"క్యాన్వాస్ వెంచర్స్‌కు సంబంధించిన బియ్యం ఉత్పత్తుల్లో జాస్మిన్ రైస్, ప్యాక్ చేసిన బియ్యంలో క్లోర్‌పైరిఫాస్ అనే పురుగుమందు అవశేషాల సమస్యను ఎఫ్‌డీఏ పేర్కొంది. దీంతో సంబంధిత సరుకు అమెరికా పోర్టుకు చేరితే, సాధారణ భౌతిక తనిఖీ లేకుండానే నిలిపివేస్తారు. కాబట్టి అమెరికా మార్కెట్‌లో తెలంగాణ బియ్యంపై మరింత scrutiny పెరిగే అవకాశం ఉందని" Agricultural and Processed Food Products Export Development Authority (APEDA) AGM, Regional Head R.P. Naidu ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు. “అమెరికాకు ఎగుమతి చేసే సరుకులకు పురుగుమందుల అవశేషాల పరీక్షలు, ప్రయోగశాల ధ్రువీకరణ, నాణ్యతకు సంబంధించిన పత్రాల విషయంలో ఎగుమతిదారులు మరింత జాగ్రత్తగా ఉండాలి.” అంటారు ఆర్.పి.నాయుడు.
"తెలంగాణకు ఏటా 50–60 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి సామర్థ్యం ఉన్నప్పటికీ, 2025లో ఎగుమతులు 20 నుంచి 30 శాతం తగ్గాయి. అధిక ధాన్యం కొనుగోలు ధరలు, థాయిలాండ్–వియత్నాం నుంచి పెరిగిన పోటీ, PDS కొనుగోళ్లు, సముద్ర రవాణా ఖర్చులు పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా" తెలంగాణ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడి పాడి గణపతి రెడ్డి చెప్పారు.
"అమెరికా ప్రభుత్వ వాణిజ్య, దిగుమతి విధానాల ప్రభావంతో తెలంగాణ రైతులకు అమెరికా మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, ఎగుమతులపై అనిశ్చితి, ధరలపై ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా బియ్యం వంటి పంటల్లో ఎగుమతులు మందగిస్తే, మిల్లర్లు, ఎగుమతిదారుల కొనుగోళ్లు తగ్గి రైతులకు గిట్టుబాటు ధరపై ప్రభావం పడే అవకాశం ఉందని" తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ అభిప్రాయపడ్డారు.
"బియ్యంలో పురుగు మందు అవశేషాలు వుండవు. ఎందుకంటే వరి పంటకు ఎరువులు వేస్తారు కానీ, పురుగుమందులు ఎక్కువగా కొట్టరు. అమెరికా కూడా జి.ఐ. ట్యాగ్ వున్న బియ్యం మాత్రమే కొంటుంది. తెలంగాణా బియ్యానికి వచ్చిన ప్రమాదం ఏమీ వుండకపోవచ్చు. ప్రత్యేకించి క్యాన్వాస్ వెంచర్ బియ్యంలో క్లోర్ పైరిఫాస్ పురుగు మందు ఆనవాళ్ళు వున్నట్లు ఎఫ్.డి.ఏ. అనుమానించి రెడ్‌లిస్ట్ చేసిందని" ఎవర్‌గ్రీన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పాశం ప్రసాద్ తెలిపారు. తెలంగాణ నుంచి అమెరికాకు ఏటా సుమారు 40 వేల నుంచి 50 వేల టన్నుల బియ్యం ఎగుమతి అవుతున్నట్లు డాక్టర్ ప్రసాద్ చెప్పారు.
"దేశీయ మార్కెట్‌తో పోలిస్తే అమెరికా వంటి దేశాల్లో దిగుమతి నాణ్యత ప్రమాణాలు మరింత కఠినంగా ఉంటాయి. బియ్యం సాగు నుంచి మిల్లింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా వరకు ప్రతి దశలో పురుగుమందుల అవశేషాల నియంత్రణ కీలకం. రైతులు వాడే పురుగు మందులు, కోతకు ముందు వాటి వినియోగం, అవశేషాల పరీక్షలు, ప్రయోగశాల ధ్రువీకరణ వంటి అంశాలు ఎగుమతిదారులకు ముఖ్యం" అంటారు ప్రముఖ రైస్ ఎక్స్‌పోర్టర్ ఎస్.కె.బాజీ.
అమెరికా వంటి మార్కెట్లలో నాణ్యత ప్రమాణాలు కఠినంగా మారుతున్న వేళ, రైతు పొలం నుంచి బియ్యం అమెరికా మార్కెట్ వరకు వెళ్లే ప్రతి దశలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. ఎగుమతులు పెరిగితే మార్కెట్ విస్తరిస్తుంది. మార్కెట్ విస్తరిస్తే రైతులకు కొనుగోలు అవకాశాలు పెరుగుతాయి.
ఎగుమతులను పెంచేందుకు నిజామాబాద్‌ను ప్రధాన హబ్‌గా చేసుకుని ప్రత్యేక రైస్ ఎక్స్‌పోర్ట్ పాలసీ రూపొందించేందుకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇండోనేషియా, ఆఫ్రికా, ఫిలిప్పీన్స్ మార్కెట్లకు ఎగుమతులను పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని యోచిస్తోంది. తెలంగాణ బియ్యానికి ప్రపంచంలో డిమాండ్ ఉంది. ఇప్పుడు ఆ డిమాండ్‌ను దీర్ఘకాలిక మార్కెట్‌గా మార్చగలమా? అనేదే అసలు ప్రశ్న.

