
ఫిన్లాండ్‌లో మిస్టరీగా మారిన మణిదీప్ వ్యవహారం
ఫిన్లాండ్ పోలీసులు చెబుతున్నట్లుగా మణిదీప్ మరణించాడా ? లేకపోతే తల్లి, దండ్రులు అనుమానిస్తున్నట్లు తమ కొడుకును ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్నదే అర్ధంకావటంలేదు
ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్‌కు వెళ్ళిన తెలంగాణలోని ఇబ్రహింపట్నం, శేరిగూడ యువకుడు గుజ్జ మణిదీప్ రెడ్డి వ్యవహారం ఇపుడు మిస్టరీగా మారింది. ఫిన్లాండ్ పోలీసులు చెబుతున్నట్లుగా మణిదీప్ మరణించాడా ? లేకపోతే తల్లి, దండ్రులు అనుమానిస్తున్నట్లు తమ కొడుకును ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్నదే అర్ధంకావటంలేదు. మే 4వ తదీన తల్లి, దండ్రులు గుజ్జ ముత్యంరెడ్డి, మమతతో చివరిసారిగా మాట్లాడిన మణిదీప్ నుండి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే ఐదు రోజుల తర్వాత అంటే మే 11వ తేదీన మణిదీప్ ఫ్రెండ్, పూనేకి చెందిన కృష్ణ ఫిన్లాండ్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఏమనంటే గడచిన ఐదురోజులుగా తనమిత్రుడు మణిదీప్ కనిపించటంలేదని. అప్పటినుండి ఇప్పటివరకు దాదాపు 65 రోజులుగా తమ కొడుకు నుండి తమకు ఎలాంటి సమాచారం అందలేదని తల్లి, దండ్రులు తీవ్ర ఆవేధనపడుతున్నారు. దాంతో అసలు ఏమి జరిగింది అన్నదే మిస్టరీగా మారిపోయింది.
ఇంతకీ విషయం ఏమిటంటే ఫిన్లాండ్, లహతి అనే పట్టణంలోని ఎల్యూటీ యూనివర్సిటిలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదవటానికి మణిదీప్ 2025, ఆగస్టులో వెళ్ళాడు. మే 5వ తేదీన మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు రాశాడు. అదేరోజు తన తల్లి, దండ్రులకు ఫోన్ చేసి ఇండియన్ కరెన్సీ 5వేలు కావాలని అడిగాడు. వెంటనే తల్లి, దండ్రులు మణిదీప్ ఖాతాలో డబ్బులు వేశారు. తర్వాత బస్సు టికెట్, రైలు టికెట్ ఆ డబ్బులతో కొన్నాడు. అప్పటినుండి మళ్ళీ ఇప్పటివరకు మణిదీప్ నుండి ఇంటికి ఫోన్ రాలేదు, ఎలాంటి సమాచారం అందలేదు. 9వ తేదీన మణిదీప్ కనబడటంలేదని పోలీసులకు ఫిర్యాదుచేసిన మిత్రులే తల్లి, దండ్రులకు కూడా ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అప్పటినుండి కుటుంబసభ్యుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
కొడుకు సమాచారం కోసం తల్లి, దండ్రులు ఫిన్లాండ్ పోలీసులకు తరచూ ఫోన్లు చేస్తున్నారు, మెయిల్స్ ద్వారా సంప్రదించటమే కాకుండా ఫిన్లాండ్ లోని ఇండియన్ ఎంబసీతో కూడా మాట్లాడుతున్నారు. అయితే ఎన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా మణిదీప్ ఆచూకీ మాత్రం దొరకలేదు. ఈ నేపధ్యంలోనే ఈనెల 9వ తేదీన కృనువు ఓరెంటాన్ సముద్ర తీరంలో ఒక డెబ్ బాడీ దొరికిందని తమ దగ్గరున్న ఆధారాలతో పోల్చితే అది మణిదీప్ రెడ్డిదే అని తేలిందని ఫిన్లాండ్ పోలీసుల నుండి తల్లి, దండ్రులకు సమాచారం అందింది. తమకు అందిన సమాచారాన్ని తల్లి, దండ్రులు నమ్మటంలేదు. ఎందుకంటే మే 5వ తేదీన తమతో మాట్లాడిన కొడుకు ‘‘తాను హెల్సింకీకి వెళుతున్నాను’’ అని చెప్పాడు అంటున్నారు. హెల్సింకీకి వెళ్ళటానికి అక్కడ ఫ్రెడ్స్ ఎవరూలేరని, నిజానికి తమ కొడుకు అందరితోను అంత తొందరగా కలవడు అని గట్టిగా చెబుతున్నారు.
ఇదే విషయమై మణిదీప్ కజిన్ సిస్టర్ అనూహ్య ‘‘తెలంగాణ ఫెడరల్’’ తో మాట్లాడుతు ‘‘డీఎన్ఏ టెస్టు, అటాప్సీ టెస్టులు ఏవీ చేయకుండానే దొరికిన బాడీ మణిదీప్‌దే అని ఫిన్లాండ్ పోలీసులు ఎలా తేల్చారు’’ అని ప్రశ్నించారు. ‘‘తన సోదరుడిని ఎవరో కిడ్నాప్ చేశారు’’ అని ఆరోపిస్తున్నారు. ‘‘తమ దేశంలో జీరో క్రైమ్ రేట్ అనే రికార్డును మెయిన్ టైన్ చేయటానికే మణిదీప్ కేసును ఆత్మహత్యగా పోలీసులు చిత్రీకరిస్తున్నారు’’ అని ఆరోపించారు. మణిదీప్ మిస్సింగ్ వ్యవహారంలో తమపై పెరిగిపోతున్న ఒత్తిడి తట్టుకోలేక తనసోదరుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కుట్రలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. ‘‘ఆత్మహత్య చేసుకునే వాడు అయితే సముద్రంలోకి ఎందుకు వెళతాడు’’ అని అనుమానం వ్యక్తంచేశారు. ‘‘అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం మణిదీప్ కు ఏమీలేదు’’ అని కూడా అన్నారు.
‘‘లహతిలోని కేమార్ట్ పార్కింగ్ దగ్గర మొబైల్ చివరి సిగ్నల్ చూపించిందని తాము ఎంత చెప్పినా పోలీసులు పట్టించుకోవటంలేదు’’ అని చెప్పారు. తమసోదరుడి మిస్సింగ్ వ్యవహారం బాగా వైరల్ అయ్యింది కాబట్టి పోలీసులు తమను మిస్ గైడ్ చేస్తున్నారనే అనుమానాలను అనూహ్యం వ్యక్తం చేశారు. ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా తమ సోదరుడి విషయంలో సరైన శ్రద్ధ చూపలేదని మండిపడ్డారు. ‘‘నెలరోజుల క్రితం ఎంబసీ అధికారులు తమతో మాట్లాడుతు ఫిన్లాండ్ పోలీసులకు తమకు మధ్య మీడియేషన్ లాగే వ్యవహరించారు’’ అని ఆరోపించారు.
‘‘లహతి నుండి 100 కిలోమీటర్ల దూరంలోని హెల్సింకీకి వెళుతున్నట్లు చెప్పాడు’’ అని సోదరి వివరించింది. అయితే ‘‘హెల్సింకీలో తనకు మిత్రులు ఎవరూ లేనపుడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అన్నదే పెద్ద మిస్టరీగా మారింది’’ అని అనుమానం వ్యక్తంచేసింది. ‘‘ఈకోణంలో దర్యాప్తుచేయమని తాము పోలీసులకు ఎంతచెప్పినా వినిపించుకోవటంలేదు’’ అని ఆవేధన వ్యక్తంచేశారు. ‘‘తమసోదరుడి మిస్సింగ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా తాము ఇండియన్ ఎంబసీ పైన తెలంగాణ హైకోర్టులో కేసు వేశాము’’ అని చెప్పారు. ‘‘ఆ కేసుపై ఈనెల 16న హైకోర్టులో విచారణ జరగబోతోంది’’ అని చెప్పారు. ‘‘సోదరుడి మిస్సింగ్ వ్యవహారం తెలియగానే తల్లి, దండ్రులు ఫిన్లాండ్ కు వెళ్ళటానికి ప్రయత్నిస్తే వీసాలు రెజెక్టయ్యాయి’’ అని సోదరి వివరించారు. ‘‘తమను ఫిన్లాండ్ కు రాకుండా అక్కడి ప్రభుత్వం అడ్డుకుంటున్న కారణంగానే తమకు అనుమానాలు పెరిగిపోతున్నాయి’’ అని అనూహ్య ఆరోపించారు

