
కరీంనగర్‌లో కాల్పుల కలకలం.. జ్యువెలరీ షాపులో భారీ దోపిడీ
కస్టమర్ల వేషంలో వచ్చిన దుండగులు కాల్పులు జరిపి ఆభరణాలు దోచుకెళ్లారు. గాయపడిన సిబ్బందికి చికిత్స కొనసాగుతోంది.
కరీంనగర్ నగరంలో పట్టపగలే జరిగిన కాల్పులు, దోపిడీ ఘటన తీవ్ర కలకలం రేపింది. జ్యోతినగర్‌లోని పీఎంజీ జ్యువెలరీ షాపును లక్ష్యంగా చేసుకుని దుండగులు తుపాకులతో దాడి చేసి భారీగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో షాపును సిబ్బంది తెరిచారు. లాకర్‌లో ఉన్న నగలను డిస్‌ప్లేలో పెడుతుండగా, బైకులపై వచ్చిన దుండగులు కస్టమర్లలా నటిస్తూ లోపలికి ప్రవేశించారు. కొద్దిసేపటి తర్వాత వారు తుపాకులు బయటకు తీసి సిబ్బందిని బెదిరించారు.
సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయడంతో దుండగులు కాల్పులకు దిగారు. సుమారు 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు నుంచి నలుగురు సిబ్బంది గాయపడ్డారు. కొందరు భయంతో బాత్‌రూమ్‌లో దాక్కున్నట్లు తెలిసింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు షాపులో ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. అనంతరం దుండగులు భారీగా బంగారు ఆభరణాలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. పారిపోతూ ఒక దుండగుడు కిందపడినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సీపీ గౌస్ ఆలం స్వయంగా పరిశీలించారు. షాపు సమీపంలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ మ్యాగజైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఘటనాస్థలంలో బుల్లెట్లను కూడా గుర్తించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది. ఈ దోపిడీకి ముందు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటన జరిగిన ప్రాంతం ప్రముఖుల నివాసాలకు సమీపంలో ఉండటం గమనార్హం. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

