
జూరాల నీరు ఆకుపచ్చగా మారింది.. చేపలు చనిపోతున్నాయి!
జూరాల నీరు కలుషితమైందా?
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం.
1) జూరాల నీరు ఆకుపచ్చగా మారింది.. చేపలు చనిపోతున్నాయి!
2) రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్న ఆర్టీసీ ఎన్నికలు..!
3) సైబర్ క్రైమ్‌పై పోలీసుల మెగా ఆపరేషన్! 101 మంది అరెస్ట్
1) జూరాల నీరు ఆకుపచ్చగా మారింది.. చేపలు చనిపోతున్నాయి!
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణా నది నీరు ముదురు ఆకుపచ్చగా మారడం ఆందోళన కలిగిస్తోంది. బ్యాక్‌వాటర్‌లో దాదాపు 40 శాతం నీరు రంగు మారడంతో పాటు దుర్వాసన రావడం, చేపలు మృత్యువాత పడుతున్నాయి. నాగార్జునసాగర్ సమీపంలోని దయ్యాలగండి, ప్రధాన డ్యామ్ వద్ద కూడా నీరు ఆకుపచ్చగా కనిపిస్తోంది.
“అడుగున ఉన్న నాచు పైకి రావడం వల్లే నీటి రంగు మారింది” అని జూరాల ప్రాజెక్టు ఎస్ఈ మల్లికార్జునరావు తెలిపారు.
“పడవలో వెళ్లి పరిశీలించగా సుమారు 40 శాతం నీరు రంగు మారినట్లు గుర్తించాం” అని జూరాల ఇరిగేషన్ డీఈ నాగేశ్వర్రావు తెలిపారు.
మరోవైపు మిషన్ భగీరథ అధికారులు నీటిని పరీక్షించి “బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించలేదు” అని వెల్లడించారు.
ఆల్గే (పాచి) విపరీతంగా పెరగడంతో నీరు ఆకుపచ్చగా మారింది. "ఆల్గే కుళ్లిపోవడంతో వాటిని విచ్ఛిన్నం చేసే బ్యాక్టీరియా నీటిలోని ఆక్సిజన్ (DO)ను వినియోగించింది. దీంతో ఆక్సిజన్ స్థాయులు తగ్గి.. చేపలకు శ్వాస తీసుకునేందుకు సరిపడా ఆక్సిజన్ అందక మృత్యువాత పడ్డాయి. రాయచూరు పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఎంతమేర కాలుష్యం చేరిందన్నది ల్యాబ్ పరీక్షలతోనే తేలనుందని" పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.
జూరాల ప్రాజెక్టు నీరు ఆకుపచ్చగా మారడంపై ఐఐసీటీ మాజీ సైంటిస్ట్ డాక్టర్ బాబు రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఉష్ణోగ్రతలు పెరగడం, నీటిలో పోషక పదార్థాలు అధికం కావడం వంటి కారణాలతో ఆల్గే విపరీతంగా పెరిగిందని ఆయన ఫెడరల్‌కు తెలిపారు. ఈ ప్రక్రియలో కొన్ని రకాల హానికరమైన ఆల్గేలు విషపూరిత పదార్థాలను ఉత్పత్తి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
“ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల నీటిలో కొన్ని రకాల ఆల్గేలు పెరిగి, న్యూరోటాక్సిక్, హెపటోటాక్సిక్ వంటి హానికరమైన టాక్సిన్లు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇవి మనుషులు, జంతువులు, నీటిలో జీవించే ఇతర జీవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.” ఆ నీటిని వేడి చేసి తాగినా టాక్సిన్ల ప్రమాదం పూర్తిగా తొలగిపోదని డాక్టర్ బాబు రావు చెప్పారు.
“ఈ నీటిని ఉపయోగించే ముందు దాని నాణ్యతను సమగ్రంగా పరీక్షించాలి. ముఖ్యంగా ఆల్గే నుంచి విడుదలయ్యే సయానో టాక్సిన్లు (విషపదార్థాలు) వంటి హానికరమైన పదార్థాల కోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలి.” ఇలాంటి ఆల్గల్ టాక్సిన్లు నీటిలోకి చేరితే వాటి ప్రభావం కేవలం మనుషులకే పరిమితం కాకుండా పశువులు, వన్యప్రాణులు, చేపలపై కూడా పడే అవకాశం ఉందని బాబు రావు చెప్పారు.
“ఆఫ్రికాలో కూడా ఆల్గే బ్లూమ్స్ కారణంగా నీటిలో టాక్సిన్లు పెరిగి, వాటిని తాగిన వన్యప్రాణులు, ముఖ్యంగా ఏనుగులు చనిపోయిన ఘటనలు నమోదయ్యాయి. అందువల్ల జూరాల వద్ద కనిపిస్తున్న ఈ పరిస్థితిని తేలిగ్గా తీసుకోకూడదు. నీటి నమూనాలతో పాటు ఆల్గే నమూనాలను కూడా పరీక్షించాలి.”
ప్రస్తుతం కనిపిస్తున్న ఆకుపచ్చ రంగుకు కారణం సాధారణ ఆల్గేనా, లేక విషపూరిత ఆల్గే జాతుల పెరుగుదలా అన్నది నిర్ధారించడం అత్యంత కీలకమని డాక్టర్ బాబు రావు అన్నారు.జూరాల నీటిని సాగునీటితో పాటు తాగునీటి అవసరాలకు కూడా వినియోగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
అధికారులు, సైంటిస్టులు నాచు పెరుగుదల వల్లే నీటి రంగు మారి ఉండొచ్చని చెబుతుండగా, రాయచూరు పారిశ్రామిక ప్రాంతాల నుంచి వ్యర్థాలు కృష్ణా నదిలో కలుస్తున్నాయని స్థానికులు, మత్స్యకారులు చెప్పారు. ఇప్పటికే నీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. నీటి రంగు మార్పు, చేపల మృతి, కాలుష్య ఆరోపణలు, నీటి నాణ్యతపై ల్యాబ్ రిపోర్ట్ రావాల్సి వుంది.
1.04 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు, 308 గ్రామాలకూ, 4 మునిసిపాలిటీలకూ చెందిన 5 లక్షల మంది జనాభా తమ తాగు నీటి అవసరాలపై ఆధారపడి వున్నారు. జూరాల నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులకు కూడా నీటి అనుసంధానం ఉంది. జూరాల నీరు ఆకుపచ్చగా మారడం ప్రజల్లో ఆందోళన నెలకొంది.
2) రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్న ఆర్టీసీ ఎన్నికలు..!
తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల వేడి పెరిగింది. దాదాపు పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు.. కేవలం కార్మిక సంఘాల మధ్య పోటీగానే కాకుండా, రాజకీయ పార్టీల మధ్య బలాబలాలకు పరీక్షగా మారింది. సుమారు 39 వేల మందికి పైగా ఆర్టీసీ కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అక్టోబర్ 9న జరగనున్న ఈ ఎన్నికల్లో కార్మికులు రహస్య బ్యాలెట్ ద్వారా తమకు నచ్చిన సంఘాన్ని ఎన్నుకోనున్నారు.
ఈసారి ప్రధానంగా మూడు కూటములు బరిలో ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతో తెలంగాణ వర్కర్స్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఒక కూటమిగా పోటీ చేస్తున్నాయి.
మరోవైపు ఎంప్లాయీస్ యూనియన్, ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ కలిసి జేఏసీగా బరిలోకి దిగాయి.
తెలంగాణ జాయింట్ మజ్దూర్ యూనియన్, బహుజన్ వర్కర్స్ యూనియన్ తదితర సంఘాలు మరో కూటమిగా పోటీ చేస్తున్నాయి.
యూనియన్ల వెనుక రాజకీయ పార్టీల మద్దతు ఉందన్న ప్రచారంతో.. ఈ ఎన్నికలు ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల కంటే రాజకీయ పార్టీలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి. కార్మికుల్లో ఎవరి ప్రభావం ఎంత? ప్రభుత్వంపై ఉద్యోగుల అభిప్రాయం ఏంటి? అనే అంశాలకు ఈ ఎన్నికల ఫలితాలు ఒక సంకేతంగా మారే అవకాశం ఉంది.
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, వేతన సవరణ అమలు, 2025 ఏప్రిల్ 1 నుంచి రావాల్సిన వేతన సవరణ బకాయిల చెల్లింపు, 2017, 2021 బకాయిల పరిష్కారం వంటి అంశాలను అన్ని కూటములు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. అంతేకాదు.. తార్నాక ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలు, పెన్షన్ సమస్యల పరిష్కారం, పీఎఫ్ బకాయిల క్రమబద్ధీకరణ, కొత్త బస్సుల కొనుగోలు, డిపోల అభివృద్ధి వంటి హామీలను కూడా కార్మికుల ముందు పెడుతున్నాయి.
ఆర్టీసి ఉద్యోగులు ఎవరికి ఓటు వేస్తారు? రాజకీయ అనుబంధాలను బట్టి ఓటు వేస్తారా? అక్టోబర్ 9న బ్యాలెట్ బాక్సుల్లో పడే ఓట్లు.. ఆర్టీసీలో ఏ యూనియన్‌కు గుర్తింపు ఇస్తాయో మాత్రమే కాదు.. కార్మిక వర్గంలో ఏ రాజకీయ శక్తికి పైచేయి ఉందో కూడా చెప్పే అవకాశం ఉంది.
అక్టోబర్ 9న పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 17న ఓట్ల లెక్కింపు పూర్తిచేసి తుది ఫలితాలు ప్రకటించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ కారణంగానే ఫలితాల ప్రకటన 17వ తేదీకి ఉంది. మరి ఆర్టీసీ కార్మికులు ఎవరికి జై కొడతారు? ఏ కూటమి విజయఢంకా మోగిస్తుంది? తెలియాలంటే అక్టోబర్ 17 వరకు వేచి చూడాల్సిందే!
3) సైబర్ క్రైమ్‌పై పోలీసుల మెగా ఆపరేషన్! 101 మంది అరెస్ట్
తెలంగాణలో సైబర్ నేరాలపై పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఏకంగా 101 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో 18 మంది మహిళలు కూడా ఉన్నారు.
సైబర్ నేరాలపై పక్కా సమాచారంతో.. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన సుమారు 100 మంది పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. దాదాపు రెండు వారాల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది.
తెలంగాణలోనే కాకుండా కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోనూ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
ఈ ఆపరేషన్‌లో పట్టుబడిన వారి వివరాలు చూస్తే.. సైబర్ నేరాల వెనుక ఉన్న నెట్వర్క్ ఎంత విస్తరించిందో అర్థమవుతుంది.
అరెస్ట్ అయిన వారిలో కార్పొరేట్ ఉద్యోగులు, ఓ ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగి, ఓ మాజీ సైనిక ఉద్యోగి, ఓ వ్యాపారవేత్త, ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్, అలాగే ఎన్జీవోలు, ట్రస్టుల ఖాతాలను నిర్వహించే వ్యక్తులు ఉన్నారు.
అంటే సైబర్ నేరాలు కేవలం కొందరు గుర్తుతెలియని వ్యక్తులకే పరిమితం కావడం లేదని. వివిధ వృత్తుల్లో ఉన్న వ్యక్తులు కూడా నేరాలకు సహకరిస్తున్నారనే కోణంలో ఈ అరెస్టులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ 101 మంది ఏ తరహా సైబర్ నేరాలకు పాల్పడ్డారు?వీరి ద్వారా మోసపూరిత లావాదేవీలు, బ్యాంక్ ఖాతాల వినియోగం, మ్యూల్ అకౌంట్లు లేదా ఇతర సైబర్ నేరాలకు సహకారం జరిగిందా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో కూడా దాడులు నిర్వహించడంతో.. ఇది ఒక్క రాష్ట్రానికి పరిమితమైన సైబర్ నేరాల వ్యవహారం కాదని, అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌పై పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే 101 మందిని అరెస్ట్ చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. వారి పాత్ర, ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలు, ఇతర నిందితులతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు కొనసాగిస్తోంది.
మరి ఈ 101 మంది వెనుక ఉన్న అసలు సైబర్ నెట్వర్క్ ఏంటి?ఎంతమంది బాధితులు ఉన్నారు?ఎంత మొత్తంలో మోసాలు జరిగాయి? పోలీసుల దర్యాప్తులో ఈ వివరాలు బయటకు రావాల్సి ఉంది.

