
ముష్కిన్ చెరువు కబ్జా
వరదల నివారణే లక్ష్యం..చెరువుల ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం
చెరువు భూములపై కన్నేసిన కబ్జాదారులకు హైడ్రా షాక్
హైదరాబాద్‌లో చెరువుల సంరక్షణతో పాటు వరద ముప్పును తగ్గించే దిశగా హైడ్రా చర్యలు వేగవంతం చేసింది. రంగారెడ్డి జిల్లా ముష్కిన్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా, మరోవైపు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో నీటిముంపు సమస్యల నివారణకు సమగ్ర కార్యాచరణ చేపట్టింది.
హైదరాబాద్ నగరంలో ఒక వైపు చెరువుల కబ్జాలను తొలగిస్తూనే, మరో వైపు ముందస్తు జాగ్రత్తలతో వరద ముప్పు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు హైడ్రా దృష్టి సారించింది. ముష్కిన్ చెరువు కబ్జాలకు హైడ్రా తాజాగా ముకుతాడు వేసింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది.
ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
పేదల పేరిట గుడిసెలు వేసి భూమిని కొట్టేయాలని రియల్టర్లు చేస్తున్న ప్రయత్నాలను అక్కడ గుడిసెలలో ఉన్న వారికి హైడ్రా అధికారులు వివరించారు. మిమ్ములను ముందు పెట్టి కబ్జాలకు పాల్పడుతున్నారంటూ నచ్చజెప్పారు. ఈ కబ్జాలపై ఏడాదిగా పరిశీలిస్తూ వచ్చిన హైడ్రా అక్కడ గుడిసెల్లో ఉంటున్న వారు ఖాళీ చేసేందుకు తగిన సమయం ఇచ్చింది.ఒకటికి రెండు సార్లు హైడ్రా అధికారులు వారితో మాట్లాడి 2 నెలల సమయమిచ్చారు. ఆక్రమణదారులు తమను పావులుగా వాడుకుంటున్నారని గ్రహించిన చాలామంది ఖాళీ చేసి వెళ్లిపోయారు. 40 నుంచి 50 వరకూ ఉన్న గుడిసెలతో పాటు చెత్తను వేరు చేసే షెడ్డులను ఖాళీ చేశారు. మరి కొంతమంది శనివారం ఉదయం ఖాళీ చేశారు. వాళ్లు ఖాళీ చేసిన తర్వాత హైడ్రా ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ పనులు పూర్తి చేసింది.
వర్షాకాల సన్నద్ధతపై హైడ్రా సమావేశం
ముందస్తు జాగ్రత్తలతో వర్షాకాలం తలెత్తే సమస్యలను చాలా వరకు పరిష్కరించవచ్చునని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. వరద నీరు సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేస్తే రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించవచ్చునని చెప్పారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ పోలీస్, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, ఐఎండీ, టీజీడీపీఎస్, యూబీడీ, వాటర్ బోర్డుతో పాటు సంబంధిత శాఖల అధికారులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమీక్షించారు. వరద కాలువల్లో డీసిల్టింగ్ పనులు ముమ్మరంగా జరగాలని, ఇందుకు హైడ్రా పూర్తి సహకారం అందిస్తున్నదని చెప్పారు. జీహెచ్ ఎంసీ పరిధిలో మొత్తం 523 వాటర్ లాగింగ్ పాయింట్లుంటే.. ఇందులో 105 వరకూ మేజర్, 157 మీడియం, 261 మైనర్‌వి ఉన్నాయన్నారు. ఇక్కడ నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. వర్షాకాలం ఆరంభం నాటికే సమస్యలు పరిష్కారం జరగాలని.. ఇందుకు గాను ఆయా శాఖలు ఏ విధంగా ప్రయత్నిస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు.
హైడ్రా భారీ ఆపరేషన్
చెరువుల ఆక్రమణలను హైడ్రా సీరియస్‌గా పరిగణిస్తోంది. ఇప్పటికే పలు చెరువుల ఆక్రమణలను తొలగించిన హైడ్రా శనివారం భారీ ఆపరేషన్ చేపట్టింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పలగూడ - నార్సింగ్ గ్రామాల పరిధిలోని ముష్కిన్ చెరువు కబ్జాలపై కన్నెర్రజేసింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని భూముల స్వరూపం మార్చకూడదనే నిబంధనలను పట్టించుకోకుండా.. బడానిర్మాణాలకు భూమిని సిద్ధం చేయడాన్ని హైడ్రా సీరియస్‌గా పరిగణించింది. ముష్కిన్ చెరువు ఎప్‌టీఎల్ పరిధిలో ఆక్రమణలను తొలగించింది. అభివృద్ధి పేరిట చెరువు మధ్యలోంచి కట్టకట్టి ఎగువున ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న 35.10 ఎకరాల భూమిని కబ్జా చేయాలనే ప్రయత్నాలకు హైడ్రా అడ్డుకట్టవేసింది.
ప్రజావాణి ఫిర్యాదుతో..
ముష్కిన్ చెరువు కబ్జా జరుగుతోందని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మట్టితో నింపుతున్నారని స్థానికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎస్ ఆర్ నిధులతో ఈ చెరువును అభివృద్ధి చేస్తున్న వారు చెరువు పరిధిని తగ్గించి ఆక్రమణలకు ఆస్కారం కల్పిస్తున్నారని వాపోయారు. చెరువు మధ్యలోంచి కట్టను ఏర్పాటు చేసి చెరువు ఎగువభాగంలో ఉన్న భూమిని కాజేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. చెత్తను సేకరించి అక్కడ వేరు చేసి చెరువులోకి వ్యర్థాలు వదలడంతో పరిసరాలన్నీ దుర్గంధంగా మారడంతో పాటు.. చెరువు కలుషితమౌతోందని వాపోయారు. ఈ ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులతో హైడ్రా విచారణ చేపట్టింది.
చెరువుల ఆక్రమణల తొలగింపు, వరద కాలువల పరిరక్షణ, వాటర్ లాగింగ్ సమస్యల నివారణ వంటి చర్యల ద్వారా నగరాన్ని వరదల నుంచి రక్షించడమే హైడ్రా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ముష్కిన్ చెరువులో చేపట్టిన ఆపరేషన్‌తో చెరువుల సంరక్షణ విషయంలో రాజీ లేదన్న సందేశాన్ని హైడ్రా స్పష్టంగా పంపించింది. భవిష్యత్ తరాలకు జలవనరులను కాపాడుతూ, నగర ప్రజలకు సురక్షితమైన వర్షాకాలాన్ని అందించేందుకు హైడ్రా చర్యలు కీలకంగా మారనున్నాయి.
Next Story

