
తెలంగాణలో మండుతున్న ఎండలు
తెలంగాణలోని నాలుగు పట్టణాలు వెరీ హాట్
ఉత్తర తెలంగాణలో మండుతున్న ఎండలు: టాప్ 100 హాట్ ప్లేసెస్‌లో 4 పట్టణాలు
తెలంగాణలో ఎండలు మామూలుగా లేవు… అగ్గిమంటలా మండుతున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతం మొత్తం హీట్ జోన్‌గా మారిపోయి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దేశవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల జాబితాలో తెలంగాణకు చెందిన రామగుండం, మంచిర్యాల, కొత్తపేట, ఆదిలాబాద్ పట్టణాలు చోటు దక్కించుకోవడం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. 43 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రజల జీవనాన్ని కష్టతరం చేస్తుండగా, వడగాలులు మరింత ప్రమాద సంకేతాలు ఇస్తున్నాయి.
దేశంలో వెరీ హాట్ ప్రాంతాల జాబితాలో తెలంగాణకు చెందిన నాలుగు పట్టణాలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణలో వడగాలుల ప్రభావం బాగా పెరిగడంతో ఎండలు మండిపోతున్నాయి. దీంతో రామగుండం, మంచిర్యాల, కొత్తపేట,ఆదిలాబాద్ పట్టణాలు దేశంలోని అత్యంత వేడి ప్రదేశాల టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వడగాలులు తీవ్రతరం కావడంతో ఏప్రిల్ 25వ తేదీన అత్యంత వేడిగా ఉన్న నగరాల జాబితాలో ఉత్తరప్రదేశ్‌లోని బండా, మహారాష్ట్రలోని అకోలా, భూసావల్, జల్గావ్, రాజస్థాన్‌లోని జైసల్మేర్ నగరాలున్నాయని ఐఎండీ తెలిపింది.
నాలుగు పట్టణాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయని భారతవాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
మండే ఎండలకు కారణాలివి...
మహారాష్ట్రలోని వేడి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే విదర్భ ప్రాంతానికి సమీపంలో ఉన్నందున ఆదిలాబాద్, మంచిర్యాల వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం అసాధారణమేమీ కాదని వాతావరణ నిపుణులు తెలిపారు. ఉత్తర తెలంగాణ ప్రాంతం ఉష్ణ కేంద్ర మండలంలో ఉందని, ఇక్కడ నిరంతరం పొడి ఉత్తర గాలులు వీస్తున్నాయని ఐఎండీ శాస్త్రవేత్తలు చెప్పారు. తక్కువ తేమ, అతి తక్కువ వృక్షసంపద, నిర్మలమైన ఆకాశం కలసి ఉపరితల ఉష్ణోగ్రతలను గణనీయంగా పెంచుతున్నాయని ధర్మారాజు చెప్పారు.పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో అధికంగా ఉన్న పరిశ్రమల వల్ల పెరిగిన వేడికి పాక్షికంగా కారణమని వాతావరణశాఖ నిపుణులు చెప్పారు.మూసీ నది ఒడ్డున ఉన్న హైదరాబాద్‌లోని కొత్తపేట ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్పారు. పచ్చదనం,పర్యావరణం క్షీణించడంతోపాటు జలాశయాల్లో నీరు అడుగంటిపోవడం వల్ల తెలంగాణలోని మరిన్ని ప్రాంతాలు వెరీ హాట్ పట్టణాల ర్యాంకింగ్‌లలో చోటు దక్కించుకోవచ్చని పర్యావరణ నిపుణులు హెచ్చరించారు.
రామగుండంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఉండటం వల్ల స్థానికంగా వేడి ఉత్పత్తి అవుతుందని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు తెలిపారు.
కొనసాగుతున్న హీట్‌వేవ్...8 జిల్లాల్లో రెడ్ అలెర్ట్
తెలంగాణలోని పలు జిల్లాల్లో పొడి వాతావరణం, వడగాలుల ప్రభావం వల్ల 8 జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, వరంగల్,ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ హన్మకొండ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 43నుంచి 45డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవడంతో ఆయా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వెదర్ మ్యాన్ వెల్లడించారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడంతో ఆయా జిల్లాల్లో ఎల్లోఅలెర్ట్ జారీ చేసినట్లు వెదర్ మ్యాన్ చెప్పారు. కాంక్రీట్ జంగిల్ అయిన హైదరాబాద్ నగరం వేగంగా వేడెక్కుతోందని నిన్నటితో పోలిస్తే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణశాఖ నిపుణులు చెప్పారు.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉష్ణోగ్రత 44 నుంచి46 డిగ్రీల సెల్సియస్ కు పెరిగిందని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. తెలంగాణలోని 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించామని వెదర్ మ్యాన్ వివరించారు.
తెలంగాణలో కొనసాగుతున్న ఎండల తీవ్రత తాత్కాలిక సమస్య మాత్రమే కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చదనం తగ్గిపోవడం, నీటి వనరులు క్షీణించడం, నగరీకరణ వేగం పెరగడం వంటి కారణాలు కలిసి తెలంగాణను మరింత హీట్ జోన్‌గా మార్చే ప్రమాదం ఉంది.పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ప్రాంతాలు ‘వెరీ హాట్’ జాబితాలోకి చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండటం, ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవడం అత్యవసరంగా మారింది.
Next Story

