
సామాన్యుడే సర్దార్ అయ్యాడు..పాపన్న ఎలా ఎదిగాడు?
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం.
1) సామాన్యుడే సర్దార్ అయ్యాడు..పాపన్న ఎలా ఎదిగాడు?
2) తింటున్నది నెయ్యేనా.. కల్తీనా? హైదరాబాద్‌లో 25.5 టన్నులు సీజ్!
3) ప్రభుత్వ ధాన్యం మాయం.. మిల్లర్ల వద్ద రూ.6,631 కోట్లు!
1) సామాన్యుడే సర్దార్ అయ్యాడు..పాపన్న ఎలా ఎదిగాడు?
ఒక సామాన్యుడు.. ఏకంగా ఓ సామ్రాజ్యానికే సవాల్ విసిరాడు! చేతిలో కత్తి.. వెంట సైన్యం.. లక్ష్యం ఒక్కటే.. తన కాలంలో ఉన్న అణచివేతను ఎదిరించడం! 17వ శతాబ్దంలో తెలంగాణ గడ్డపై తనకంటూ ఓ శక్తిని నిర్మించుకున్న వీరుడు.. సర్దార్ సర్వాయి పాపన్న! నాడు మొఘల్ పాలనతో పాటు స్థానిక సామంతుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన పాపన్న.. తెలంగాణ చరిత్రలో తనదైన ముద్ర వేశారు.
కాలం గడిచింది.. రాజ్యాలు మారిపోయాయి.. కానీ పాపన్న పేరు మాత్రం జానపద గేయాల్లో, ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు అయింది. అసలు ఎవరీ పాపన్న? సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. అంతటి సైనిక శక్తిని ఎలా నిర్మించారు? ఎవరిని ఎదిరించారు? ఎందుకు పాపన్న పేరు ఇప్పటికీ అంత బలంగా వినిపిస్తోంది?
రాజ కుటుంబంలో పుట్టలేదు.. పెద్ద సామ్రాజ్యానికి వారసుడూ కాదు.. అయినా ఒక సైన్యాన్ని నిర్మించుకున్నాడు! సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా చారిత్రక, జానపద కథనాల్లో ప్రస్తావించబడతారు.ఆ కాలంలో తెలంగాణ ప్రాంతం మొఘల్ సామ్రాజ్య ప్రభావంతో పాటు స్థానిక పాలకులు, సామంతుల ఆధిపత్యంలో ఉండేది.
అధికార వ్యవస్థలో సామాన్యులకు అవకాశాలు చాలా పరిమితంగా ఉన్న కాలం అది. ఇలాంటి పరిస్థితుల్లోనే పాపన్న తన చుట్టూ అనుచరులను సమీకరించుకున్నారు. క్రమంగా సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని.. కోటలను నిర్మిస్తూ, కొన్ని ప్రాంతాలపై తన ఆధిపత్యాన్ని పెంచుకుంటూ వెళ్లారు. ఒక వ్యక్తి నుంచి ఓ శక్తిగా.. ఓ శక్తి నుంచి ఓ పాలనా వ్యవస్థగా పాపన్న ఎదిగిన తీరు.. ఆయన కథలోని ప్రధాన ప్రత్యేకత. అయితే పాపన్న కేవలం యుద్ధాలు చేసిన యోధుడేనా? లేక అప్పటి సామాజిక, రాజకీయ వ్యవస్థను సవాల్ చేసిన నాయకుడా? ఇదే ప్రశ్న పాపన్న చరిత్రను ఇప్పటికీ ఆసక్తికరంగా మారుస్తోంది.
పాపన్న కథలో అత్యంత ఆసక్తికరమైన విషయం.. ఆయన నిర్మించుకున్న సైనిక శక్తి! తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో అనుచరులను సమీకరించుకుని.. సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కోటలను కేంద్రాలుగా చేసుకుని తన ప్రభావాన్ని విస్తరించారు. తాటికొండ, షాపూర్ తదితర ప్రాంతాలతో పాపన్నకు ఉన్న సంబంధం చారిత్రక ఆధారాల్లో కనిపిస్తుంది.
ఒక దశలో స్థానికంగా తనకంటూ ఓ బలమైన అధికార కేంద్రాన్ని నిర్మించుకున్న పాపన్న.. అప్పటి శక్తివంతమైన పాలకులకు సవాల్‌గా మారారు. ఇక్కడే పాపన్న కథలో మరో కోణం తెరపైకి వస్తుంది. అధికారం కొద్దిమంది చేతుల్లోనే ఉండాలా? సామాన్య వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి కూడా పాలనా శక్తిని సాధించగలడా? పాపన్న పోరాటాన్ని కొందరు సామాజిక తిరుగుబాటుగా చూస్తే.. మరికొందరు దాన్ని అప్పటి రాజకీయ పరిస్థితుల్లో జరిగిన అధికార పోరాటంగా విశ్లేషిస్తారు.
పాపన్న చనిపోయి శతాబ్దాలు గడిచిపోయాయి.. అయినా ఆయన పేరు ఎందుకు మళ్లీ మళ్లీ వినిపిస్తోంది? దానికి ప్రధాన కారణం.. పాపన్న కేవలం ఒక యోధుడిగా కాకుండా.. తెలంగాణలోని కొన్ని సామాజిక వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా మారడం. జానపద గేయాలు, కథలు, స్థానిక చరిత్రలో పాపన్న ప్రస్తావన తరతరాలకు చేరింది.అణగారిన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి.. తన కాలంలో ఉన్న శక్తివంతమైన వ్యవస్థకు ఎదురొడ్డి నిలిచాడనే భావన.. పాపన్నను ఒక స్ఫూర్తిగా నిలబెట్టింది. ఇప్పుడు ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహం ఏర్పాటు చేయడం.. ఈ చారిత్రక చర్చకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సామాజిక ఉద్యమాలతో సంబంధం ఉన్న అనేక ప్రముఖుల విగ్రహాలకు ట్యాంక్‌బండ్ ఇప్పటికే వేదికగా ఉంది. ఇప్పుడు ఆ వరుసలో సర్దార్ సర్వాయి పాపన్న కూడా చేరబోతున్నారు. ఇది కేవలం ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే కాదు. తెలంగాణ చరిత్రలో కీలక పాత్ర పోషించిన ఒక స్థానిక వీరుడిని.. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ప్రజలకు పరిచయం చేయడం.కాలం మారింది.. రాజ్యాలు మారాయి.. పాలకులు మారారు..కానీ ప్రజల కోసం పోరాడిన వారి కథలు మాత్రం చరిత్రలో మిగిలిపోతాయి. అందుకే.. ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహం అంటే.. ఓ విగ్రహం మాత్రమే కాదు.. తెలంగాణ చరిత్రలోని ఓ అధ్యాయానికి దక్కుతున్న మరోసారి గుర్తింపు!
2) తింటున్నది నెయ్యేనా.. కల్తీనా? హైదరాబాద్‌లో 25.5 టన్నులు సీజ్!
ఒక లీటర్ పాల ధర సుమారు రూ.60 అనుకుందాం. పాలలోని కొవ్వు నుంచి నెయ్యి తయారవుతుంది. పాలలో ఫ్యాట్ శాతం, దిగుబడిని బట్టి కిలో నెయ్యికి గణనీయమైన పరిమాణంలో పాలు అవసరం. ఉదాహరణకు 30 లీటర్ల పాలు అవసరమైతే.. పాల ఖర్చే రూ.1,800. దీనికి మజ్జిగ/వెన్న వేరు చేయడం, తయారీ, విద్యుత్, ప్యాకింగ్, రవాణా, కార్మికుల ఖర్చులు కలుస్తాయి. మరి ఇన్ని ఖర్చులు ఉండగా.. మార్కెట్‌లో కొందరు నెయ్యిని అసాధారణంగా తక్కువ ధరకు ఎలా అమ్ముతున్నారు?
”నెయ్యి అనుకుని తింటున్నాం.. కానీ అది అసలు నెయ్యే కాకపోతే? హైదరాబాద్‌లో జరిగిన తాజా తనిఖీలు ఇప్పుడు ఇదే ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి. నగరంలో నెయ్యి తయారీ, విక్రయ కేంద్రాలపై అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా.. ఏకంగా 25.5 టన్నుల కల్తీ నెయ్యితో పాటు 10.5 టన్నుల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. అంటే.. అధికారులు పట్టుకున్న మొత్తం సరుకు 36 టన్నులు! హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన H-FAST – Hyderabad Food Adulteration Surveillance Team ఈ ఆపరేషన్ నిర్వహించింది.
మనం మార్కెట్‌లో కొనుక్కునే నెయ్యి నిజంగా నెయ్యేనా? కల్తీ నెయ్యిని అసలు ఎలా తయారు చేస్తున్నారు? ఎందుకు కల్తీ నెయ్యి దందా ఇంత లాభదాయకంగా మారింది? దాన్ని తింటే మన శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? నెయ్యి ధర ఎక్కువ.. డిమాండ్ ఎక్కువ.. ఇదే కల్తీ మాఫియాకు పెద్ద అవకాశంగా మారుతోంది. మంచి నాణ్యమైన నెయ్యి ధర మార్కెట్‌లో ఎక్కువగా ఉంటుంది. కానీ అదే నెయ్యిని తక్కువ ఖర్చుతో తయారు చేసి.. అసలు నెయ్యిలా అమ్మగలిగితే భారీ లాభాలు వస్తాయి. ఇదే లాజిక్‌తో కొందరు అక్రమ తయారీదారులు కల్తీ నెయ్యి తయారీకి పాల్పడుతున్నారని అధికారులు గుర్తిస్తున్నారు. నెయ్యిలో ఉండాల్సిన సహజమైన కొవ్వుల స్థానంలో.. చౌకైన కొవ్వులు, నూనెలు, ఇతర ముడి పదార్థాలను ఉపయోగించి.. వాసన, రంగు, రుచి నెయ్యిలా ఉండేలా తయారు చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి.
అంటే..చూస్తే నెయ్యిలానే ఉంటుంది.. వాసన కూడా నెయ్యిలానే ఉంటుంది.. కానీ లోపల ఉండేది మాత్రం నాణ్యమైన నెయ్యి కాకపోవచ్చు. ఇక్కడే వినియోగదారుడు మోసపోతాడు. ముఖ్యంగా లూజ్‌గా విక్రయించే నెయ్యి విషయంలో తయారీదారు ఎవరు? ముడి పదార్థాలు ఏంటి? ఎక్కడ తయారైంది? నాణ్యత పరీక్షలు జరిగాయా? అన్నది తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే తక్కువ ధరకు దొరికిందని ఆశపడితే.. ఆ చౌక ధర వెనుక అసలు ఏం ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
కల్తీ నెయ్యి తిన్న వెంటనే ఏదైనా జరిగిపోవాలని లేదు.. కానీ సమస్య అక్కడితో ఆగదు. కల్తీ ఆహార పదార్థాలను పదేపదే తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నెయ్యిలో ఉపయోగించే కొవ్వు పదార్థాలు ఏంటి? అవి ఆహార వినియోగానికి సురక్షితమైనవేనా? అందులో హానికరమైన లేదా నాణ్యతలేని పదార్థాలు ఉన్నాయా? అన్నది కీలకం. నాణ్యతలేని కొవ్వులు, అనుమతిలేని పదార్థాలు లేదా కలుషిత ముడి సరుకులు ఉపయోగిస్తే.. అవి జీర్ణవ్యవస్థతో పాటు దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. అందుకే “కల్తీ నెయ్యి అంటే కేవలం నెయ్యి నాణ్యత తగ్గడం” అని తేలిగ్గా తీసుకోవడం సరికాదు. ఇది నేరుగా ఫుడ్ సేఫ్టీ, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం.
ఇక్కడ మరో ఆందోళనకర విషయం.. ఈ 25.5 టన్నుల నెయ్యి ఎక్కడికి వెళ్లాల్సి ఉంది? ఇప్పటికే ఎంత మార్కెట్‌లోకి వెళ్లింది? ఏయే ప్రాంతాల్లో అమ్మారు? ఎంతమంది వినియోగదారులు దాన్ని కొనుగోలు చేశారు? అన్నది కూడా అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది.
ఒక కిలో నెయ్యి తయారు చేయడానికి అయ్యే ఖర్చు తగ్గిస్తే.. అదే నెయ్యిని మార్కెట్ ధరకు అమ్మొచ్చు. ఇదే అక్రమ వ్యాపారులకు భారీ లాభం! నెయ్యి ఖరీదైన ఆహార పదార్థం కావడంతో.. దాని పేరుతో తక్కువ నాణ్యత గల పదార్థాలను మార్కెట్‌లోకి పంపితే భారీగా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. ఇక్కడే వినియోగదారుల బలహీనతను కూడా కొందరు వ్యాపారులు ఉపయోగించుకుంటున్నారు. “తక్కువ ధర.. మంచి నెయ్యి” అనే మాట వినగానే చాలామంది ఆలోచించకుండా కొనేస్తారు. కానీ ఆ తక్కువ ధర వెనుక నాణ్యత తగ్గింపు ఉందా? లేక అసలు నెయ్యి స్థానంలో మరేదైనా పదార్థం ఉందా? అన్నది ఆలోచించాలి.
గతంలో తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతపై దేశవ్యాప్తంగా పెద్ద వివాదం, దర్యాప్తు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత నెయ్యి సరఫరా, నాణ్యత, పరీక్షలపై మరింత దృష్టి పెరిగింది. అయినా.. హైదరాబాద్‌లో ఇప్పుడు 25.5 టన్నుల కల్తీ నెయ్యి పట్టుబడటం చూస్తే.. ఫుడ్ సేఫ్టీ విషయంలో నిరంతర తనిఖీలు ఎంత అవసరమో అర్థమవుతోంది.ప్రతి సారి నెయ్యి కొనే ముందు ల్యాబ్‌కు వెళ్లాలా? అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి.మొదటగా.. లూజ్‌గా, లేబుల్ లేకుండా విక్రయించే నెయ్యిని కొనడం సాధ్యమైనంత వరకు నివారించాలి.
ప్యాక్‌డ్ ఉత్పత్తి అయితే..తయారీదారు పేరు,పదార్థాల వివరాలు,బ్యాచ్ నంబర్,తయారీ, గడువు తేదీలు,FSSAI లైసెన్స్ వివరాలువంటి లేబుల్ సమాచారాన్ని పరిశీలించాలి.అసాధారణంగా తక్కువ ధరకు లభిస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే ధర తక్కువగా ఉండటం ఒక్కటే నాణ్యతకు సర్టిఫికెట్ కాదు.అలాగే.. పరిచయస్తులు అమ్ముతున్నారని లూజ్ నెయ్యిని గుడ్డిగా నమ్మడం కూడా సురక్షితం కాదు. సరఫరా ఎక్కడి నుంచి వస్తుందో తెలియకపోతే నాణ్యతపై నమ్మకం పెట్టుకోవడం కష్టం.హైదరాబాద్‌లో పట్టుబడిన 25.5 టన్నుల కల్తీ నెయ్యి ఒక విషయం స్పష్టం చేస్తోంది.
కల్తీ ఎక్కడ ఉందో పట్టుకోవడం అధికారుల బాధ్యత.. కానీ మనం ఏం కొంటున్నామో తెలుసుకోవడం వినియోగదారుల బాధ్యత. నెయ్యి పేరుతో ఏదైనా తినే ముందు.. “ఇది నిజంగా నెయ్యేనా?” అనే ఒక్క ప్రశ్న వేసుకోవడం మొదలుపెడితే.. కల్తీ దందాకు కొంతైనా అడ్డుకట్ట వేయొచ్చు. అప్రమత్తతే మన ఆరోగ్యానికి మొదటి రక్షణ.
3) ప్రభుత్వ ధాన్యం మాయం.. మిల్లర్ల వద్ద రూ.6,631 కోట్లు!
రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుంది.. మిల్లర్‌కు అప్పగిస్తుంది.. బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలి! కానీ.. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మర ఆడించి బియ్యం ఇవ్వాల్సిన మిల్లర్లు.. కొందరు ఆ ధాన్యాన్నే బయట మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. ఒక సీజన్‌లో ఇచ్చిన ధాన్యానికి.. అదే సీజన్‌లో బియ్యం తిరిగి రావాలి. కానీ ఏళ్ల తరబడి బకాయిలు పేరుకుపోతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.6,631 కోట్లు! ఇది కేవలం ఓ లెక్క కాదు.. రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన ధాన్యం, దాని వెనుక ఉన్న ప్రజాధనం, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్న భారీ బకాయి.
రైతుల నుంచి ప్రభుత్వం కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుంది. ఆ ధాన్యాన్ని రైస్‌మిల్లులకు కేటాయిస్తుంది. ఇక్కడ మిల్లర్ ఆ ధాన్యానికి యజమాని కాదు. మిల్లర్ చేయాల్సింది కేవలం జాబ్‌వర్క్.. అంటే ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మర ఆడించి బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అప్పగించడం. దీనికోసం ప్రభుత్వం మిల్లింగ్ చార్జీలు చెల్లిస్తుంది. అంతేకాదు.. తౌడు, పరం, పొట్టు, నూకలు వంటి ఉప ఉత్పత్తులు కూడా మిల్లర్లకు దక్కుతాయి. సాధారణంగా 1 క్వింటాళ్ల ధాన్యానికి సుమారు 67 నుంచి 68 కిలోల బియ్యం రికవరీ నిబంధన ఉంటుంది. అంటే ప్రభుత్వం ధాన్యం ఇచ్చింది.. మిల్లర్ బియ్యంగా మార్చాలి.. నిర్ణీత గడువులో ప్రభుత్వానికి అప్పగించాలి. అంతే తప్ప.. ఆ ధాన్యాన్ని మార్కెట్‌లో అమ్ముకునే హక్కు మిల్లర్‌కు లేదు.
ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని కొందరు మిల్లర్లు బయట మార్కెట్‌కు తరలించి అమ్ముకున్నారని.. బ్లాక్ మార్కెట్‌కు మళ్లించారని.. మరికొందరు బియ్యంగా మార్చి ఇతర మార్గాల్లో విక్రయించారని అధికారులు గుర్తించిన కేసులు ఉన్నాయి.ఇప్పుడు అసలు షాకింగ్ లెక్కల దగ్గరకు వద్దాం. తెలంగాణలో రైస్‌మిల్లర్ల నుంచి ప్రభుత్వంకు రావాల్సిన పాత బకాయిలు రూ.6,631 కోట్లుగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి.
ఇందులో..బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం నుంచి వారసత్వంగా వచ్చిన బకాయిలు రూ.4,939 కోట్లు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగిన బకాయిలు రూ.1,692 కోట్లు.అంటే సమస్య ఏ ఒక్క ప్రభుత్వంతోనే మొదలైనది కాదు. ఏళ్లుగా పేరుకుపోయిన వ్యవస్థాగత సమస్య.మొత్తంగా 2,388 రైస్‌మిల్లులు CMR బకాయిల జాబితాలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఇక్కడ మరో కీలక విషయం ఉంది. రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటుంది. ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి FCIకి అప్పగించిన తర్వాత.. అక్కడి నుంచి వచ్చే డబ్బుతో బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
అంటే..ధాన్యం కొనుగోలు నుంచి బియ్యం అప్పగించే వరకు మొత్తం వ్యవస్థ ఒక ఆర్థిక చక్రంలా పనిచేయాలి.కానీ మిల్లుల్లో ధాన్యం నిలిచిపోతే.. బియ్యం ప్రభుత్వానికి రాకపోతే.. ఆ చక్రం గాడి తప్పుతుంది.అందుకే CMR బకాయిలు కేవలం మిల్లర్ల సమస్య కాదు.. ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక భారం కూడా.ఇంత భారీ మొత్తంలో బకాయిలు ఉండటంతో ప్రభుత్వం ఇప్పుడు కఠిన చర్యలకు దిగుతోంది.
విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు.. క్రిమినల్ కేసులు.. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలు.. అవసరమైతే PD యాక్ట్..ఇప్పటికే పలువురు మిల్లర్లపై చర్యలు తీసుకున్నారు.
పెద్దపల్లికి చెందిన ఓ రైస్‌మిల్లర్‌పై రూ.132 కోట్ల విలువైన ధాన్యం కాజేశారన్న ఆరోపణలతో PD యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన ఇద్దరు మిల్లర్లపై రూ.218 కోట్ల బకాయిలకు సంబంధించి క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
PDS బియ్యం రీసైక్లింగ్‌కు సంబంధించి మరో 11 మంది మిల్లర్లపై PD యాక్ట్ కేసులు పెట్టినట్లు అధికారులు తెలిపారు.
అంతేకాదు..రూ.20 కోట్ల విలువైన బియ్యం, రూ.17 కోట్ల విలువైన వాహనాలను సీజ్ చేసిన సందర్భాలున్నాయి. ధాన్యం అక్రమ రవాణాకు సంబంధించి 348 మంది మిల్లర్లపై క్రిమినల్ కేసులు, మరో 128 మందిపై RR యాక్ట్ కింద చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయినా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు.
ఎందుకంటే కేసు పెట్టడం ఒకటి..ఆస్తులు గుర్తించడం ఒకటి..కోర్టు ప్రక్రియ మరోటి..చివరికి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు లేదా బియ్యం వసూలు చేయడం అసలు సవాల్.ఇక్కడే అసలు ప్రశ్న. ప్రభుత్వం ధాన్యం ఇచ్చినప్పుడు.. దాని స్టాక్ ఎక్కడుందో ఎందుకు నిరంతరం పర్యవేక్షించలేకపోయారు?
ఒక సీజన్‌లో ఇచ్చిన ధాన్యానికి అదే సీజన్‌లో బియ్యం రావాల్సి ఉంటే.. ఏళ్ల తరబడి బకాయిలు ఎలా పేరుకుపోయాయి?మిల్లర్లు ధాన్యాన్ని అమ్మేశారా? బియ్యాన్ని బయటకు తరలించారా?లేదా అధికారుల పర్యవేక్షణలో లోపాలున్నాయా? ఈ మొత్తం వ్యవహారంలో కొందరు మిల్లర్లు మాత్రమే కాదు.. వ్యవస్థలోని పర్యవేక్షణ లోపాలు కూడా కీలక పాత్ర పోషించాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే.. ప్రభుత్వం కూడా గతంలో తగినంత కఠినంగా వ్యవహరించలేదనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం లెక్కలు తేల్చే పనిలో పడింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులతో సమీక్షలు నిర్వహించి.. మిల్లర్ల నుంచి బకాయిలు రాబట్టాలని ఆదేశించారు.ఇప్పుడు అసలు టార్గెట్.. మిల్లుల్లో ఉన్న ధాన్యం! గత రెండు సీజన్లలో.. అంటే 2025-26 ఖరీఫ్, రబీ సీజన్లలో మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం నిజంగా మిల్లుల్లో ఉందా? మర ఆడించి బియ్యంగా మార్చారా? ప్రభుత్వానికి ఎంత ఇచ్చారు? ఇంకెంత బకాయి ఉంది? అనే లెక్కలను అధికారులు జల్లెడ పడుతున్నారు.
విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు ముమ్మరం చేశారు. స్టాక్ తనిఖీలు చేస్తున్నారు. అక్రమాలు బయటపడితే కేసులు నమోదు చేస్తున్నారు. కానీ ఈ వ్యవహారంలో అసలు విజయాన్ని నిర్ణయించేది ఎన్ని కేసులు పెట్టారన్నది కాదు.. ప్రభుత్వానికి రావాల్సిన బియ్యం ఎంత తిరిగి వచ్చింది? ఎంత డబ్బు రికవరీ అయ్యింది? అన్నదే.
రైతు నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది. ప్రజాధనంతో దానికి డబ్బు చెల్లించింది. మిల్లర్‌కు అప్పగించింది. ఇప్పుడు ఆ ధాన్యం బియ్యంగా తిరిగి ప్రభుత్వ గోదాములకు చేరాలి.. లేదా దాని విలువ ప్రభుత్వ ఖజానాకు రావాలి. ఏళ్ల తరబడి పేరుకుపోయిన రూ.6,631 కోట్ల బకాయిలకు ప్రభుత్వం ఇప్పుడు చెక్ పెట్టగలదా?మిల్లర్ల దందాకు అడ్డుకట్ట పడుతుందా? లేక మళ్లీ ఇదే కథ.. మరో సీజన్‌లో మరో బకాయిగా మారుతుందా?
Next Story

