అది 1969 వ సంవత్సరం...తొలి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయం...నాటి ఉద్యమంలో జరిగిన పోలీసు కాల్పులతో తెలంగాణలో కాలేజీలు బంద్ అయ్యాయి. దీనివల్ల తన కుమారుడి చదువు ఆగరాదని తండ్రి తుమ్మల లక్ష్మయ్య ఏలూరు కాలేజీలో పీయూసీలో చేర్పించారు.తండ్రి సాగు చేసే పొగాకు పంట ఏలూరు వ్యాపారులు కొనేవారు.ఈ స్నేహం కొడుకు చదువు ఖర్చుల నిమిత్తం నెలకు వంద రూపాయలు ఇవ్వాలని పొగాకు వ్యాపారులకు చెప్పారు. దాంతో అక్కడ వ్యాపారుల వద్దకు ఆ కుర్రవాడు వంద రూపాయల కోసం నెలా నెలా వెళ్లేవాడు. పొగాకు వ్యాపారుల ముందు రైతులు కూర్చోవడానికి కూడా భయపడే వాళ్లు, జంకే వాళ్ళు. ఇది గమనించిన కుర్రవాడు బాధపడ్డాడు.సొంత ఊళ్లలో పెద్ద రైతులుగా గౌరవం పొందే వాళ్లు సైతం పొగాకు వ్యాపారుల ముందు తగ్గి ఉండటం ..కనీసం కూర్చోవడానికి మర్యాద లేక పోవడం ఎందుకో కుర్రవాడికి నచ్చలేదు. తాను వంద రూపాయల కోసం మర్యాద లేని చోట ఎందుకు నిలబడాలి అని ఆవేదన చెందాడు. ఈ అంతర్మథనంతో ఆ కుర్రవాడు పొలం బాట పట్టాడు.సొంతంగా పొగాకు సాగుకు శ్రీకారం చుట్టాడు.తొలి ఏడాది వర్జీనియా పొగాకు సాగులో నష్టాలు వచ్చాయి.పొగాకు సాగులో అనుభవం లేని తుమ్మలకు నష్టాలు స్వాగతం పలికాయి. రెండో ఏడాది పొగాకు పంటలో లాభాలు దక్కాయి. దాంతో మిగులు డబ్బుతో తుమ్మల అప్పట్లో బుల్లెట్ మోటార్ సైకిల్ కొన్నారు. బుల్లెట్ బండిపై తిరుగుతూ ఆదర్శ వ్యవసాయం చేస్తూ గుంటూరు పొగాకు బోర్డులో మెంబర్ అయ్యారు. ఇదే ఆయన ఎన్టీయార్ కంటబడేలా చేసింది. ఒక రోజులు ఎన్టీయార్ నుంచి బుల్లెట్ రైడర్ కు పిలుపు రానే వచ్చింది. ఎన్టీయార్ ను కలుసుకున్న తర్వాత ఆయన రాజకీయప్రస్తానం ఇంక పగలేదు. అలా సాగిసాగి ఇపుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్ లోకి మంత్రి పదవి గా వచ్చింది. ఆయనెవరో కాదు... తుమ్మల నాగేశ్వరరావు.
బుల్లెట్‌బండితో రాజకీయాలు ఆరంభం
బుల్లెట్‌తో ఆయన రాజకీయాలు మొదలయ్యాయి. ఆ రోజుల్లో కమ్యూనిస్టులు కాకుండా రాజకీయాల్లోఉన్నది కాంగ్రెస్ పార్టీయే. జిల్లా మీద పట్టంతా జలగం వెంగళరావుదే. ఆయన బుల్లెట్ మీది నుంచే వెంగళరావు అనుచరుడయ్యాడు. అయితే, సొంత వ్యక్తిత్వంతో కాపాడుకునే రకం కావడంతో తుమ్మలకు ఖమ్మం కాంగ్రెస్ ఇరుకయింది. జలగం ప్రసాదరావుతో విబేధాలు వచ్చాయి. అవి కాంగ్రెస్ అపకీర్తి పాలవుతున్న రోజులు...సరిగ్గా ఇదే సమయంలో ఎన్టీరామారావు ‘తెలుగుదేశం’ పార్టీ (టీడీపీ)ని స్థాపించారు. కాంగ్రెస్ లాగా వృద్ధులతో కాకుండా పార్టీలో యువరక్తం పారాలని భావించి, రాష్ట్రంలో ఎక్కడెక్కడ క్రియాశీలకంగా పనిచేస్తున్న యువకులున్నారో ఆయన వెతకడం ప్రారంభించారు. అప్పుడు ఖమ్మం నుంచి దొరికిన యువ కిశోరమే తుమ్మల నాగేశ్వరరావు. అలా ఆయన ప్రస్థానం ఉత్సాహం ఉరకలేస్తున్న తెలుగుదేశం పార్టీలో ఊపు అందుకుంది.
నాటి సీఎం ఎన్టీఆర్ తో తుమ్మల (ఫైల్ ఫొటొ)
తెలుగుదేశంలో చేరిక : మలుపు తిరిగిన తుమ్మల రాజకీయాలు
సాధారణ రైతుబిడ్డగా జీవితం ప్రారంభించిన తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల్లో అరుదైన రికార్డు సృష్టించారు. 1986 మే 14న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తన మంత్రివర్గంలో చిన్ననీటిపారుదల శాఖ మంత్రిగా అవకాశం ఇవ్వడంతో ప్రారంభమైన ఆయన మంత్రిపదవి ప్రయాణం నేటికి నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. నలుగురు సీఎంల మంత్రివర్గాల్లోనూ పనిచేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సుదీర్ఘకాలం మంత్రి పదవులు నిర్వహించిన నాయకుడిగా గుర్తింపు పొందారు.
నాడు ఎన్టీఆర్ దృష్టిలో పడి...
సత్తుపల్లి సామాన్య రైతుబిడ్డ తుమ్మల నాగేశ్వరరావు 1986వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు దృష్టిలో పడ్డారు. కాంగ్రెస్ కీలక నాయకుడు జలగం వెంగళరావు కంచుకోటగా పేరొందిన సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మొదటిసారి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావుకు 1986వ సంవత్సరం మే 14వతేదీ నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తన మంత్రివర్గంలో చిన్ననీటిపారుదల శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. అలా మంత్రిగా 40 వసంతాలు పూర్తి చేసుకొని, చంద్రబాబునాయుడు, కేసీఆర్, రేవంత్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేసి తుమ్మల రికార్డు సృష్టించారు.మట్టి వాసన తెలిసిన నిఖార్సైన రైతు బిడ్డగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.నాడు జలగం కోట అయిన సత్తుపల్లిలో టీడీపీ పక్షాన పాగా వేసేందుకు తుమ్మలకు ఎన్టీఆర్ ప్రోత్సాహం అందించడంతో ఆయన రైతు బిడ్డ నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా, మంత్రిగా ఎదిగారు.
గండిపేట కుటీరంలో ఎన్టీఆర్ తో తుమ్మల భేటీ (ఫైల్ ఫొటో)
ఎన్టీఆర్ పిలుపుతో...
1982వ సంవత్సరం మార్చి 29వతేదీన తెలుగుదేశం పార్టీని సినీనటుడైన ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు.నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా టీడీపీ ఆవిర్భావంతో ఒక కొత్త ఉత్సాహం ఏర్పడింది. ఆ సమయంలో ఖమ్మం జిల్లాలో రైతుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఎన్టీఆర్ పిలుపునకు ఆకర్షితులయ్యారు.ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల ప్రాబల్యం, జలగం కంచుకోటగా ఉన్న సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రైతు బిడ్డ అయిన తుమ్మల తెలుగుదేశం పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.
ఓటమి నుంచి విజయం దాకా...
1982లో రైతు బిడ్డ నుంచి సాధారణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ప్రయాణం మొదలుపెట్టిన తుమ్మల 1983వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.1983 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జలగం ప్రసాదరావు చేతిలో ఓటమి పాలయ్యారు.జలగం ప్రసాదరావు 42,494 ఓట్లు సాధించగా, తుమ్మల నాగేశ్వరరావు 36,278 ఓట్లు పొందారు. దాదాపు 6,200 ఓట్ల తేడాతో తుమ్మల పరాజయం చెందారు.కానీ పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తించిన ఎన్టీఆర్ ఆయనను జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను అప్పగించారు.
1985 అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్కినేని జోగారావుపై విజయం సాధించారు. దీంతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
జలగం అనుచరుడిగా...
రైతు బిడ్డ అయిన తుమ్మల యువకుడిగా నాటి సీఎం జలగం వెంగళరావు అనుచరుడిగా ఉండేవారు. జలగం పర్యటనకు వచ్చాడంటే చాలు ఆయన కారు ముందు తుమ్మల బుల్లెట్ బండిపై ఎస్కార్టుగా వెళ్లేవారు. అలా జలగం వెంగళరావు వద్ద రాజకీయ శిక్షణ పొందిన తుమ్మల ఆయనలోని క్రమశిక్షణ, వ్యవస్థాపక నైపుణ్యం, ప్రజలతో అనుబంధం లక్షణాలు అబ్బాయంటారు ఆయనతో కలిసి పనిచేసిన టీడీపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు మచ్చా శ్రీనివాసరావు.
అశ్వరావుపేట సమితి ఎన్నికల్లో జలగం ప్రసాదరావుకు వ్యతిరేకంగా అభ్యర్థిని గెలిపించిన తుమ్మల టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి ఎన్టీఆర్ చేయూతతో రాజకీయంగా ఎదిగారని శ్రీనివాసరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
వ్యవసాయమే ఆయన ప్రధాన వృత్తి
ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు.డిగ్రీ చదివినా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా చేపట్టిన తుమ్మల ట్రాక్టరుతో పొలం దున్నటం,పంటలు వేయడం, సాగు చేయడం దాకా అన్నీ వ్యవసాయ పనులు స్వయంగా చేసేవారు. క్రమశిక్షణ, అంకితభావం, ప్రజా సమస్యలపై అవగాహన ఆయనను ఖమ్మం జిల్లాలో ప్రభావశీల నాయకుడిగా నిలబెట్టాయంటారాయన.
సామాన్య టీడీపీ కార్యకర్తగా ప్రారంభమైన తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రయాణం, ఎన్టీఆర్ దృష్టిలో పడటం ద్వారా కీలక మలుపు తిరిగిందంటారు సత్తుపల్లి ప్రాంత రైతు నాయకుడు రాంరెడ్డి.
తుమ్మల ఆదర్శ రైతు
తుమ్మల కేవలం పాత పద్ధతుల్లోనే కాకుండా, ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంభించడంలో కూడా ముందుంటారు. తన సొంత పొలంలో పామాయిల్ తోటలు, ఇతర వాణిజ్య పంటలను సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు.కోకో, జాజి, కొబ్బరి, మామిడి వాణిజ్య పంటల సాగుతో రైతులకు మార్గదర్శి అయ్యారు. తెలంగాణలో పామాయిల్ సాగు విస్తరించడంలో ఆయన కృషి ఎంతో ఉంది. గతంలో ఆయన ఓడిపోయిన సమయంలో కూడా ఎక్కడా కుంగిపోకుండా, మళ్లీ తన పొలానికి వెళ్లి వ్యవసాయం చేసుకుంటూ ప్రజల మధ్యే ఉన్నారు. అదే ఆయనను మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లి, ఈ రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టేలా చేసింది.
‘‘రాజకీయం నాకు ఒక బాధ్యత అయితే, వ్యవసాయం నా ఊపిరి’’ అంటారు తుమ్మల.
మూలాలు మరవని మంత్రి
తుమ్మల చిన్నతనం నుంచే పొలం పనులను, రైతుల కష్టాలను కళ్లారా చూస్తూ పెరిగారు. ఆయన చదువుకున్నప్పటికీ, తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన పూర్తిస్థాయిలో వ్యవసాయంపైనే దృష్టి పెట్టారు.పట్టు వస్త్రాల కంటే, పని చేసేటప్పుడు ధరించే పంచెకట్టులోనే ఆయన ఎక్కువగా సౌకర్యంగా భావిస్తారు.రైతులతో కూర్చుని ముచ్చటించడం, వారితో కలిసి భోజనం చేయడం ఆయనకు అలవాటు అని ఆయన పేర్కొన్నారు.
చాలామంది నాయకులు పదవుల్లోకి వచ్చాక పొలానికి దూరమవుతారు, కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు అలా కాదు. ఇప్పటికీ సమయం దొరికితే చాలు, తన సొంత గ్రామానికి వెళ్లి ట్రాక్టర్ తోలడం, నాగలి పట్టడం వంటి పనులు చేస్తూ కనిపిస్తుంటారని గండగులపల్లి గ్రామానికి చెందిన రైతు కాసాని నాగవరప్రసాద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
నలుగురు సీఎంల మంత్రివర్గంలో...రికార్డు
నలుగురు ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు, కేసిఆర్, ప్రస్తుతం రేవంత్ రెడ్డి, ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా 1986 మే14 తేదిన, అక్టోబర్ 8,1995లో చంద్రబాబు కేబినెట్ లో,2014 డిసెంబర్ 16 కేసిఆర్ కేబినెట్ లో,2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రి గా తుమ్మల ప్రమాణ స్వీకారం చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం మంత్రి గా తుమ్మల రికార్డ్ సాధించారు.
అభినందన సభల వెల్లువ
1985 అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన రైతుబిడ్డ తుమ్మల నాగేశ్వరరావును మొదటిసారే మంత్రి పదవి లభించింది. 1986వ సంవత్సరం మే 14వతేదీ నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మంత్రివర్గంలో చిన్ననీటిపారుదల శాఖ మంత్రిగా తుమ్మల ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిగా 40 వసంతాలు పూర్తి చేసుకొని తుమ్మల రికార్డు సృష్టించారు. జిల్లాలో మంత్రిగా చేసిన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల శిలాఫలకాల చిత్రాలతో ఖమ్మం అభివృద్ధి ప్రదాత అంటూ ప్రచార కార్యక్రమాలు చేపట్టారు.
ఖమ్మం జిల్లా నుంచి మంత్రిగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న తుమ్మలకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆయన అభిమానులు అభినందన సభలు ఏర్పాటు చేశారు.
రైతు కుటుంబంలో జన్మించి, పొలంలో చెమటోడ్చి, ప్రజల విశ్వాసంతో నాలుగు దశాబ్దాల పాటు మంత్రి పదవుల్లో కొనసాగిన తుమ్మల నాగేశ్వరరావు ప్రస్థానం నేటి రాజకీయాల్లో అరుదైన ఉదాహరణ. పదవులు మారినా, పార్టీల రాజకీయ పరిస్థితులు మారినా, రైతు మనసు మాత్రం మారలేదని ఆయన జీవితం చెబుతోంది.