
రూ.100 కోట్లతో తిరుపతి స్విమ్స్ ఆధునీకరణ
రెండునెలల్లో పూర్తి స్థాయి క్యాన్సర్ బ్లాక్ ప్రారంభం
తిరుపతిలోని స్విమ్స్ (Sri Venkateswara Institute of Medical Sciences) ఆసుపత్రిలో రూ.55 కోట్లతో ఏర్పాటుచేసిన పెట్ సిటీ స్కాన్, గామా కెమెరా, హై ఎనర్జీ అడ్వాన్స్ లీనియర్ యాక్సిలరేటర్ ఆధునిక వైద్య పరికరాలను ఈరోజు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. క్యాన్సర్ వైద్య చికిత్సల కోసం శ్రీ బాలాజి ఆరోగ్యవరప్రసాదిని పథకం నిధులతో ప్రారంభించిన పెట్ సిటీ స్కాన్, గామా కెమెరా, హై ఎనర్జీ అడ్వాన్స్ డ్ లీనియర్ యాక్సిలరేటర్ వైద్య పరికరాలు ఇపుడు రోగులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందుతోందని ఆయన చెప్పారు. ఇందులో దాదాపు రూ.18కోట్ల విలువైన పెట్ సిటీ స్కాన్ పరికరం క్యాన్సర్, మెదడు సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులను త్వరగా గుర్తించడంలో ఉపయోగపడుతుందని, రూ.5 కోట్ల విలువైన గామా కెమెరా అవయవాల పనితీరును, కణజాల స్థితిని చిత్రాల రూపంలో చూపిస్తుందని ఆయన చెప్పారు. క్యాన్సర్, ఇన్ఫెక్షన్లు, గుండె, మెదడు, థైరాయిడ్, ఎముకలు, మూత్రపిండాల పనితీరును అంచనా వేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని నాయుడు వివరించారు.
అదేవిధంగా, రూ.29 కోట్ల విలువైన హై ఎనర్జీ అడ్వాన్స్డ్ లీనియర్ యాక్సిలరేటర్ ద్వారా అధిక శక్తి గల ఎక్స్-రేలు లేదా ఎలక్ట్రాన్ కిరణాలను క్యాన్సర్ ట్యూమర్పై ఖచ్చితంగా ప్రసారం చేస్తుందని చెబుతూ దీని వల్ల చుట్టుపక్కల ఆరోగ్యకర కణజాలానికి హాని తక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ యంత్రం మెదడు, రొమ్ము, ప్రోస్టేట్, ఊపిరితిత్తులు వంటి భాగాల్లో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడుతుందన్నారు.
స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి శ్రీ . నందమూరి తారక రామారావు రామారావు గారు స్థాపించిన స్విమ్స్ విశ్వవిద్యాలయం అంచలంచెలుగా అభివృద్ధి చెందుతోందని, 30 ఏళ్లుగా టిటిడి సహకారంతో రూ.450 కోట్లతో ఆసుపత్రిలో మెరుగైన వైద్యసౌకర్యాలు ఏర్పాటుజరిగిందని వివరించారు.
ఇపుడు రూ.600 కోట్లతో పలు భవనాలు నిర్మించుకుంటున్నామని వెల్లడిస్తూ ఆరు నెలల క్రితం దాతల సహకారంతో ఎంఆర్ ఐ, సిటి స్టిమ్యులేటర్ యంత్రాలు ప్రారంభించిన విషయం ఆయన గుర్తు8 చేశారు. మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో క్యాన్సర్ బ్లాకు ప్రారంభిస్తామని ఆయన అన్నారు. “ప్రస్తుత పోటీ ప్రపంచంలో భవిష్యత్తులో రోబోటిక్ సర్జరీలు, వైద్య విద్యార్థులకు ఉపయోగపడేలా సిమ్యులేటర్స్, వర్చువల్ డిసెక్షన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాము. ఇప్పటివరకు రూ.105 కోట్ల విరాళాలతో స్విమ్స్ పలు వైద్యపరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చాము. శ్రీ బాలాజి ఆరోగ్యవరప్రసాదిని పథకానికి విరివిగా విరాళాలు అందించి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు తోడ్పాటునందిస్తున్నారు. ఈ దాతలకు, కార్పొరేట్ సామాజిక బాధ్యతగా నిధులు అందిస్తున్న సంస్థలకు స్విమ్స్ కుటుంబం తరఫున పాదాభివందనాలు” అని ఆయన చెప్పారు.

