
గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్.. కరీంనగర్‌లో ఉద్రిక్తత
కరీంనగర్ బంద్ నేపథ్యంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హుజురాబాద్ శాసన సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి వాహనం పై దాడి చేయడాన్ని నిరసిస్తూ శనివారం బిఆర్ఎస్ కరీంనగర్ బంద్ కు పిలుపు నిచ్చిన నేపథ్యంలో కరీంనగర్ లో బి ఆర్ ఎస్ శాసన సభ్యుడు గంగుల కమలాకర్ ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. కరీంనగర్ క్యాంపు కార్యాలయం వద్ద ఇటీవల బీజేపీ కార్యకర్తలు హుజురాబాద్ శాసన సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై దాడి చేశారు .
ఈ దాడిని నిరసిస్తూ బిఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. బి ఆర్ ఎస్ శనివారం కరీంనగర్ బంద్ కి పిలుపు నిచ్చిన నేపథ్యంలో చాలామంది బి ఆర్ ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి , కరీంనగర్ బిఆర్ఎస్ శాసన సభ్యుడు గంగుల కమలాకర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. గంగుల కమలాకర్ ఇంటి నుంచి బయటకు రాకుండా కార్యకర్తలు ఇంట్లో వెళ్లకుండా పోలీసులు ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసి వేశారు. ప్రజా సమస్యలపై బిఆర్ఎస్ బంద్ కి పిలుపునివ్వని దృష్ట్యా వ్యాపార వేత్తలు బంద్ కి సహకరించకూడదని మరో వైపు బీజేపీ పిలుపునిచ్చింది . గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్ వల్ల ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

