
వినియోగదారులకు గ్యాస్ కంపెనీల సబ్సిడీ షాక్
ఏడాదికి ఆదాయపు పన్ను రు. 10 లక్షలు కడుతున్న వినియోగదారులకు సబ్సిడీని నిలిపేయాలని గ్యాస్ కంపెనీలు డిసైడ్ అయ్యాయి
వినియోగదారులకు గ్యాస్ కంపెనీలు పెద్ద షాకిచ్చాయి. ఇంతకీ ఆ షాక్ ఏమిటంటే ఆదాయపు పన్ను కట్టేవారికి గ్యాస్ సబ్సిడీని నిలిపేస్తున్నాయి. ఏడాదికి ఆదాయపు పన్ను రు. 10 లక్షలు కడుతున్న వినియోగదారులకు సబ్సిడీని నిలిపేయాలని గ్యాస్ కంపెనీలు డిసైడ్ అయ్యాయి. ఈమేరకు ఈనెల 10వ తేదీనుండి ఇండేన్, హెచ్పీసీఎల్ కంపెనీల పేరుతో వినియోగదారులకు మెసేజులు అందుతున్నాయి. మెసేజ్ అందిన ఏడురోజుల్లోగా తగిన వివరణను ఇవ్వకపోతే గ్యాస్ సబ్సిడీని నిలిపేస్తామని మెసేజ్ లో కనబడుతోంది. సబ్సిడీ నిలిపివేతకు సంబందించి వినియోగదారులు గ్రీవెన్స్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని లేకపోతే 1800 23 35 55 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయచ్చని కూడా ఎస్ఎంఎస్ లో ఉంటోంది.
ఇంత సడెన్ గా గ్యాస్ కంపెనీలు సబ్సిడీలను ఎత్తేసే నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నట్లు ? ఎందుకంటే యుద్ధం అనే చెప్పాలి. పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య రెండునెలలుగా జరుగుతున్న యుద్ధమే దీనికి ప్రధాన కారణమని చెప్పాలి. ఆయిల్, గ్యాస్ ను మనదేశం విదేశాల నుండి దిగుమతులు చేసుకుంటోంది. దిగుమతిచేసుకుని ఆయిల్, గ్యాస్ లో అత్యధికం గల్ఫ్ దేశాల నుండే వస్తోంది. పై దేశాల మధ్య యుద్ధం మొదలైనా అది క్రమంగా గల్ఫ్ లోని దుబాయ్, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, కువైట్ లాంటి దేశాలకూ పాకింది. దాంతో పై దేశాల్లో చమురు, గ్యాస్ ఉత్సత్తి దాదాపు నిలిచిపోయింది. ఉత్పత్తి నిలిచిపోయింది కాబట్టి ఆ ప్రభావం సరఫరా మీదపడింది. ఇదికాకుండా వందలాది ఓడలు హర్మూజ్ జలసంధిలోనే రెండునెలలుగా నిలిచిపోయాయి.
యుద్ధం ఎఫెక్ట్ ప్రపంచంలోని దాదాపు 70 దేశాలపైన పడింది. అందులో మనదేశం కూడా ఒకటి. ఇంతకాలం కేంద్రప్రభుత్వం దగ్గరున్న నిల్వలతో ఏదోలా నెట్టుకొచ్చినా ఇపుడు సాధ్యంకావటంలేదు. అందుకనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పొదుపు మంత్రాన్ని జపిస్తున్నది. ఈమధ్యనే కమర్షియల్ గ్యాస్ ధరను ఒక్కసారిగా 993 రూపాయలు పెంచిన విషయం తెలిసిందే. ఒకటి రెండు రోజుల్లోనే గృహవినియోగ గ్యాస్, పెట్రోల్, డీజల్ ధరలను కూడా కేంద్రం పెంచే ఆలోచనలో ఉంది. ఆయిల్ మీదైతే లీటర్ కు సుమారు 5-10 రూపాయల మధ్య గ్యాస్ మీద 15 రూపాయలు పెరిగే అవకాశం ఉందని సంకేతాలు కనబడుతున్నాయి.
డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ నిలిపివేతకు ఐటి రికార్డులను ఆధారం చేసుకుంటున్నాయి గ్యాస్ కంపెనీలు. రాష్ట్రంలో సుమారు 1.25 కోట్ల గ్యాస్ వినియోగదారులున్నారు. వీరిలో సింగిల్ సిలిండర్లు, డబుల్ సిలిండర్ల వినియోగదారులున్నారు. సిబ్సిడీని నిలిపివేత అన్నది డబుల్ సిలిండర్ వినియోగదారులకే వర్తించబోతున్నట్లు సమాచారం. సుమారుగా 45 రూపాయలు సబ్సిడీ రూపంలో వినియోగదారులకు అందుతోంది. ముందు గ్యాస్ ధరను చెల్లించిన తర్వాత అంటే ఒక ఐదారు రోజుల తర్వాత వినియోగదారుడి ఖాతాకు 45 రూపాయల సబ్సిడీ అందుతోంది. తొందరలోన ఈ సబ్సిడీని గ్యాస్ కంపెనీలు నిలిపేయబోతున్నాయి.

