
రూ.70 కోట్ల మనీ ట్రైల్?.. వీరమణి కేసులో సిట్ దర్యాప్తు వేగం
‘జెమ్’ వీరమణి పోక్సో కేసులో తమిళనాడు పోలీసులు నలుగురు మహిళలతో సిట్ ఏర్పాటు చేశారు. లైంగిక ఆరోపణలతో పాటు రూ.70 కోట్ల మనీ ట్రైల్‌పైనా విచారణ జరగనుంది.
‘జెమ్’ గ్రానైట్స్ వ్యవస్థాపకుడు 84 ఏళ్ల ఆర్. వీరమణిపై నమోదయిన పోక్సో కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసు దర్యాప్తునకు ప్రభుత్వం నలుగురు మహిళా పోలీసు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (S.I.T) ఏర్పాటు చేసింది. వీరమణి మైనర్ బాలికలే లక్ష్యంగా దశాబ్దాలుగా లైంగిక వేధింపులు, దోపిడీకి పాల్పడే ముఠాను నడిపారన్న ఆరోపణలున్నాయి.
నలుగురు మహిళా అధికారులతో సిట్..
డీజీపీ మహేష్ కుమార్ అగర్వాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అదనపు పోలీస్ కమిషనర్ పీసీ తెన్మొళి ఈ బృందానికి నాయకత్వం వహించనున్నారు. గ్రేటర్ చెన్నై పోలీస్ శాంతిభద్రతల జాయింట్ కమిషనర్ దిశా మిట్టల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మీడియా రిలేషన్స్ ఆఫీసర్ జె. ముత్తరసి, మహిళలు, పిల్లలపై నేరాల విభాగం డీసీపీ వి.వి. గీతాంజలి సిట్‌లో సభ్యులుగా ఉన్నారు.
ఆరోపణల నుంచి సాక్ష్యాల వరకు..
వీరమణి, అతని అనుచరుల అరెస్టు అనంతరం కేసు తీవ్రత దృష్ట్యా ఈ కేసును సిట్‌కు అప్పగించారు. బాలికపై అత్యాచారం కేసులో వీరమణితో పాటు శాంతి, మహేంద్ర సింహన్‌ను ఆగస్టు 29న అరెస్టు చేశారు. ఆ తర్వాత, సెప్టెంబర్ 22న జెమ్ గ్రానైట్స్ మాజీ ఉద్యోగి గణేసన్‌ను కూడా అరెస్టు చేశారు.ఇప్పటివరకు పోలీసులు సేకరించిన ఆధారాలు, వాంగ్మూలాలు, ఇతర కీలక సమాచారాన్ని సిట్ పరిశీలించనుంది. కేసులో కొత్తగా వెలుగులోకి వచ్చే అంశాలను కూడా దర్యాప్తు పరిధిలోకి తీసుకునే అవకాశం ఉంది.
రూ.70 కోట్ల మనీ ట్రైల్‌పై ప్రత్యేక దృష్టి..
ఈ కేసులో మరో కీలక అంశం భారీగా నగదు లావాదేవీలు. 2025లో ఈ వ్యవహారం తొలిసారి వెలుగులోకి వచ్చిన సమయంలో, కేసును పక్కదారి పట్టించేందుకు మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులను సుమారు రూ.70 కోట్ల మేర డబ్బు ఖర్చుచేశారన్న ఆరోపణలొచ్చాయి. ఇంత భారీ మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి చేరింది? ఇందులో ఎవరి పాత్ర ఏమిటన్న అంశాలపై దర్యాప్తు జరగనుంది.
ఉన్నతాధికారుల బదిలీ తర్వాత సిట్ ఎంట్రీ
కేసు దర్యాప్తు నేపథ్యంలో పలువురు సీనియర్ పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఏడీజీపీ ఎ. అరుణ్, కోయంబత్తూరు కమిషనర్ ఎన్. కన్నన్, ఏసీపీ ఎంఏ యాస్మిన్ సహా పలువురు ఉన్నతాధికారులను ఆకస్మికంగా బదిలీ చేయడం లేదా విధుల నుంచి తప్పించడం జరిగింది.
కేసును ముందుగానే ముగించేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రాథమిక దర్యాప్తు దశలోనే కొందరు అధికారులకు ఈ కేసుతో సంబంధం ఉందన్న వార్తల నేపథ్యంలో.. ఇప్పుడు సిట్‌కు పూర్తి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు.
దర్యాప్తు ఎటువైపు?..
లైంగిక వేధింపుల ఆరోపణలు, నగదు లావాదేవీలు, పోలీసుల పాత్ర..ఈ కేసులో ముడిపడి ఉన్నాయి. వీరమణి, అతని సహచరులపై ఉన్న ఆరోపణలతో పాటు.. కేసును అణచివేయడానికి ఎవరైనా ప్రయత్నించారా అన్న అంశాన్ని కూడా సిట్ తేల్చాల్సి ఉంది.

