
GHMCకి మరో షాక్.. పోలీసుల చేతికి ఫుడ్ సేఫ్టీ బాధ్యతలు?
GHMC నుంచి ఫుడ్ సేఫ్టీ బాధ్యతలు పోలీసులకు బదిలీ చేసే యోచనలో ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాలకు ముందే నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)కు భారీ షాక్ తగలనుంది. ఇప్పటికే కొన్ని శాఖల్లో కీలక అధికారాలను కోల్పోయిన జీహెచ్ఎంసీ.. అతి త్వరలో ఒక శాఖను పూర్తిగా కోల్పోనుంది. జీహెచ్ఎంసీలోని ఫుడ్ సేఫ్టీ శాఖ.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో మెర్జ్ కానుంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ.. హైడ్రా, హెచ్ఎండీఏ శాఖల్లో తమ అధికారాలను కొన్నింటిని కోల్పోయింది. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ శాఖను మొత్తంగా జీహెచ్ఎంసీ నుంచి పోలీసు డిపార్ట్‌మెంట్ మార్చే పనిలో ప్రభుత్వం ఉండటంతో.. జీహెచ్ఎంసీ నుంచి ఇంకా ఏమేమి శాఖలు బయటకు వెళ్లిపోతాయో అన్న చర్చలు మొదలయ్యాయి.
ఫుడ్ కల్తీపై చర్యలు తీసుకునే అధికారం ప్రస్తుతం GHMC పరిధిలో ఉంది. అయితే ఆ శాఖ సమర్థంగా పనిచేయడం లేదన్న ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ మార్పుపై దృష్టి పెట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇద్దరు సీనియర్ IPS అధికారులు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఫుడ్ సేఫ్టీ వ్యవస్థలను పరిశీలించారు. అక్కడ ఫుడ్ సేఫ్టీ బాధ్యతలు మున్సిపల్ సంస్థల పరిధిలో లేవని వారు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మరోవైపు GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్, పోలీసు ఉన్నతాధికారులు విలీన ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదే సమయంలో గురువారం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో FSSAI శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఆహార కల్తీని అరికట్టే చర్యలపై వారికి శిక్షణ ఇచ్చారు. GHMC ఇప్పటికే కొన్ని కీలక అధికారాలను కోల్పోయింది. చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములు, రోడ్లు, వరద కాలువల పరిరక్షణ బాధ్యతలను ప్రభుత్వం HYDRAAకు బదిలీ చేసింది.
పది అంతస్తులకు పైబడిన భవనాలు, లేఅవుట్లకు సంబంధించిన అనుమతుల అధికారాలను HMDAకు అప్పగించింది. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ బాధ్యతలు కూడా పోలీసుల చేతికి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. అయితే GHMC అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు తమ విభాగాల్లో ఉన్నట్లు చూపిస్తోంది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంతో ఫుడ్ సేఫ్టీ బాధ్యతలు ఏ శాఖ పరిధిలో ఉంటాయన్నది స్పష్టమవుతుంది.

