
నిరుద్యోగులకు తొందరలో శుభవార్త
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ దరఖాస్తుకు ఏజ్ అప్పర్ లిమిట్ పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోతోంది.
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు తొందరలోనే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోందా ? అవుననే అంటున్నాయి అధికారపార్టీ వర్గాలు. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ దరఖాస్తుకు ఏజ్ అప్పర్ లిమిట్ పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోతోంది. కొందరు మంత్రులు, ఎంఎల్సీలు ఇదేవిషయమై ఇప్పటికే రేవంత్ తో చర్చించినట్లు సమాచారం. తాజాగా ఎంఎల్సీలు ప్రొఫెసర్ కోదండరామ్, అద్దంకి దయాకర్ డిప్యుటి సీఎం మల్లు భట్టివిక్రమార్కను కలిశారు. ఏజ్ లిమిట్ పెంచేందుకు సహకరించాలని కోరారు. ఏజ్ లిమిట్ పెంచటం వల్ల నిరుద్యోగులకు లబ్దిచేకూరుతుందని ఎంఎల్సీలు భట్టితో చెప్పారు. గడచిన 20 ఏళ్ళుగా ఉద్యోగాల భర్తీ సరిగా జరగని కారణంగా నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. పెరిగిపోతున్న నిరుద్యోగుల వయసును దృష్టిలో పెట్టుకుని ఉద్యోగాల భర్తీలో అవకాశం ఇవ్వాలంటే ఏజ్ అప్పర్ లిమిట్ ను పెంచాలని ఎంఎల్సీలు సూచించారు.
కొందరు మంత్రులు, ఎంఎల్సీలు ఏజ్ లిమిట్ పెంచేవిషయంలో ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు కాబట్టి రేవంత్ కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నట్లు అధికారవర్గాలు భావిస్తున్నాయి. ఎన్ని శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేయాల్సిన అత్యవసరం ఏ శాఖల్లో ఉన్నాయనే విషయాన్ని అధికార యంత్రాంగం లెక్కలు తీస్తోంది. వివరాలన్నీ సేకరించిన తర్వాత ప్లానింగ్ విభాగానికి అందచేసిన తర్వాత అప్పుడు ఉద్యోగాల భర్తీపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ పెద్దగా దృష్టిపెట్టలేదు. తెలంగాణ ఉద్యమం నీళ్ళు, నిధులు, నియామకాల అనే అంశాలపైనే జరిగినా నిధులు, నియామకాల విషయాలను మాత్రం కేసీఆర్ ప్రభుత్వం వదిలిపెట్టేసిందనే ఆరోపణలున్నాయి. నిధుల మాటెలాగున్నా నియామకాల విషయంలో మాత్రం చాలా అన్యాయంగా వ్యవహరించింది. తొమ్మిదిన్నరేళ్ళు అధికారంలో ఉన్నా యూనివర్సిటీలు, కాలేజీల్లో అవసరమైన ఉద్యోగాలను భర్తీచేయలేదు. చివరకు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను కూడా నియమించలేదు. వేలాది అధ్యాపక పోస్టులను ఖాళీగానే వదిలేసింది. ఉద్యోగాల భర్తీకోసం నిరుద్యోగులు ఎన్ని ఆందోళనలు చేసినా కేసీఆర్ పట్టించుకోలేదు.
నియామకాల్లేవ్
గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినా అంతా గందరగోళంగానే తయారైంది. నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుండి పరీక్షల నిర్వహణ, పేపర్లు దిద్దుబాటు, ఫలితాల విడుదల వరకు అంత అస్తవ్యస్ధంగానే జరిగింది. అందుకనే నోటిఫికేషన్ జారీ అయిన దగ్గరనుండి దాన్ని తప్పులుపడుతు నిరుద్యోగులు ఆందోళనలు చేయటం లేదంటే కోర్టులో కేసులు వేయటమో చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో గ్రూప్స్ నోటిషికేషన్ ప్రతిదీ వివాదాస్పదంగానే ముగిసాయి.
తొమ్మిదిన్నరేళ్ళు కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై సరిగా దృష్టిపెట్టలేదు. 2014కు ముందు సమైక్య రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినా తెలంగాణ ఉద్యమంలో అవేవీ వర్కవుట్ కాలేదు. దాంతో దాదాపు 2009 నుండి ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగాలు భర్తీకి నోచుకోకుండా ఖాళీగానే ఉండిపోయాయి. ఇపుడు వాటిని భర్తీచేయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తోంది. రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీచర్లతో పాటు ఇతర శాఖల్లో కలిపి 67,673 ఉద్యోగాలను భర్తీచేసింది. ఇపుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్టలు 20 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. వివిధ శాఖల్లో మరో 40 వేల ఉద్యోగాల భర్తీకి తొందరలోనే నోటిఫికేషన్ రాబోతోందని సమాచారం. అందుకనే ఏజ్ లిమిట్ పెంచాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి.
నిరుద్యోగులకు న్యాయంచేయాలి : మానవతా రాయ్
ఇదే విషయమై నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ కోటూరి మానవతారాయ్ తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘కేసీఆర్ హయాంలో జీవో 30 ద్వారా ఏజ్ లిమిట్ 10 ఏళ్ళు పెంచారు’’ అని చెప్పారు. అప్పటివరకు ఉన్న ఏజ్ లిమిట్ 34 నుండి 44కి పెంచిన బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ, ఎసీ, ఎస్టీలకు అదనంగా మరో 5 ఏళ్ళు పెంచింది’’ అని గుర్తుచేశారు. ‘‘అయితే ఆ జీవో కాలపరిమితి 2026, ఫిబ్రవరికి అయిపోయింది’’ అని చెప్పారు. ‘‘అందుకనే జీవోను మళ్ళీ పునరుద్ధరించాలని నిరుద్యోగుల తరపున తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము’’ అన్నారు.
కేసీఆర్ హయాంలో ఉద్యోగాల భర్తీపై పెద్దగా దృష్టి పెట్టకపోయినా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు అని తెలిపారు. ‘‘రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వయోపరిమితి పెంచుతు జీవో ఇవ్వటమే కాకుండా అదనంగా మరో 2 ఏళ్ళు పెంచి దరఖాస్తులకు 34-46 వరకు అప్పర్ లిమిట్ వెసులుబాటు కల్పించింది’’ అని చెప్పారు. ‘‘ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం మానవతా దృక్పధంతో నిర్ణయాలు తీసుకోవాలి’’ అని రిక్వెస్ట్ చేశారు. కొన్నిరాష్ట్రాల్లో దరఖాస్తులకు వయోపరిమితి 45 ఉంది అని చెప్పారు. ఏపీలో కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉందని, అగ్రవర్ణాలకు 44 ఏళ్ళయితే ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ అభ్యర్ధులకు అదనంగా 5 ఏళ్ళు రిలాక్సేషన్ ఉంది అని వివరించారు.
‘‘ఈరోజుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోర్టల్ లో నమోదుచేసుకున్న నిరుద్యోగుల సంఖ్య 30 లక్షల మంది’’ అని రాయ్ చెప్పారు. ‘‘రేవంత్ ప్రభుత్వం గనుక ఏజ్ లిమిట్ పెంచితే పరీక్షలు రాసేందుకు అదనంగా మరో 3 లక్షల మందికి అవకాశం దక్కుతుంది’’ అని రాయ్ చెప్పారు. ‘‘ఈమధ్యనే 562 గ్రూప్ 1 పరీక్షలు రాసి ఎంపికైన వారిలో అత్యధికులు 25-30 ఏళ్ళ యువకులే’’ అని చెప్పారు. ‘‘ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినంత మాత్రాన యువతకు వచ్చే నష్టం ఏమీ ఉండదు’’ అని అభిప్రాయపడ్డారు. పరుగుపందెంలో ఎవరు ముందు వస్తే వాళ్ళదే గెలుపు అని సింపుల్ గా మానవతారాయ్ తేల్చేశారు.

