ప్రభుత్వ స్కూళ్ళ మూసివేత ‘ప్రైవేటు’ కోసమేనా ? (వీడియో)
x

ప్రభుత్వ స్కూళ్ళ మూసివేత ‘ప్రైవేటు’ కోసమేనా ? (వీడియో)

10 వేల ప్రైమరీ స్కూళ్ళను మూసేయాలన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళనలు పెరిగిపోతున్నాయి


రాబోయే రెండేళ్ళల్లో 10 వేల ప్రైమరీ స్కూళ్ళను మూసేయాలన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళ ప్రయోజనాల కోసమే అనే ఆరోపణలు కూడా పెరిగిపోతున్నాయి. విద్యార్ధులు, తల్లి, దండ్రుల, టీచర్ల మనోభావాలను యూనియన్ల నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నా ఎలాంటి ఉపయోగాలు కనబడటంలేదు. రెండేళ్ళల్లో 10వేల ప్రాధమిక స్కూళ్ళను మూసేయాలని ప్రభుత్వం డిసైడ్ చేయటంపై యూనియన్లు మండిపడుతున్నాయి.

స్కూళ్ళల్లో విద్యార్ధుల సంఖ్య చాలా తక్కువగా ఉండటమే స్కూళ్ళను మూసేయాలన్న నిర్ణయానికి కారణమని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా విద్యాశాఖ ఉన్నతాధికారుల నుండి విద్యాశాఖలోని అధికారులు, హెడ్ మాస్టర్లకు వీరినుండి టీచర్ యూనియన్లకు సమాచారం మౌఖికంగా సర్కులేట్ అయ్యింది. దాంతో అన్నీ వర్గాల్లోను ఆందోళనలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 26వేల ప్రైమరీ స్కూళ్ళున్నాయి. వీటిల్లో 20లోపు విద్యార్ధులుండే సింగిల్ టీచర్ స్కూళ్ళు 10 వేలున్నాయి.

ఈస్కూళ్ళల్లో విద్యార్ధుల సంఖ్య 10కన్నా తగ్గితే ఈ10వేల స్కూళ్ళను మూసేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే చాలా స్కూళ్ళల్లో విద్యార్ధుల సంఖ్య తగ్గిపోయింది. విద్యార్ధులు లేరు కాబట్టి స్కూళ్ళను మూసేస్తామని రేవంత్ చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ వైఫల్యంవల్లే స్కూళ్ళు మూతపడుతున్నాయని ఉపాధ్యాయయూనియన్లు మండిపడుతున్నాయి. ‘‘కార్పొరేట్ స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూళ్ళ ఫంక్షన్లకు రేవంత్ హాజరవటంతో సమాజానికి ప్రభుత్వం ఎలాంటి మెసేజ్ పంపుతున్నది’’ అని తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్ ప్రశ్నించారు.

‘‘స్కూళ్ళను బలోపేతం చేసి, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తే ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్ధుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది’’ అని వెంకట్ నిలదీశారు. ‘‘ప్రభుత్వానికి ప్రైమరీ స్కూళ్ళను నడపటం ఇష్టంలేదు’’ అని ఆరోపించారు.

స్కూళ్ళ మూసివేతకు సంబంధించి విద్యాశాఖ ఉన్నతాధికారుల నుండి డీఈవోలతో పాటు వివిధ స్కూళ్ళ హెడ్‌మాస్టర్లకు మౌఖికమైన ఆదేశాలు ఇప్పటికే అందినట్లు యూనియన్లు చెబుతున్నాయి. ‘‘విద్యాశాఖలో అధికారులను కూడా ప్రభుత్వం భర్తీ చేయటంలేదు’’ని వెంకట్ ఆరూపించారు. ‘‘ఉండాల్సిన 33 మంది డీఈవోలకు 12 పోస్టులు మాత్రమే మంజూరయ్యాయయని వీటిల్లో కూడా పనిచేస్తున్నది 5 మందే’’ అని వెంకట్ చెప్పారు. అలాగే ‘‘28 జిల్లాలకు ఇన్చార్జి డీఈవోలే దిక్కుగా ఉన్నారు’’ అని తెలిపారు.

డిప్యుటి డీఈవోలు 72 మంది అవసరమైతే ఇపుడు పనిచేస్తున్నది 12 మందే అన్నారు. రాష్ట్రంలోని 612 మండలాల్లో మంజూరైన ఎంఈఓ పోస్టులు 459 అయితే ఇపుడున్న రెగ్యులర్ ఎంఈవోలు 40 మంది మిగిలిన 565 ఇన్చార్జి ఎంఈవోలతో ప్రభుత్వం నెట్టుకొస్తోందని మండిపడ్డారు.

ఇదే విషయమై ఒక పేరంట్ మెండెం కృష్ణంరాజు ఫెడరల్ తెలంగాణతో మాట్లాడుతు ‘‘ స్కూళ్ళు మూసివేత అన్నది ప్రభుత్వం చేతకాని తనమే’’ అని అన్నారు. ‘‘ప్రభుత్వ నిర్ణయంవల్ల ప్రైవేటు స్కూళ్ళకే ప్రయోజనం దక్కుతుంది’’ అని ఆవేధన వ్యక్తంచేశారు. ‘‘స్కూళ్ళని మూసేయాలన్న నిర్ణయం వల్ల పేద పిల్లలు చదువుకు దూరమయ్యే ప్రమాదముంది’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘విద్య, వైద్యాన్ని ఉచితంగా అందరికీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది’’ అని కృష్ణంరాజు గుర్తుచేశారు.

Read More
Next Story