కాకతీయుల కాలం నాటి ఆలయం కూల్చివేత
x

కాకతీయుల కాలం నాటి ఆలయం కూల్చివేత

ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, చరిత్రకారులు.


వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అశోక్‌నగర్‌లో ఒక ఆలయం కూల్చివేత తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. పురాతన ఆలయాన్ని ప్రభుత్వం ఎలా కూల్చేస్తుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అశోక్‌నగర్‌లో ప్రభుత్వం ఒక పురాతన ఆలయాన్ని కూల్చేయడమే ఇందుకు కారణం. ఆ ఆలయం కాకతీయుల కాలానికి చెందినదని, అటువంటి వారసత్వ సంపదను కూల్చేయడం ససేమిరా తప్పని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన గుర్తు చేశారు.

అయితే తెలంగాణ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను దాదాపు ప్రతి నియోజకవర్గంలో చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే అశోక్‌నగర్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆవరణలో పురాతన కాలంనాటి ఆలయం ఉంది. ఈ ఆలయం పురావస్తు శాఖ పరిధిలోకి వస్తుంది. ఎటువంటి కారణం చెప్పకుండానే అధికారులు ఆ పురాతన ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేశారు. పురావస్తు, దేవాదాయ శాఖల నుంచి కనీస అనుమతి కూడా లేకుండా కూల్చేసినట్లు తెలుస్తోంది. కాగా ఆ ఆలయాన్ని కూల్చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇంత పురాతన ఆలయాన్ని ఎలా కూల్చేస్తారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే అంశంపై కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ హరగోపాల్ కూడా స్పందించారు. వారసత్వ సంపదను కాపాడాలని పిలుపునిచ్చారు. ‘‘800సం.ల కాకతీయులు నిర్మించిన ఈ శివాలయాన్ని కూల్చడానికి దినం పట్టకపోవచ్చు. కాని, కట్టడానికి సంవత్సరాలు పడతాయి. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆవరణలో గుడి ఉంటే దేనికి అడ్డంకి. అక్కడ ఒక వారసత్వ నిర్మాణాన్ని ఉండనీయొచ్చుకదా. ఎవరిదీ పాపం? ఎందుకా గుడికి శాపం?? ఈ కూల్చివేతకు పురావ‌స్తు, దేవాదాయ శాఖ‌ల క‌నీస అనుమ‌తి వుందో లేదో చెప్పేవారు లేరు’’ అని హరగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More
Next Story