తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పించండి
x
ప్రధాని మోదీకి రాష్ట్ర పెండింగ్ ప్రాజెక్టులపై వినతిపత్రాన్ని సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి (ఫైల్ ఫొటో : ఎక్స్ పోస్టు /తెలంగాణ సీఎంఓ)

తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పించండి

పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కోసం ప్రధాని మోదీకి సీఎం వినతి


దేశ ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం కీలక వినతిపత్రం సమర్పించనున్నారు. మెట్రో రెండో దశ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవనం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, రైల్వే,పారిశ్రామిక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం, నిధులు కోరనున్నారు.రాష్ట్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమైన మౌలిక వసతులు, సాగునీరు, రవాణా, పారిశ్రామిక, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు తక్షణ ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేయాలని సీఎం కోరనున్నారు.

మెట్రో రెండో దశకు నిధులివ్వండి

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతిపాదించిన మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ దశలో నగరంలోని పలు కొత్త మార్గాల్లో మెట్రో సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

రీజినల్ రింగ్ రోడ్డుకు ...

హైదరాబాద్ చుట్టూ ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, నిర్మాణ వ్యయాలకు కేంద్రం పూర్తి సహకారం అందించాలని వినతిపత్రంలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని పలు జిల్లాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందనున్నాయని సీఎం తెలిపారు.గద్వాల - మాబూబ్‌నగర్ నాలుగు లైన్ల రహదారి వంటి పెండింగ్‌లో ఉన్న రహదారి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరారు.

మూసీ నది పునరుజ్జీవనానికి నిధుల అభ్యర్థన

హైదరాబాద్ నగరానికి జీవనాడిగా భావిస్తున్న మూసీ నది పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మూసీనది శుద్ధి, కాలుష్య నివారణ, తీరాభివృద్ధి కార్యక్రమాలకు భారీ నిధులు అవసరమని వివరించారు.తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరనున్నారు.

సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వండి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సహా రాష్ట్రంలోని ముఖ్య సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని వినతిపత్రంలో సీఎం విజ్ఞప్తి చేయనున్నారు. దీంతో కేంద్రం నుంచి అధిక నిధులు పొందే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.తుమ్మిడిహట్టి వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించేందుకు సహకరించాలని కోరనున్నారు.కృష్ణా నది జలాల వాటాను 50:50 ప్రాతిపదికన కేటాయించాలని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును త్వరగా వెలువడేలా చూడాలని విజ్ఞప్తి చేయనున్నారు.దేవాదుల ప్రాజెక్టు పనుల వేగవంతానికి కేంద్ర ఆర్థిక సహాయం కోరారు.

రైల్వే ప్రాజెక్టుల వేగవంతానికి విజ్ఞప్తి

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే లైన్లు,రైల్వే లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ పనులను వేగవంతం చేయాలని సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. రైల్వే కనెక్టివిటీ మెరుగుపడితే పరిశ్రమలు, వాణిజ్యానికి మరింత ఊతం లభిస్తుందని సీఎం పేర్కొన్నారు.

పారిశ్రామిక కారిడార్లు, ఐటీ విస్తరణకు మద్దతు

జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, ఐటీఐఆర్, ఫార్మా సిటీ, డిఫెన్స్ కారిడార్ వంటి పారిశ్రామిక ప్రాజెక్టులకు కేంద్ర మద్దతు అందించాలని సీఎం కోరారు. ఈ ప్రాజెక్టుల వల్లభారీ ఉపాధి అవకాశాలు సృష్టించడంతో పాటు తెలంగాణను పెట్టుబడుల కేంద్రంగా నిలబెడతాయని సీఎం ప్రధానికి వినతిపత్రంలో పేర్కొన్నారు.గతంలో హైదరాబాద్‌కు కేటాయించి రద్దు చేసిన 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్' (ITIR) పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని లేదా దానికి సమానమైన ప్యాకేజీని ప్రకటించాలని కోరనున్నారు.తెలంగాణలో సెమీకండక్టర్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు 'ఇండియా సెమీకండక్టర్ మిషన్' కింద ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. హైదరాబాద్‌ను డిఫెన్స్ హబ్‌గా గుర్తించి, హైదరాబాద్ - బెంగళూరు డిఫెన్స్ కారిడార్‌ను అధికారికంగా ప్రకటించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ను సింగరేణి కాలరీస్‌కే కేటాయించాలని కోరారు.

రాజకీయాలకు అతీతంగా సహకారం కోరనున్న సీఎం

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పెండింగ్ ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదం లభిస్తే తెలంగాణ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని వినతిపత్రంలో వివరించారు.తెలంగాణ అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టుల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. మళ్లీ ఆదివారం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక డిమాండ్లను సీఎం ప్రధానికి విన్నవించనున్నారు.
Read More
Next Story