అమ్రాబాద్ పునరావాసానికి గ్రీన్ సిగ్నల్: వన్యప్రాణి సంరక్షణ
x
రాష్ట్ర వన్యప్రాణి మండలి స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అటవీశాఖ అధికారులు

అమ్రాబాద్ పునరావాసానికి గ్రీన్ సిగ్నల్: వన్యప్రాణి సంరక్షణ

పర్యావరణం–అభివృద్ధి సమతౌల్యం…


రాష్ట్ర వన్యప్రాణి మండలి స్టాండింగ్ కమిటీ సమావేశం పలు కీలక నిర్ణయాలకు వేదికైంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో గ్రామాల స్వచ్ఛంద పునరావాసానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు, వన్యప్రాణి సంరక్షణకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.

వన్యప్రాణి మండలి స్టాండింగ్ కమిటీ తొలి సమావేశం మంగళవారం నెహ్రూ జూలాజికల్ పార్కులో అటవీ,పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వన్యప్రాణి సంరక్షణకు సంబంధించిన అంశాలను సమీక్షించడంతో పాటు రక్షిత అటవీ ప్రాంతాల్లో చేపట్టే పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్‌ ప్రాంతం నుంచి గ్రామాల స్వచ్ఛంద పునరావాసంపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. నాలుగు గ్రామాలకు చెందిన 417 కుటుంబాల్లో 160 కుటుంబాలు ప్రత్యక్ష నగదు పరిహారం ఎంపిక చేసుకోగా, 257 కుటుంబాలు పునరావాస ప్యాకేజీకి అంగీకరించాయి. నగదు పరిహారం ఎంపిక చేసిన కుటుంబాలకు ఇప్పటికే జాయింట్ బ్యాంక్ ఖాతాలు తెరిచి, ఒక్కొక్క కుటుంబానికి రూ.15 లక్షలు జమ చేసినట్లు అధికారులు తెలిపారు.పునరావాసంపై కొన్ని వర్గాలు చేస్తున్న ప్రతికూల ప్రచారాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చిన అధికారులు, ఈ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందమని, గ్రామస్థుల విజ్ఞప్తుల మేరకే అమలు చేస్తున్నట్లు వివరించారు. ఎవరిపైనా ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. బాచారం పునరావాస కాలనీలో ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూముల కేటాయింపుతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

అభయారణ్యంలో రెండు రోడ్లకు సిఫార్సు

ఏటూరునాగారం వన్యప్రాణి అభయారణ్యంలో రెండు రహదారి ప్రాజెక్టులకు కమిటీ సిఫార్సు చేసింది. ఈ ప్రాజెక్టుల అమలులో వన్యప్రాణి సంరక్షణ చర్యలకు ప్రత్యేక నిధులు కేటాయించారు. డిండి బాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అటవీ భూమి వినియోగానికి అనుమతి ఇచ్చారు.కవాల్ టైగర్ రిజర్వ్, ప్రణహిత వన్యప్రాణి అభయారణ్యం ప్రాంతాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపారు.

క్విక్ రెస్పాన్స్ టీమ్‌

మనుషులు–వన్యప్రాణుల మధ్య ఘర్షణలను తగ్గించేందుకు నెహ్రూ జూలాజికల్ పార్క్, అమ్రాబాద్, కవాల్, కాకతీయ జూలాజికల్ పార్క్‌లలో క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. పర్యావరణ రుసుముల ద్వారా వచ్చిన నిధులను వన్యప్రాణి సంరక్షణ, ఈకోటూరిజం అభివృద్ధికి వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సమావేశంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. వికారాబాద్ జిల్లాలోని యెంకతల గడ్డి భూములను కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటించే అంశాన్ని పరిశీలించాలని సూచనలు వచ్చాయి. మంజీరాను రామ్సార్ సైట్‌గా ప్రకటించే ప్రతిపాదనపై కూడా చర్చించారు.

ఎథనాల్ ప్లాంట్ కు తిరస్కరణ

ఆసిఫాబాద్ జిల్లాలో ప్రతిపాదించిన ఎథనాల్ ప్లాంట్, డిండి ముంపు ప్రాంతంలో కేబుల్ లేయింగ్ ప్రాజెక్ట్‌లను పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా తిరస్కరించారు.


Read More
Next Story