లక్షలాది విద్యార్ధుల్లో పెరిగిపోతున్న అయోమయం
ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం అమలులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిలైన కారణంగా 2 లక్షలమంది విద్యార్ధులు పీజీ కోర్సుల్లో చేరే అవకాశాలను కోల్సోతున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి
ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం అమలులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిలైన కారణంగా 2 లక్షలమంది విద్యార్ధులు పీజీ కోర్సుల్లో చేరే అవకాశాలను కోల్సోతున్నారు. సుమారు 10 లక్షల మంది విద్యార్ధులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ అందటంలేదు. బీఆర్ఎస్ హయాంనుండే లక్షలాదిమంది విద్యార్ధులకు ప్రభుత్వం సుమారు 7వేల కోట్లరూపాయలు బకాయిలుపడింది.
ఇప్పుడు విషయం ఏమిటంటే డిగ్రీలు పూర్తిచేసి పోస్టు గ్రాడ్యుయేషన్ చేరేందుకు పీజీఈసెట్ పరీక్షలో పాస్ అయిన విద్యార్ధులకు పెద్ద సమస్య ఎదురైంది. పీజీలో చేరాలంటే డిగ్రీ సర్టిఫికేట్‌తో పాటు ప్రొవిజినల్ మెమో, టీసీ, బొనఫైడ్ సర్టిఫికేట్ తప్పని సరిగా చూపించాలి. అయితే ఈసర్టిఫికేట్లను విద్యార్ధులకు కళాశాలల యాజమాన్యాలు ఇవ్వటంలేదు.
ఎందుకంటే విద్యార్ధులకు అవసరమైన సర్టిఫికేట్లను ఇచ్చేస్తే వాళ్ళు చెల్లించాల్సిన ఫీజు బకాయిలు అలాగే ఉండిపోతాయని కాలేజీల యాజమాన్యాలు(ఫాతీ) ఆందోళన పడుతున్నాయి. ఫాతీ ఆధ్వర్యంలో సుమారు 2500 కాలేజీలున్నాయి. ఫాతీ కార్యవర్గం ఫీజు రీఎంబర్స్ మెంట్ పై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఎన్నిసార్లు కలిసినా ఉపయోగం కనబడలేదు.
విద్యార్ధుల తరపున ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ చేయటంలేదు. విద్యార్ధుల నుండి ఫీజులను వసూలు చేసుకోవటానికి యాజమాన్యాలనూ అనుమతించటంలేదు. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచని కళాశాలల యాజమాన్యాలు విద్యార్ధులకు ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఆపేస్తున్నాయి. ఫలితంగా సుమారు 2 లక్షలమంది విద్యార్ధులు పీజీకోర్పుల్లో చేరే అవకాశాలను కోల్పోతున్నారు. విద్యాశాఖకు మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా మాట్లాడకపోవటంతో విద్యార్ధుల్లో ఆందోళన పెరిగిపోతోంది.

