
జ్ఞానేష్ కుమార్‌పై సుప్రీంలో పిటిషన్.. SIRతో కొత్త మలుపు
SIR వ్యవహారంలో CEC జ్ఞానేష్ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మరోవైపు ఆయన తొలగింపును కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండటంతో వివాదం మరింత ముదిరింది.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (SIR)లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చుట్టూ వివాదం మరింత ముదిరింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు లైవ్ లా తెలిపింది.
SIRకు సంబంధించి చట్టబద్ధమైన విధులను ఉల్లంఘించారనే ఆరోపణలపై జ్ఞానేష్ కుమార్‌పై విచారణ జరపాలని పిటిషన్లో కోరారు. అంతేకాదు.. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఆదేశాలు, సాఫ్ట్వేర్ మార్పులు కూడా చట్టపరంగా చెల్లవని ప్రకటించాలని కోరారు. ఈ నిర్ణయాలు మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి సమ్మతి లేకుండానే తీసుకున్నారన్నది పిటిషన్‌లోని ప్రధాన ఆరోపణ.
ఇక్కడే SIR వ్యవహారంలో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు.. జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని నిర్ణయాలపై గత పది నెలల్లో కనీసం 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నివేదించింది.
ఫారం-6లో మార్పులు.. కొత్త ఓటర్ల నమోదు.. ఓటర్ల పేర్ల తొలగింపు.. ఓటర్ల డేటాబేస్ నిర్వహణ వంటి అంశాలపై ఈ అభ్యంతరాలు నమోదైనట్లు ఆ కథనం పేర్కొంది. తమకు తెలియకుండా లేదా తమ అభిప్రాయాలకు విరుద్ధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని సంధు, జోషి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు నివేదిక తెలిపింది. ముఖ్యంగా ఓటర్ల డేటాబేస్‌ను కేంద్రీకరించడంపై కూడా ఆ ఇద్దరు కమిషనర్లు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక పిటిషన్లో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సంబంధిత నిబంధనల కింద విచారణ జరపాలని కోరారు.
జ్ఞానేష్ కుమార్‌తో పాటు సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనీష్ గార్గ్, ఐటీ డైరెక్టర్ జనరల్ సీమా ఖన్నా తదితర అధికారులపై కూడా ఆరోపణలు ప్రస్తావించారు. 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోట్లాది ఓటర్ల పేర్ల తొలగింపుపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కూడా పిటిషన్ కోరుతోంది.
ఇదిలా ఉంటే.. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని లోక్‌సభా ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీంతో ఢిల్లీ కాంగ్రెస్ ఓబీసీ విభాగం ఐటీవో వద్ద ‘జ్ఞానేష్ హటావో.. చునావ్ ఆయోగ్ బచావో’ అంటూ పోస్టర్లు వెలిశాయి. భారత యువజన కాంగ్రెస్ కూడా జ్ఞానేష్ కుమార్‌ను తొలగించి, అరెస్టు చేసి విచారణ జరపాలంటూ ఆన్లైన్ ప్రచారం చేపట్టింది.
అయితే.. ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను అంగీకరించలేదు. గత ఏడాది తమ నిర్ణయాలు ఏకగ్రీవంగానే ఉన్నాయని.. సంస్థలో చర్చల సందర్భంగా భిన్నాభిప్రాయాలు, పరిశీలనలు వ్యక్తం కావడం సహజమేనని ఈసీ పేర్కొంది.
ఇప్పుడు సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌తో SIRపై రాజకీయ వివాదం మరోసారి న్యాయపరమైన మలుపు తీసుకుంది. ఒకవైపు ఎన్నికల సంఘం తన నిర్ణయాలను సమర్థిస్తుండగా.. మరోవైపు పిటిషన్లో తీవ్ర ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది.. SIRకు సంబంధించిన నిర్ణయాలపై ఎలాంటి న్యాయపర పరిశీలన జరుగుతుంది అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

