
కేటీఆర్, హరీష్‌పై లైంగిక వేధింపుల కేసు!
మహిళా పోలీసుల సమీపంలో అర్ధనగ్నంగా నిలబడ్డారని ఫిర్యాదు చేసిన మహిళా కానిస్టేబుల్.
మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ సహా పలువురిపై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. ఈ కేసులో హరీష్ రావు పేరును కూడా నమోదయింది. అసెంబ్లీ ముట్టిడికి బీఆర్ఎస్ ప్రయత్నించినప్పుడు మొదలైన వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. అసెంబ్లీ గేటు దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నల్ల టీషర్టుల నిరసనతో మొదలైన వివాదం.. పోలీసులతో ఘర్షణకు దారితీసింది. ఇప్పుడు ఇదే ఘటనపై బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు నేతలపై మహిళా కానిస్టేబుళ్లతో ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది.
సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్యే డి. సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పేర్లు ఉన్నాయి. మహిళా పోలీసుల విధులకు అడ్డుపడటం, దుర్భాషలాడటం, బెదిరించడం, మహిళా పోలీసుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించడం వంటి ఆరోపణలతో భారతీయ న్యాయ సంహితలోని..
సెక్షన్ 74 (మహిళల గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశంతో దాడి చేయడం)
సెక్షన్ 75(1) (లైంగిక వేధింపులు)
సెక్షన్ 79 (మహిళల మర్యాదకు అవమానం కలిగేలా సైగ చేయడం)
సెక్షన్ 121(1) (విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి గాయం కలిగించడం)
సెక్షన్ 130 (ప్రభుత్వ ఉద్యోగి విధికి ఆటంకం కలిగించేలా బలప్రయోగం చేయడం)
సెక్షన్ 132 ( ఒక వ్యక్తిని అక్రమంగా నిర్భంధించడానికి ప్రయత్నించడం, దాడి చేయడం చేయడం)
సెక్షన్ 296 (బహిరంగ ప్రదేశంలో అసభ్యకర చర్యలు)
సెక్షన్ 351(2) (క్రిమినల్ బెదిరింపులు)
సెక్షన్ 352 (శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించడం)
రెడ్‌విత్ 3(5) (ఒకే ఉద్దేశంలో పలువురు కలిసి నేరం చేసినప్పుడు అందరినీ బాధ్యులుగా పరిగణించడం) వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి వచ్చారు. ఆ టీషర్టులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నినాదాలు ఉన్నాయి. దాంతో వారిని పోలీసులు అసెంబ్లీ గేడు వద్దే అడ్డుకున్నారు. లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలోనే పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. నల్ల చొక్కాలు వేసుకుని లోపలికి వెళ్లడానికి వీలు లేదనడంతో హరీష్ రావు సహా చాలా మంది బీఆర్ఎస్ నేతలు అక్కడే తాము ధరించిన టీషర్ట్‌లను తొలగించారు.
ఆ సమయంలో బీఆర్ఎస్ నేతల ముందు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. తమ ఎదురు ఉన్న నాయకులు ఒక్కసారిగా టీషర్ట్‌లు తొలగించడంతో మహిళా కానిస్టేబుళ్లు కొంత అభ్యంతరకంగా ఫీల్ అయ్యారు. అయితే ఆ తర్వాత కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్‌కు తరలించారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు పలు కేసులు నమోదు చేశారు.
మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదులో ఏముంది?
తాజాగా 33 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం తాను అసెంబ్లీ మూడో నంబర్ గేటు వద్ద బందోబస్తు విధుల్లో ఉన్నట్లు ఫిర్యాదులో వివరించారు. బీఆర్ఎస్ నేతలను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే సమయంలో కేటీఆర్, హరీశ్‌రావు మహిళా పోలీసులతో వాగ్వాదానికి దిగారని ఆమె ఆరోపించారు. హరీశ్‌రావు తన టీషర్ట్‌ను తీసి పోలీసుల వైపు విసిరారని, అనంతరం మహిళా పోలీసుల సమీపంలో అర్ధనగ్నంగా నిలబడ్డారని ఫిర్యాదులో ఆరోపించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా టీషర్టులు తొలగించారని ఫిర్యాదులో ఉంది. అంతేకాకుండా, నేతలు మహిళా పోలీసులకు దగ్గరగా వెళ్లి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, ఈ క్రమంలో కొంతమంది పోలీసులను తోసివేయడం, నెట్టడం జరిగిందని మహిళా కానిస్టేబుల్ ఆరోపించారు. ఈ వ్యవహారం తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు మహిళా పోలీసులను భయపెట్టడం, అవమానించడం జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
ఢిల్లీకి హైదరాబాద్ వివాదం
హైదరాబాద్‌లో ముదురుతున్న ఈ వివాదాన్ని ఢిల్లీకి చేర్చడానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. కేటీఆర్ నివాసంలో జరిగిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో ఢిల్లీలో ఫిర్యాదులు చేయాలని బీఆర్ఎస్ నేతలు నిర్ణయించుకున్నారు. ఢిల్లీకి ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, సబిత ఇంద్రారెడ్డితో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా మరికొందరు నేతలు వెళ్లనున్నారు. ఢిల్లీలలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌తో పాటు జాతీయ మహిళా కమిషన్‌కు వారు ఫిర్యాదు చేయున్నారు. మహిళా నేతలపై పోలీసులు దాడి చేశారన్న అంశాన్ని మహిళా కమిషన్ అధికారులకు వివరించి ఈ అంశంలో వెంటనే జోక్యం చేసుకోవాలని కోరనున్నారు.
సైబర్ క్రైంలోనూ ఫిర్యాదు
దీంతో పాటుగా ఈ అంశంపై బీఆర్ఎస్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా ఏఐ ఫొటోలతో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని వారు ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము పోలీసులపై దాడి చేయకపోయినా.. దాడి చేసినట్లు ఏఐ సహాయంతో ఫొటోలను రెడీ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీని వెనక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని, దీనిపై వెంటనే విచారణ జరపాలని బీఆర్ఎస్.. సైబర్ క్రైం పోలీసులను కోరనున్నారు.

