
రాష్ట్రంలో జిల్లాల విభజనకు బ్రేక్ పడినట్టేనా?
48 పార్లమెంటు సీట్లు ఉన్న మహారాష్ట్ర లో 36 జిల్లాలు వుంటే 17 సీట్లు ఉన్న తెలంగాణలో 33 జిల్లాలు వున్నాయి
తెలంగాణలో జిల్లాల విభజన జనాభా, విస్తీర్ణం లేదా పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా అనే ఏ ఒక్క ప్రాతిపదిక లేకుండా జరిగింది. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లోని రెండు మండలాలు కరీంనగర్ జిల్లాలో, రెండు హన్మకొండలో మూడు సిద్దిపేట లో ఉన్నాయి. దీని వలన పరిపాలనలో ఇబ్బందులు ఎదురౌతున్నాయి.
అభివృద్ది, వికేంద్రీకరణను తారక మంత్రాలుగా మాట్లాడే రాజకీయ పార్టీలు ఆ పేరుతో చేపట్టే చర్యలు ఎప్పుడూ వివాదాస్పదం చర్చనీయాంశాలే. జిల్లాల పునర్విభజన చేస్తామని చెప్తున్న తెలంగాణ ప్రభుత్వం అందుకు ఒక రిటైర్డ్ హై కోర్టు లేదా సుప్రీం కోర్టు జడ్జ్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ని ఏర్పాటు చేస్తామని చెప్తోంది.
జిల్లాలను పునర్విభజిస్తామని ముఖ్య మంత్రి చెప్పిన నేపధ్యంలో బిఆర్ఎస్ చేసిన మార్పులు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యాచరణ చర్చకు రావటం ఆహ్వానించాల్సిన విషయమే. రాష్ట్ర విభజన తరువాత ఉన్న 10 జిల్లాలను 33 కు పెంచిన బిఆర్ఎస్ ప్రభుత్వం వాటిని నెలకొల్పటంలో ఏ ఒక్క ప్రాతిపదిక లేకుండా అస్తవ్యస్తంగా చేశారని వివిధ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
జిల్లాల విభజన జనాభా, విస్తీర్ణం లేదా పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా అనే ఏ ప్రాతిపదిక లేకుండా చేయటం వలన ఒకే అసెంబ్లీ నియోజకవర్గం రెండు లేదా మూడు జిల్లాల పరిధిలో ఉంది. నియోజకవర్గ కేంద్రాలయిన సిరిసిల్ల, వనపర్తి జిల్లా కేంద్రాలు కూడా. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాలలోని ఆరు మండలాలతో ఏర్పాటైతే, పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం జనగామ, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో వుంది. ఈ నియోజకవర్గ ఎంఎల్ఏ మూడు జిల్లాల అధికారులను సమన్వయం చేసుకుని పనిచేయాలి.
612 మండలాలు ఉన్న రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 11 మండలాలతో ఏర్పడగా 33 మండలాలతో నిజామాబాద్ జిల్లా ఏర్పాటు అయ్యింది. 12 కోట్ల జనాభా వున్న మహారాష్ట్ర లో 36 జిల్లాలు వుండగా, 3.5 కోట్ల మంది ఉన్న తెలంగాణ లో 33 జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. జిల్లాల పరంగా చూసినా వరంగల్ ఆరు జిల్లాలు, మహబూబ్ నగర్ ఐదు జిల్లాలు అయ్యింది. ఉమ్మడి ఖమ్మం రెండు జిల్లాలు కాగా నల్గొండ, మెదక్ మూడు జిల్లాలు అయ్యాయి.
48 పార్లమెంటు సీట్లు ఉన్న మహారాష్ట్ర లో 36 జిల్లాలు వుంటే 17 సీట్లు ఉన్న మన రాష్ట్రంలో 33 జిల్లాలు వున్నాయి. జనాభా పరంగా చూసినా జిల్లాల మధ్య సారూప్యత లేదు. ములుగు, భూపాలపల్లి జిల్లాలలో నాలుగు నుండి నాలుగున్నర లక్షల మంది వుంటే సంగారెడ్డిలో 30 లక్షలు, హైదరాబాద్ లో 40 లక్షలు, రంగారెడ్డి లో 30 లక్షల మంది వున్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్‌ల తరహలో ఎదుగుతున్న వరంగల్ హన్మకొండను రెండు జిల్లాలు చేశారు.
వైశాల్యంలో భద్రాద్రి కొత్తగూడెం 7,483 చ.కి.మీ తో అన్నిటి కంటే అత్యంత ఎక్కువ విస్తీర్ణం ఉన్న జిల్లా కాగా, హైదరాబాద్ వైశాల్యం 217 చ.కి.మీ మాత్రమే. 2000 చ.కి.మీ లోపు పరిధి ఉన్న జిల్లాలు 11 అయితే, 8 జిల్లాలు మూడు వేల నుండి నాలుగు వేల చ.కి.మీ ఉన్నాయి. నిజామాబాద్, సంగారెడ్డి లాంటి జిల్లాలు నాలుగు వేల చ.కి.మీ పైగా వుండగా ఆరు వేల పైన విస్తీర్ణంలో నాగర్ కర్నూల్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలున్నాయి.
జిల్లాల విభజన నాయకుల ఇష్టానుసారంగా చేశారని చెప్తూ, “ఒకే మున్సిపల్ కార్పొరేషన్ క్రింద ఉన్న వరంగల్, హన్మకొండ జిల్లాల పరంగా రెండుగా వున్నాయి. ఈ రెండు నగరాల కార్పొరేషన్ కు ఒక జూనియర్ స్థాయి ఐఎఎస్ అధికారి ఇన్‌ఛార్జ్ గా ఉన్నారు. ఈ రెండు జిల్లాలకు సీనియర్ ఐఎఎస్ అధికారులు ఇన్‌చార్జ్ గా ఉన్నారు. 10 జిల్లాల సిబ్బందినే 33 జిల్లాలు సృష్టించి సర్దుబాటు చేశారు. వాటికి కనీస సదుపాయాలు లేవు. పరిపాలనా సౌలభ్యం కోసం కాకుండా కేవలం రియల్ ఎస్టేట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ విభజన చేశారు,” అని కాకతీయ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర వేదిక ఛైర్మన్ విశ్రాంత ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ అన్నారు.
“బలమైన నాయకులు ఉన్న నల్గొండ, ఖమ్మం జిల్లాలు వరంగల్ లా ఎక్కువ ముక్కలు కాకుండా ఆగాయి. ఉత్తర తెలంగాణ అభివృద్దికి చోదక శక్తిగా ఉండాల్సిన వరంగల్ ముక్కలైంది. రాజకీయంగా శక్తివంతంగా ఉన్న వరంగల్ ను విభజించారు. వరంగల్ ఎదుగుదలకు దాన్ని హన్మకొండ తో కలపాలి. పాత ఉమ్మడి జిల్లా కేంద్రాలైన కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్ లను అభివృద్దికి కేంద్రాలుగా మార్చాలి. జిల్లాల విభజన వలన అవి బలహీన పడ్డాయి. ఇప్పటికీ హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ది జరుగుతోంది,” అని వెంకట నారాయణ అన్నారు. రాష్ట్ర ఆదాయంలో 54 శాతం ఇప్పటికీ హైదరాబాద్ నుండే వస్తోంది ఈ పరిస్థితి మారాలి అన్నారు.
పర్యావరణవేత్త, విశ్లేషకుడు దొంతి నరసింహ రెడ్డి మాట్లాడుతూ, “కెసిఆర్ జిల్లాల విభజన చేసేముందు ఎటువంటి సంప్రదింపులు జరపలేదు. ఇటీవల జీహెచ్ఎంసీ పరిధి పెంచే ముందదు కాంగ్రెస్ ప్రజాభిప్రాయం తీసుకోలేదు. జనాభా లెక్కలు లేకుండా సామాజిక వర్గాల గురించి వాళ్ల అంచనాల మీద ఆధారపడి జిల్లాలు చేస్తున్నారు. జిల్లాల విభజన ఏ లక్ష్యంతో చేస్తున్నారు? ప్రజలకు ఏదో చేస్తున్న భ్రమ కల్పిస్తూ రియల్ ఎస్టేట్ దందా కోసం నిర్ణయాలు జరుగుతున్నాయి,” అన్నారు.
“మూసీ ని ప్రక్షాళన చేస్తామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు తెచ్చుకుని ఖర్చు చేస్తున్నారు. దాని సమగ్ర అభివృద్ది కోసం రివర్ బేసిన్ అథారిటీ మాత్రం ఏర్పాటు చేయటం లేదు. కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చి ఖర్చు పెట్టడంలో నాయకులు, అధికారులకు మరో సౌలభ్యం ఉంది. డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి నిధులు తెస్తే వాటి ఖర్చుకు అనేక నిబంధనలు పాటించాలి. కార్పొరేషన్ లు చేసే ఖర్చులకు సంబంధించి జవాబుదారీతనం లేదు,” అని చెప్తూ ప్రభుత్వ నిర్ణయాల వెనుక ఉన్న ఉద్దేశాలు అర్థం చేసుకోవాలని అన్నారు.
“జిల్లాల విభజన ప్రజల కోరిక మేరకు జరగాలి. జనాభా, విస్తీర్ణం, సామాజిక సాంస్కృతిక గుర్తింపు, పరిపాలన సౌలభ్యం, మౌలిక సదుపాయాల లభ్యతను దృష్టిలో పెట్టుకుని చేయాలి. తమ రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీయటానికి ఈ విభజన ద్వారా యిప్పుడు ప్రయత్నాలు జరుగుతాయి అనే వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల అమలు గురించి ప్రశ్నించకుండా ఉండేందుకు ఉద్దేశించినవే ఈ రకమైన ప్రకటనలు,” చేస్తున్నారని సెస్(Centre for Economic and Social Studies) లో విజిటింగ్ ప్రొఫెసర్ సీహెచ్ బలరాములు అన్నారు.
జిల్లాలను గుర్తించేందుకు ఆయా ప్రాంతాలు జిల్లా కేంద్రానికి ఉన్న దూరం, ప్రకృతి సిద్దమైన సరిహద్దులు, సాంస్కృతిక అంశాలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్య పెరుగుదల లాంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని చేయాలని సెస్ లో పరిశోధక అసోసియేట్, పి. ఆంజనేయులు అభిప్రాయపడ్డారు.
“ఆంధ్ర ప్రదేశ్ పార్లమెంటు స్థానాల వారీగా జిల్లాలను విభజన చేసింది. దేశంలో 786 జిల్లాలు ఉండగా 543 లోక్ సభ స్థానాలు మాత్రేమే ఉన్నాయి. కేంద్రం ప్రతి పార్లమెంటు సీటు ను ఒక జిల్లాగా ఏర్పాటు చేయటం వైపు మొగ్గుచూపుతోంది. అన్ని సందర్భాలలో ఇది సాధ్యం కాకపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం 17 నుండి 20 జిల్లాలుగా రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్నట్టు వివిధ వర్గాలు చెప్తున్నాయి,” అని ఆయన అన్నారు.
నిర్ణయాలు ఎంత అసంబద్దంగా జరిగాయో చెప్తూ మండల కేంద్రాల గుర్తింపు సరిగా జరగలేదు. మా గ్రామం గౌరెల్లి హుస్నాబాద్ కు ఏడు కిలోమీటర్ల దూరంలో వుంటుంది. పక్క గ్రామం రేగొండ కు ఐదు కిలోమీటర్ల దూరం. అయినా మా గ్రామాలకు అక్కన్నపేట ను మండల కేంద్రంగా గుర్తించారు. సరైన రవాణా సౌకర్యం లేని ఈ ఊరికి వెళ్లాలంటే హుస్నాబాద్ కు వెళ్ళి అక్కడికి చేరుకోవాలి, అని వివరించారు.
అయితే కేంద్ర ప్రభుత్వం 2027లో జనగణన ప్రక్రియ చేపట్టేందుకు జిల్లాల పరిధి, సరిహద్దులు, వాటి పేరు మార్పు లాంటి ఏ రకమైన మార్పులు చేయరాదని చెప్పింది. జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్ గత సంవత్సరం ఆగష్టు లో ఒక సర్క్యులర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలియచేసారు. దీని వలన ఈ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు ప్రస్తుతానికి జిల్లాల విభజన ఆలోచనకు బ్రేక్ పడినట్టయింది.


