కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌కు బిగ్ రిలీఫ్..
x

కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌కు బిగ్ రిలీఫ్..

కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ చర్యలపై కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయి.


తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక విషయంలో కేసీఆర్, హరీష్ రావులపై కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ న్యాయస్థానం ఆదేశించింది. పీసీఘోష్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా దాఖలపైన పిటిషన్లను విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేషన్ కుమార్‌, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం తుది తీర్పు వెలువరించింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవకతవకలను విచారించడానికి పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును సమర్థించిన న్యాయస్థానం.. కమిషన్ ఇచ్చిన నివేదిక వ్యతిరేకించింది. ఆ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. విచారణ సమయంలో పీసీ ఘోష్ కమిషన్ ఎటువంటి నిబంధనలు పాటించలేదని, కావున ఆ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడం సమంజసం కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

సెక్షన్ 8 కింద నోటీసు ఇవ్వకండా ఆరోపణలు చేయడం సరికాదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. న్యాయస్థానం తీర్పుతో కేసీఆర్, హరీష్ రావులతో పాటు ఐఏఎస్ అధికారులు స్మిత సబర్వాల్, ఎస్‌కే జోషికీ కూడా ఈ అంశంలో భారీ ఊరట లభించింది. విచారణలో భాగంగా పిటిషనర్లు తమ వాదనలను కమిషన్ పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించబడ్డాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం తరఫున ప్రజాప్రయోజనాల దృష్ట్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని వాదించారు. రికార్డుల ఆధారంగానే నివేదిక సమర్పించబడిందని, సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారణ నిర్వహించామని కోర్టుకు వివరించారు. వాదనలు ముగిసిన తర్వాత ధర్మాసనం మార్చి 12న తీర్పును రిజర్వ్ చేసింది. మొదట ఏప్రిల్ 8న తీర్పు వెలువరించాలని భావించినప్పటికీ, అనంతరం నేటికి వాయిదా పడింది.

తాజా తీర్పులో జీవో నంబర్ 6ను హైకోర్టు సమర్థించింది. అయితే కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చకు ముందే మీడియాకు విడుదల చేయడాన్ని తప్పుబట్టింది. అలాగే ఆ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఇదే సమయంలో కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని సీబీఐ దర్యాప్తు కూడా చేయరాదని కోర్టు పేర్కొన్నట్టు సమాచారం.

తీర్పు అనంతరం కేసీఆర్ తరఫు న్యాయవాది గండ్రమోహన్ రావు స్పందిస్తూ, ఈ నిర్ణయంతో కేసీఆర్‌కు ఊరట లభించిందని తెలిపారు. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని, కానీ నివేదికను ఆధారంగా చేసుకుని చర్యలు తీసుకోవద్దని కోర్టు సూచించిందని వివరించారు.

Read More
Next Story