
NEET నిరసనల వేడి.. మోదీ రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీలో హైడ్రామా
NEET పేపర్ లీక్, విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ అగ్రనేతలు ధర్నా చేపట్టారు.
NEET పేపర్ లీక్ వ్యవహారం దేశ రాజకీయాల్లో మరింత వేడెక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసం ఎదుట ధర్నా చేపట్టింది. నిరసనను వేరే ప్రాంతానికి తరలించాలని పోలీసులు కోరినా, కాంగ్రెస్ నాయకులు నిరాకరించారు. దీంతో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థుల నిరసనలే కారణం..
సోమవారం సీజేపీ నిర్వహించిన ' చలో పార్లమెంట్' ర్యాలీలో విద్యార్థులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ ఘటనలో 118 మందికి పైగా పోలీసు సిబ్బంది, సుమారు 60 మంది నిరసనకారులు గాయపడినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. గాయపడిన ఒక యువతి ప్రస్తుతం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది.
విద్యార్థులకు పరామర్శించిన రాహుల్, ప్రియాంక ..
ధర్నాకు ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆసుపత్రికి వెళ్లి గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. అనంతరం ప్రధాని నివాసం వద్ద ధర్నా నిర్వహించారు. విద్యార్థులపై బలప్రయోగం జరిగిందని ఆరోపిస్తూ ప్రధాని మోదీ బాధ్యత వహించాలని, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
సీజేపీ ఆరోపణలు..
నిరసనల అనంతరం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. ముఖ్యంగా మహిళా నిరసనకారులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ఆరోపించారు. తమ మద్దతుదారులకు క్షమాపణలు చెబుతూ, గాయపడిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని తెలిపారు. కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష 24వ రోజుకు చేరుకుందని, ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించే వరకు పోరాటం కొనసాగుతుందని సీజేపీ ప్రకటించింది.
కేసుల నమోదు..
మరోవైపు నిరసనకారులు బారికేడ్లు ధ్వంసం చేశారని, రాళ్లు రువ్వారని, ప్రభుత్వ ఆస్తులను దెబ్బతీశారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటికే నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, మరో రెండు కేసులు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. రాజధాని ఢిల్లీలోని సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు, పారామిలిటరీ బలగాలను మోహరించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

