
తెలంగాణలో ఒకవైపు మండే ఎండలు...మరో వైపు వర్షాలు
తెలంగాణలో వడగాలులు వర్సెస్ వర్షాలు : ఆరు రోజులు డబుల్ ఎఫెక్ట్
తెలంగాణలో వెదర్ ట్విస్ట్.. ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణలో వాతావరణం మారిపోయింది. ఒకవైపు మండుతున్న ఎండలు, వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. మరోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే ఆరు రోజుల పాటు ఈ డబుల్ ఎఫెక్ట్ కొనసాగనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నుంచి రాగల ఆరురోజులు మండే ఎండలతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఒక వైపు వడగాలులతో కూడిన ఎండలతో ప్రజలు అల్లాడుతున్నారు. శుక్రవారం 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురవవచ్చని ధర్మరాజు తెలిపారు. గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంతోపాటు జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఆయన వివరించారు. 14 జిల్లాల్లో శుక్రవారం ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ పేర్కొంది.
ఆరు రోజులపాటు ఎల్లో అలెర్ట్
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏప్రిల్ 18వతేదీ నుంచి 23 వతేదీ వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. ఒక వైపు వడగాలులతో పాటు మరో వైపు కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాబోయే ఆరు రోజుల పాటు తెలంగాణలో ఎల్లోఅలెర్ట్ జారీ చేశామని ఐఎండీ డైరెక్టర్ డాక్టర్ ఎ నాగరత్న తెలిపారు. శనివారం నాడు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు,మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసేఅవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఏప్రిల్ 19వతేదీన కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్,భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశామని ఐఎండీ డైరెక్టర్ వివరించారు.
వర్షాలు కురిసే అవకాశం
శుక్రవారం తెలంగాణలో రాబోయే 2 గంటల్లో వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, ఆసిఫాబాద్, మంచిర్యాలలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ ఎక్స్ లో ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ తెలిపారు. ఈ వర్షాలు తేమను మరింత పెంచుతాయని, కొనసాగుతున్న వడగాలుల నుంచి ఎలాంటి ఉపశమనం కలిగించవని తెలంగాణ వాతావరణ నిపుణుడు బాలాజీ వివరించారు. ఉత్తర, దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ కు చేరుతాయని వెదర్ మ్యాన్ చెప్పారు.వడగాలులు వీస్తున్నందున వీలైనంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలను మానుకోవాలని, తగినంత నీరు తాగాలని సూచించారు. మధ్యాహ్నం వరకు వడగాలులు, సాయంత్రాలు వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ తెలిపారు.
మొత్తానికి తెలంగాణలో వాతావరణం గందరగోళంగా మారింది. పగటిపూట ఎండల తీవ్రత నుంచి తప్పించుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవడం, సాయంత్రం వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Next Story

