తెలంగాణాలో విస్తృతంగా వర్షాలు..10 జిల్లాలకు ఎల్లో అలర్ట్!
x

తెలంగాణాలో విస్తృతంగా వర్షాలు..10 జిల్లాలకు ఎల్లో అలర్ట్!

మూసీలో పెరుగుతున్న వరద


ర‌చ్చ‌ - రాజ‌కీయం @ 5 పి.ఎం.

1) తెలంగాణలో వర్ష బీభత్సం...మూసీలో పెరుగుతున్న వరద

2) రోడ్ల పక్కన వెండర్ జోన్లు..! HMDA మాస్టర్ ప్లాన్

3) మీర్-ఆలం చెరువుపై ఈ ఐకానిక్ బ్రిడ్జ్‌

1) తెలంగాణలో వర్ష బీభత్సం....మూసీలో పెరుగుతున్న వరద

హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మూసీ నదికి వరద నీటి తాకిడి పెరుగుతోంది. ఉపరితలాల నుంచి భారీగా వరద వస్తుండటంతో మూసీ ప్రాజెక్ట్‌ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి, నీటి వివరాలను అధికారులు విడుదల చేశారు.
తెలంగాణలోని Musi Project (మూసీ రిజర్వాయర్) పూర్తి స్థాయి నీటి మట్టం (FRL) 645 అడుగులు కాగా, ఆ నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు. నగరంలో కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి నిలకడగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా గరిష్ఠ స్థాయికి చేరువవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటి మట్టం 638 అడుగులకు చేరగా, అందులో నీటి నిల్వ 2.88 టీఎంసీలుగా నమోదైంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 20 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, నీటిమట్టాన్ని నియంత్రించేందుకు అధికారులు దిగువకు 727 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నీటిని విడుదల చేస్తున్నారు. వర్ష సూచనల నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను, నదీ తీర ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి. ఆదిలాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదైంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో మరోసారి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటలుగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవగా, పలు రహదారులపై వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించడంతో ఉద్యోగులు, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.
వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌లో నమోదైంది. అక్కడ 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, తాంసి, తలమడుగు, ఇచ్చోడ, భోరజ్, మావల మండలాల్లో 4.2 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది.
వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 4 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో 3.8 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా మొహమ్మద్‌నగర్ మండలం మొగ్దంపూర్‌లో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట తదితర జిల్లాల్లో కూడా మంచి వర్షాలు కురిశాయి.
ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉండటంతో రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు కొనసాగుతున్నాయని వివరించింది. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్రంలోని పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గురువారం, శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాలు, వాగులు, నాలాల సమీపంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు కొనసాగే అవకాశం ఉన్నందున వాహనదారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

2) రోడ్ల పక్కన వెండర్ జోన్లు..! HMDA మాస్టర్ ప్లాన్
హైదరాబాద్‌లో రోడ్ల పక్కన కనిపించే ఖాళీ ప్రభుత్వ స్థలాలు... ఇక కబ్జాలకు కాదు, ప్రభుత్వ ఆదాయానికి కేంద్రాలుగా మారబోతున్నాయి. ఫుట్‌పాత్‌లపై అనధికార వ్యాపారాలకు చెక్, ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం, చిరు వ్యాపారులకు శాశ్వత జీవనోపాధి... ఈ మూడు లక్ష్యాలతో HMDA పరిధిలోని హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (HUMTA) సరికొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. తొలి దశలోనే అమీర్‌పేట్‌లో వెండర్ జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అసలు ఈ ప్లాన్ ఏంటి? నగరానికి ఎలా ఉపయోగపడుతుంది?
హైదరాబాద్‌లో ప్రధాన చౌరస్తాలు, రోడ్ల పక్కన ఉన్న అనేక చిన్న ప్రభుత్వ స్థలాలు ప్రస్తుతం ఖాళీగా ఉండటం లేదా అక్రమ ఆక్రమణలకు గురవడం సాధారణంగా కనిపిస్తోంది. కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా ఫుట్‌పాత్‌లపై తోపుడు బండ్లు, డబ్బాలు, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు పెరగడంతో పాటు ప్రభుత్వ భూములు కూడా అన్యాక్రాంతమవుతున్నాయి.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా HUMTA కొత్త ప్రణాళిక రూపొందించింది. ఖాళీ ప్రభుత్వ స్థలాలను గుర్తించి అక్కడ ఆధునిక వెండర్ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చిన్నచిన్న శాశ్వత షాపులు నిర్మించి వాటిని అర్హులైన వీధి వ్యాపారులకు అద్దెకు ఇవ్వనుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో అమీర్‌పేట్ జంక్షన్, సత్యం థియేటర్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అధికారులు ఎంపిక చేశారు. ప్రస్తుతం అక్కడ అనుమతులు లేకుండా పార్కింగ్, తోపుడు బండ్లు, చిన్న వ్యాపారాలు సాగుతున్నాయని అధికారులు గుర్తించారు.ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలతో వెండర్ జోన్ ఏర్పాటు చేసి, పారదర్శక విధానంలో షాపులను కేటాయించనున్నారు. దీనివల్ల అక్కడ ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు, ప్రభుత్వానికి అద్దెల రూపంలో శాశ్వత ఆదాయం కూడా లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ మాస్టర్ ప్లాన్‌తో ఒకేసారి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి.
ప్రభుత్వ భూములు ఆక్రమణల నుంచి రక్షణ పొందుతాయి.
ఫుట్‌పాత్‌లు ఆక్రమణల నుంచి విముక్తి పొంది ట్రాఫిక్ సాఫీగా సాగుతుంది.
వీధి వ్యాపారులకు శాశ్వతంగా వ్యాపారం చేసుకునే అవకాశం లభిస్తుంది.
ప్రభుత్వానికి ప్రతి నెలా అద్దెల రూపంలో అదనపు ఆదాయం వస్తుంది.
నగరంలో వ్యాపార వ్యవస్థ మరింత క్రమబద్ధంగా మారుతుంది.
GHMC పరిధిలో ప్రస్తుతం లక్షకు పైగా వీధి వ్యాపారులు ఫుట్‌పాత్‌లపై జీవనోపాధి పొందుతున్నట్లు అంచనా. అలాగే 2026 ఏప్రిల్‌లో GHMC ప్రత్యేక డ్రైవ్‌లలో 2,620కుపైగా ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించింది. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అవసరమనే అభిప్రాయం బలపడింది.
అమీర్‌పేట్‌లో తొలి దశ విజయవంతమైతే... GHMC, HMDA పరిధిలోని ఇతర ప్రధాన జంక్షన్లు, రోడ్ల పక్కన ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో కూడా ఇదే తరహా వెండర్ జోన్లను ఏర్పాటు చేయాలని HUMTA ప్రణాళిక సిద్ధం చేసింది.
ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు కలిసి నగరవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తున్నారు. అనధికార ఆక్రమణలను తొలగించి, పారదర్శక విధానంలో అర్హులైన చిరు వ్యాపారులకే షాపులు కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఒకవైపు ఆక్రమణలకు అడ్డుకట్ట... మరోవైపు ట్రాఫిక్‌కు ఉపశమనం... ఇంకోవైపు చిరు వ్యాపారులకు శాశ్వత ఉపాధి. ఈ మూడు లక్ష్యాలతో అమలవుతున్న HUMTA వెండర్ జోన్ మాస్టర్ ప్లాన్, హైదరాబాద్ నగర నిర్వహణలో కొత్త మోడల్‌గా మారుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

3) మీర్-ఆలం చెరువుపై ఈ ఐకానిక్ బ్రిడ్జ్‌

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్... హైదరాబాద్‌కు ఒక కొత్త గుర్తింపు తీసుకొచ్చింది. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపడమే కాదు... నగరానికి కొత్త టూరిస్ట్ స్పాట్‌ను కూడా అందించింది. ఇప్పుడు అదే తరహాలో హైదరాబాద్‌కు మరో ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతోంది. చారిత్రక మీర్-ఆలం చెరువుపై రూ.430 కోట్లతో నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ నగర ట్రాఫిక్, పర్యాటకం, పర్యావరణం... ఈ మూడింటినీ ఒకేసారి మార్చబోతోంది. ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి? ఈ వంతెన ప్రత్యేకత ఏమిటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్‌లోని చారిత్రక మీర్-ఆలం చెరువుపై ఈ ఐకానిక్ బ్రిడ్జ్‌ను మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MRDCL) ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.430 కోట్ల పరిపాలన అనుమతులు ఇచ్చింది. వంతెన మొత్తం 2.5 కిలోమీటర్ల పొడవు, 16.5 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్లు, విశాలమైన ఫుట్‌పాత్‌తో నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జ్ శాస్త్రిపురం వైపు ఉన్న బెంగళూరు జాతీయ రహదారిని చింతల్‌మెట్ ప్రాంతంతో నేరుగా అనుసంధానిస్తుంది. దీని వల్ల ప్రస్తుతం చుట్టూ తిరిగి వెళ్లాల్సిన ప్రయాణ దూరం 5 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది.
ఈ వంతెన అందుబాటులోకి వస్తే బహదూర్‌పురా, ఆరాంఘర్, శాస్త్రిపురం, అత్తాపూర్, కిషన్‌బాగ్, చింతల్‌మెట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి వచ్చే వాహనాలు నగరంలోకి మరింత వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా ఇంధన వినియోగం కూడా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల వేలాది మంది రోజువారీ ప్రయాణికులకు ప్రత్యక్ష ప్రయోజనం కలగనుంది.
ఈ ప్రాజెక్ట్‌ను కేవలం వంతెన నిర్మాణంతో పరిమితం చేయడం లేదు. మీర్-ఆలం చెరువులోని రెండు దీవులను అభివృద్ధి చేయడంతో పాటు మొత్తం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాత్రి వేళల్లో ప్రత్యేక లైటింగ్, వాక్‌వేలు, ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చిన ఈ చారిత్రక చెరువును ఇప్పుడు నగరంలోని మరో ప్రముఖ టూరిస్ట్ డెస్టినేషన్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోంది.
ఇటీవల MRDCL మేనేజింగ్ డైరెక్టర్ ఇ.వి. నరసింహారెడ్డి పనులను సమీక్షించారు. ప్రస్తుతం సుమారు 40 శాతం నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలిపారు. పైల్ క్యాప్స్, పిల్లర్లు, పియర్ క్యాప్స్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు అవసరమైతే అదనపు యంత్రాలు, సిబ్బందిని వినియోగించాలని కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాదు... చెరువులోకి ఒక్క చుక్క శుద్ధి చేయని మురుగునీరు కూడా చేరకుండా చర్యలు తీసుకోవాలని, అందుబాటులో ఉన్న రెండు STPల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించాలని జలమండలి అధికారులకు సూచించారు. వర్షపు నీటి కాలువలను మురుగునీటి నాలాల నుంచి పూర్తిగా వేరు చేయాలని కూడా ఆదేశించారు.వంతెన నిర్మాణం పూర్తయ్యే సమయానికే చెరువు ప్రక్షాళన, రెండు దీవుల అభివృద్ధి పనులు కూడా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఎలా హైదరాబాద్‌కు కొత్త గుర్తింపుగా మారిందో... అదే తరహాలో మీర్-ఆలం ఐకానిక్ బ్రిడ్జ్ కూడా ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు నగర పర్యాటక రంగానికి మరో కొత్త ఆకర్షణగా మారుతుందనే ఆశలు ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది.
Read More
Next Story