హైదరాబాద్ జంట నగరాల చారిత్రక మహిమాన్వితాన్ని ప్రతిబింబించే ఆరు ప్రముఖ వారసత్వ కట్టడాలు ఇంటాక్ హెరిటేజ్ అవార్డు-2026లను అందుకున్నాయి. శతాబ్దాల చరిత్రను మోసుకువస్తున్న ఈ భవనాలు నగర పురాతన వైభవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.జంటనగరాల్లోని పురాతన ప్రాభవానికి చిహ్నాలుగా నిలిచిన ఆరు వారసత్వ భవనాలు హెరిటేజ్ అవార్డులతో పురాతన మైలురాళ్లుగా గుర్తింపు పొందాయి.
110 ఏళ్ల పురాతన చర్స్
సికింద్రాబాద్ లోని క్లాక్ టవర్ ఎదురుగా ఉన్న సీఎస్ఐ వెస్లీ చర్చ్ ను 1916వ సంవత్సరంలో నియోగోతిక్ వాస్తుశైలిలో నిర్మించారు. 110 సంవత్సరాల చారిత్రక ఉనికి ఉన్న ఈ చర్స్ ను బ్రిటీష్, నిజాం ప్రభుత్వాల సహకారంతో అప్పటి క్రిస్టియన్ మిషనరీ నిర్మించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర భవనాన్ని హైదరాబాద్ ఏడవ నిజాం నవాబ్ ఉస్మాన్ అలీఖాన్ 1917వ సంవత్సరంలో నిర్మించారు. బేగంపేటలోని నావిగేషన్ ట్రైనింగ్ స్కూలు వారసత్వ చరిత్రకు సాక్షీభూతంగా అవార్డు పొందింది. సైనిక విమానయాన శిక్షణకు కేంద్రంగా నావిగేషన్ అండ్ సిగ్నల్స్ స్కూల్‌ను 1967లో బేగంపేట్‌లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ భవనానికి తరలించారు.
శ్రీ పూరి జగన్నాథ ఆలయం
సికింద్రాబాద్ జనరల్ బజార్ లోని శ్రీ పూరి జగన్నాథ ఆలయం, రామగోపాల్ పేట పోలీసుస్టేషన్ భవనాలను నాడు రామగోపాల్ మలానీ నిర్మించారు. రాజస్థానీ ప్రభావంతో గోడలు, స్తంభాలపై నకాషీ ఉబ్బెత్తు శిల్పాలు, వంపు తిరిగిన తోరణాలు చెక్కించారు. ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) ను 1938 వ సంవత్సరంలో నిర్మించారు.అప్పటి జలవనరులు, ప్రజారోగ్య శాఖ మంత్రి దీవాన్ బహదూర్ అరవముద్దు అయ్యంగార్ దీనికి మద్ధతు ఇచ్చారు.
1885లో నిర్మించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ హౌస్ కూడా ఇన్ టాక్ హెరిటేజ్ అవార్డును అందుకుంది. ఈ భవనం సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ కమాండెంట్ నివాసంగా ఉంది. దక్కన్ ప్రాంతానికి అనువైన వాస్తు నిర్మాణ శైలితో పాటు, రక్షణ దళాలకు కేంద్రంగా ఉంది. 1996వ సంవత్సరం నుంచి ఇంటాక్ హైదరాబాద్ చాప్టర్ అవార్డులను ప్రదానం చేస్తుందని ఇంటాక్ (INTACH) హైదరాబాద్ చాప్టర్ కన్వీనర్ అనురాధ రెడ్డి వెల్లడించారు.
జంట నగరాల చారిత్రక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఈ అవార్డులు, పురాతన కట్టడాల పరిరక్షణకు కొత్త ఊపునిస్తాయి. భవిష్యత్ తరాలకు ఈ సంస్కృతిక సంపదను అందించేందుకు ఇవి మైలురాళ్లుగా నిలుస్తాయి.