
కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలపై స్టే రద్దు
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై సింగిల్ బెంచ్ విధించిన స్టేను హైకోర్టు సీజే ధర్మాసనం ఎత్తివేసింది.
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబాకర్ పథకాల అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ పథకాల అమలుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను సీజే ధర్మాసనం మంగళవారం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసింది. ఈ అప్పీల్ విచారణలో భాగంగా స్టేను రద్దు చేస్తున్నట్లు సీజే ధర్మాసనం వెల్లడించింది. ఈ పథకాల కోసం 2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన 8 జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో సింగిల్ జడ్జి పథకాల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టు సీజే ధర్మాసనాన్ని ఆశ్రయించింది. మంగళవారం అప్పీలుపై విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ పథకాలు 2014 నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాలేనని తెలిపారు.
పిటిషనర్‌పై పథకాల ప్రభావం లేదని, ఆయన హక్కులకు ఎలాంటి భంగం కలగలేదని పేర్కొన్నారు. అలాగే పిటిషనర్ ఈ పథకాల లబ్ధిదారు కూడా కాదని తెలిపారు. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని వాదించారు. షాదీ ముబారక్ తరహా పథకాన్ని సుప్రీంకోర్టు అనుమతించిందని, కల్యాణలక్ష్మి కూడా అదే తరహా పథకమని వివరించారు. ప్రభుత్వ వాదనలతో సీజే ధర్మాసనం ఏకీభవించింది. సింగిల్ బెంచ్ విధించిన స్టేను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు ఉన్న అడ్డంకి తొలగింది.

