హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు రెక్కలు:ఉస్మాన్ నగర్‌లో ఎకరం రూ.51 కోట్లు
x
ఉస్మాన్ నగర్ భూములకు రికార్డు ధర

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు రెక్కలు:ఉస్మాన్ నగర్‌లో ఎకరం రూ.51 కోట్లు

రికార్డు రేట్లతో దూసుకెళుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్… ఉస్మాన్ నగర్‌లో కొత్త బెంచ్‌మార్క్


హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి తన దూకుడును చాటుకుంది. నగర పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, తెల్లాపూర్ సమీపంలోని ఉస్మాన్ నగర్‌లో ఎకరం ధర రూ.51.25 కోట్లకు చేరడం సంచలనంగా మారింది. టీజీఐఐసీ నిర్వహించిన తాజా వేలంలో పెట్టుబడిదారులు పోటీగా బిడ్లు వేయడంతో ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ మ్యాప్‌పై హాట్‌స్పాట్‌గా నిలిచింది. ఐటీ హబ్‌లు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అవుటర్ రింగ్ రోడ్‌కు సమీపం కావడం వల్ల ఉస్మాన్ నగర్ భూములకు అపూర్వమైన డిమాండ్ నెలకొంది.


రికార్డు ధర

హైదరాబాద్ నగరంలో భూములకు మరోసారి రెక్కలొచ్చాయి. తెల్లాపూర్ సమీపంలోని ఉస్మాన్ నగర్ భూముల ఎకరం ధర రికార్డు స్థాయిలో రూ.51.25 కోట్లు పలికింది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) తాజాగా నిర్వహించిన వేలంలో అనూహ్యంగా ఎకరం ధర రూ.51.25కోట్లు పలికింది. ఉస్మాన్ నగర్ ప్రాంతంలో భూములకు టీజీఐఐసీ నిర్వహించిన ఈ వేలంలో రికార్డుస్థాయిలో బిడ్ లు వచ్చాయి. ఈ ప్రాంతంలో ఎకరం ధరను రూ.39కోట్లుగా రిజర్వు చేయగా, దీనిపై 30 శాతం ప్రీమియంతో రూ.51.25 కోట్లు పలికి కొత్త బెంచ్ మార్క్ ను నెలకొల్సింది. 5.72 ఎకరాల విస్తీర్ణం గల ఆరవ నంబరు ప్లాట్ ఎకరం ధర రూ.44 కోట్లకు బ్రిగేడ్ సంస్థ పొందింది. ఈ వేలంలో ఎకరం ధర సగటున రూ.48.6 కోట్ల చొప్పున విక్రయించారు.

రియల్ ఎస్టేట్ కంపెనీల మధ్య పోటీ

అవుటర్ రింగ్ రోడ్డు, నియోపోలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, కీలకమైన ఐటీ హబ్ లకు సమీపంలో ఉన్న ఉస్మాన్ నగర్ వ్యూహాత్మక ప్రదేశం కావడంతో వేలంలో ఈ భూములకు తీవ్రమైన పోటీ ఏర్పడింది. 15.81 ఎకరాలను రూ.768.36 కోట్లకు రియల్ ఎస్టేట్ కంపెనీలు సొంతం చేసుకున్నాయని అధికారులు చెప్పారు. 10.9 ఎకరాల భూమిని రాజపుష్ప రియల్ ఎస్టేట్ సంస్థ రూ.517 కోట్లకు వేలం పాడింది.

ఉస్మాన్ నగర్ భూమిని బహుళ వినియోగ జోన్ గా ప్రకటించడంతో పారిశ్రామికవేత్తలు పోటీపడి ఈ భూములను దక్కించుకున్నారని టీజీఐఐసీ ఎండీ కె శశాంక చెప్పారు.

హైదరాబాద్ అభివృద్ధి చూసి...

హైదరాబాద్ అభివృద్ధికి రాస్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి పెట్టుబడిదారులు భూముల కొనుగోలుకు ముందుకు వచ్చారని అధికారులు చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిచింది.

పెట్టుబడిదారుల హాట్‌స్పాట్‌

మొత్తానికి ఉస్మాన్ నగర్‌లో నమోదైన ఈ రికార్డు ధరలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. నగర విస్తరణ, ఐటీ రంగం వృద్ధి, మెరుగైన మౌలిక వసతులు...అన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని పెట్టుబడిదారుల హాట్‌స్పాట్‌గా మలుస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రీమియం ప్రాంతాల్లో భూముల విలువలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు ఇకపై మరింత బలమైన డిమాండ్ కొనసాగనుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Read More
Next Story