
హైదరాబాద్‌లో బ్రిక్స్ సమావేశం.. అవినీతి నియంత్రణే లక్ష్యం
భారత్ అధ్యక్షతలో హైదరాబాద్‌లో జరిగే బ్రిక్స్ సమావేశంలో ఆస్తుల రికవరీ, సరిహద్దు దాటి జరిగే అవినీతి నిరోధం, సాంకేతిక పరిపాలనపై కీలక చర్చలు జరగనున్నాయి.
హైదరాబాద్ వేదికగా బ్రిక్స్(BRICS) అవినీతి నియంత్రణపై కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఆగస్ట్ 4,5 తేదీల్లో జరగనుంది. సిబ్బంది, శిక్షణ విభాగం కార్యదర్శి రచనా షా ఈ సమావేశాన్ని ప్రారంభించనున్నారు. బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులతో పాటు సీనియర్ విధాన రూపకర్తలు, నిపుణులు, అవినీతి నిరోధక సంస్థలు, చట్ట అమలు సంస్థల ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశం 2026 జూన్ 2, 3 తేదీల్లో వర్చువల్‌గా జరిగిన తొలి బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం సమావేశం ఫలితాల కొనసాగింపుగా నిర్వహిస్తున్నారు.
ఇందులో ఆస్తుల రికవరీ, సరిహద్దులు దాటి జరిగే అవినీతిని అడ్డుకోవడం, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయడంపై సభ్య దేశాలు చర్చించనున్నాయి. బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం (ఏసీడబ్ల్యూజీ) రెండో సమావేశంతో పాటు ఆస్తుల రికవరీపై బ్రిక్స్ నిపుణుల నెట్‌వర్క్ రెండో సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) ఆతిథ్యం ఇస్తోంది. భారత్ అధ్యక్షతన కొనసాగుతున్న బ్రిక్స్‌కు "స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం" అనే ప్రధాన అంశాన్ని ఆధారంగా తీసుకుని ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
చర్చల్లో అవినీతి కేసుల్లో పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించేందుకు అనధికారిక సహకారాన్ని పెంచడం, అప్పగింత ప్రక్రియలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలు ప్రధానంగా ఉండనున్నాయి. అలాగే ఆస్తుల రికవరీపై బ్రిక్స్ నిపుణుల నెట్‌వర్క్ ద్వారా సమాచార మార్పిడి, కార్యాచరణ సహకారాన్ని విస్తరించే దిశగా కూడా చర్చలు సాగనున్నాయి. ఫిన్‌టెక్, డిజిటల్ ఆస్తులు, కొత్త డిజిటల్ ఆర్థిక సాధనాల వల్ల ఏర్పడే అవినీతి ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై సభ్య దేశాలు తమ అనుభవాలు, ఉత్తమ విధానాలను పంచుకోనున్నాయి.
ఆగస్టు 5న "ఆవిష్కరణ, సాంకేతిక ఆధారిత వ్యవస్థల ద్వారా నైతిక పరిపాలన" అనే అంశంపై ప్రత్యేక అనుబంధ కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. ఇందులో డిజిటల్ ప్రభుత్వ కొనుగోళ్లు, పౌర భాగస్వామ్యం, పారదర్శకత, జవాబుదారీతనం, సాంకేతిక ఆధారిత పరిపాలనలో అనుసరిస్తున్న విధానాలపై సభ్య దేశాలు అనుభవాలను పంచుకోనున్నాయి. భారత్ అధ్యక్షతలో జరుగుతున్న చివరి అవినీతి నిరోధక కార్యాచరణ బృంద సమావేశం కావడంతో దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశం ద్వారా ఈ ఏడాదిలో జరిగిన పురోగతిని మరింత బలోపేతం చేయడంతో పాటు ఆస్తుల రికవరీ, సరిహద్దు దాటి జరిగే అవినీతి నిరోధం, సాంకేతిక ఆధారిత పరిపాలన, సంస్థాగత సామర్థ్య నిర్మాణంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

