పోచారం విల్లా మోసం.. 42 మందికి రూ.39.57 కోట్ల టోకరా
x

పోచారం విల్లా మోసం.. 42 మందికి రూ.39.57 కోట్ల టోకరా

హైదరాబాద్ పోచారంలో విల్లా ప్రాజెక్ట్ పేరుతో భారీ మోసం బయటపడింది. 42 మంది కొనుగోలుదారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.


హైదరాబాద్ శివారులో భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. పోచారంలో విల్లా ప్రాజెక్ట్ పేరుతో 42 మంది కొనుగోలుదారుల నుంచి రూ.39.57 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సైబరాబాద్ పోలీసుల ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ తాజాగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ వ్యవహారంలో రామలింగం శ్రీకాంత్ రెడ్డి, రాజేశ్వరి, స్వామి రెడ్డి, రెడ్డి శారద, ఆర్‌ఎస్‌ఆర్ గ్రీన్‌వే ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, సూర్యోదయ గ్రూప్ సహా పలువురిపై కేసు నమోదైంది.

ఫిర్యాదు ప్రకారం.. మియాపూర్‌కు చెందిన వెంకట కోటేశ్వరరావుకు 2023 జనవరిలో రవి అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ఆర్‌ఎస్‌ఆర్ గ్రీన్‌వే ఇన్‌ఫ్రా సంస్థ టెలీకాలర్ అని పరిచయం చేసుకున్నాడు. పోచారంలో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్-3 దగ్గర 13.22 ఎకరాల్లో ‘రాకెట్రీ’ పేరుతో విల్లా ప్రాజెక్ట్ నిర్మిస్తున్నామని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారం రోజుల తర్వాత కోటేశ్వరరావు ప్రాజెక్ట్ స్థలాన్ని సందర్శించారు. అక్కడ నిర్మించబోయే విల్లాల స్థలాన్ని చూపించినట్లు తెలిపారు.

అలాగే సంస్థ మరికొన్ని ప్రాజెక్టులు కూడా చేపడుతోందని చెప్పినట్లు వెల్లడించారు. తర్వాత ఆయన కొండాపూర్‌లోని సంస్థ కార్యాలయానికి వెళ్లి డైరెక్టర్ రామలింగం శ్రీకాంత్ రెడ్డిని కలిశారు. సూర్యోదయ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నామని, స్వామి రెడ్డి, రెడ్డి శారద భాగస్వాములని చెప్పినట్లు ఫిర్యాదులో ఉంది. అలాగే హెచ్‌ఎండీఏ, రేరా అనుమతులు నెల రోజుల్లో వస్తాయని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కొనుగోలుదారులు తమ సామర్థ్యానికి అనుగుణంగా విల్లా ధరలో 20 శాతం నుంచి 100 శాతం వరకు చెల్లించాలని కోరినట్లు ఆరోపించారు.

ఈ హామీలను నమ్మిన కోటేశ్వరరావు నాలుగు విల్లాల కోసం రూ.3.57 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. అయితే తర్వాత ప్రాజెక్ట్‌కు అవసరమైన అనుమతులు రాలేదని ఆయన గుర్తించారు. తాను చూసిన స్థలంలో ‘గార్నెట్ సూర్యోదయ గ్రూప్’ పేరుతో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిసిందని తెలిపారు. దీనిపై సంస్థ ప్రతినిధులను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. వారు ఫోన్ కాల్స్‌కు స్పందించడం మానేశారని ఆరోపించారు.

తర్వాత ఈ ప్రాజెక్ట్ ద్వారా 42 మంది కొనుగోలుదారుల నుంచి మొత్తం రూ.39.57 కోట్లు వసూలు చేసినట్లు తెలిసిందని కోటేశ్వరరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ ఈవో‌డబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Read More
Next Story