బిక్షాటన నుంచి ఉద్యోగం : హైడ్రాతో ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో వెలుగు
x
హైడ్రా ఈగల్ టీం సభ్యులుగా ట్రాన్స్ జెండర్లు (ఫొటో : ఎక్స్ పోస్టు, హైడ్రా)

బిక్షాటన నుంచి ఉద్యోగం : హైడ్రాతో ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో వెలుగు

యూనిఫామ్ తెచ్చిన ఆత్మవిశ్వాసం


ఒకప్పుడు బిక్షాటనతో జీవనం సాగించిన ట్రాన్స్‌జెండర్లు.. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యతల్లో ముందుండటం సమాజంలో గొప్ప మార్పుకు నిదర్శనంగా నిలుస్తోంది. హైడ్రా ఈగల్ టీమ్‌లో చోటు దక్కించుకున్న ట్రాన్స్‌జెండర్లు తమ జీవితాలకు కొత్త అర్థం దొరికిందని చెబుతున్నారు. ఉద్యోగం మాత్రమే కాదు.. గౌరవం, గుర్తింపు, ఆత్మవిశ్వాసం కూడా తమకు లభించాయని భావోద్వేగంగా చెబుతున్నారు.

హైడ్రాలో ప్రస్తుతం 16 మంది ట్రాన్స్‌జెండర్లకు అవకాశం కల్పించారు. వీరిలో 11 మంది ట్రాన్స్ ఉమెన్‌లు, ఐదుగురు ట్రాన్స్ మెన్‌లు ఉన్నారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా హైడ్రా చేపడుతున్న చర్యల్లో వీరు చురుకుగా పాల్గొంటున్నారు. ఎక్కడైనా.. ఎప్పుడైనా విధులకు సిద్ధమంటూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు.



మా జీవితాలకు కొత్త గుర్తింపు

“హైడ్రాలో ఉద్యోగం మాకు కేవలం ఉపాధి మాత్రమే కాదు.. జీవితానికి కొత్త గుర్తింపు ఇచ్చింది” అని ట్రాన్స్‌జెండర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా యూనిఫాం ధరించడం గర్వంగా అనిపిస్తోందని, సమాజం ఇప్పుడు తమను గౌరవంతో చూస్తోందని చెబుతున్నారు. ‘హైడ్రా ఈగల్ టీమ్’గా ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం తమలో మరింత బాధ్యతను పెంచిందని పేర్కొంటున్నారు.

కబ్జాల తొలగింపులో కీలక పాత్ర

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో 862 ఎకరాల ప్రభుత్వ భూమి పరిరక్షణలో ట్రాన్స్‌జెండర్లు చురుకైన పాత్ర పోషించారు. ఇటీవల మాదాపూర్‌లో ఈదులకుంట పరిరక్షణ చర్యల్లోనూ ముందుండి పనిచేశారు. ప్రజలకు అవగాహన కల్పించడం, మహిళలతో మాట్లాడి పరిస్థితులను చక్కదిద్దడం, అధికారులు–ప్రజల మధ్య సమన్వయం చేయడం వంటి పనుల్లో ప్రత్యేక నైపుణ్యం చూపుతున్నారు.వారిలో సహనం, భావోద్వేగాలను అర్థం చేసుకునే స్వభావం ఎక్కువగా ఉండటంతో ఫీల్డ్‌లో మంచి ఫలితాలు సాధిస్తున్నారని హైడ్రా అధికారులు ప్రశంసిస్తున్నారు.

డబ్బుకంటే గౌరవమే ముఖ్యం: గాయత్రి

“మా జీవితాల్లో డబ్బుకంటే గౌరవమే ముఖ్యమైంది. ఇప్పుడు హైడ్రా యూనిఫాం వేసుకుని బయటికి వెళ్తే అందరూ గౌరవంగా చూస్తున్నారు. అది మా జీవితంలో పెద్ద మార్పు. అవకాశం ఇస్తే ట్రాన్స్‌జెండర్లు ఏ రంగంలోనైనా రాణిస్తారని మేము నిరూపిస్తున్నాం” అని గాయత్రి తెలిపారు. తమకు అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.



ప్రకృతిని కాపాడడంలో మేమూ భాగమే: రుచిత

“ప్రకృతిలో అందరూ భాగమే. ఆ ప్రకృతిని రక్షించడంలో మేము కూడా భాగస్వాములమవడం గర్వంగా ఉంది. చెరువులు, పార్కులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. హైడ్రాలో పని చేయడంతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది” అని రుచిత అన్నారు.

ఇప్పుడు అందరూ గౌరవంగా మాట్లాడుతున్నారు” – తాన్షీరాయ్

“మేము ఒకప్పుడు బిక్షాటన చేసుకుంటూ జీవించేవాళ్లం. ఎక్కడికి వెళ్లినా ఎగతాళి చేసేవారు. పని అడిగితే తిరస్కరించేవారు. కానీ ఇప్పుడు యూనిఫాం వేసుకుని విధులకు వెళ్తే అందరూ గౌరవంగా మాట్లాడుతున్నారు” అంటూ తాన్షీరాయ్ భావోద్వేగానికి గురయ్యారు.
హైడ్రా ఇచ్చిన అవకాశం ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో కేవలం ఉపాధి మార్పు కాదు.. ఆత్మగౌరవం, సామాజిక గుర్తింపు, భవిష్యత్తుపై నమ్మకం తీసుకొచ్చిన కొత్త ఆరంభంగా నిలుస్తోంది.
Read More
Next Story