హైకోర్టులో హైడ్రా కమిషనర్‌కు భారీ ఊరట
x

హైకోర్టులో హైడ్రా కమిషనర్‌కు భారీ ఊరట

శాంతా శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్‌ కేసులో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తప్పించాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే.


హైడ్రా కమిషనర్ ఏ రంగనాథ్‌‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. తనను వెంటనే తొలగించి ఆ స్థానంలో వేరొకరిని నియమించాలన్న సింగిల్ జడ్జ్ తీర్పును హైకోర్టు రద్దు చేసింది. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసులో సింగిల్ జడ్జ్ ఈ తీర్పు వెలువరించారు. కాగా తీర్పు తీవ్ర చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ తీర్పును ఛాలెంజ్ చేస్తూ తాజాగా రంగనాథ్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన అప్పీల్‌ను విచారించిన న్యాయస్థానం సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామంలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న 40 ఎకరాల భూమిలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలే ఈ వివాదానికి కారణం. ఈ నెల 17న హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.

ఈ చర్యలను సవాలు చేస్తూ శాంతా శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ జూకంటి అనిల్‌కుమార్‌ విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘించే అధికారి చట్టబద్ధ పాలనకు ముప్పుగా మారే అవకాశం ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అలాంటి పరిస్థితుల్లో సంబంధిత అధికారి ఆ పదవిలో కొనసాగరాదని పేర్కొంది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలకు సిఫార్సు చేయడం తప్ప మరో మార్గం లేదని తెలిపింది.

ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్‌ పదవి నుంచి ఎ.వి. రంగనాథ్‌ను తప్పించి మరో అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. రంగనాథ్‌పై ఉన్న కోర్టు ధిక్కరణ కేసుల సంఖ్యపైనా న్యాయస్థానం ప్రస్తావించింది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో 9,290 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. అయితే ఏడాదిన్నర కాలంలోనే రంగనాథ్‌కు సంబంధించిన 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ఐజీ ర్యాంకు, కార్యదర్శి స్థాయిలో ఉన్న హైడ్రా కమిషనర్‌కు ప్రభుత్వ ఆస్తులను, ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆస్తులను రక్షించడం ప్రధాన బాధ్యత అని కోర్టు పేర్కొంది. హైడ్రా ఏర్పాటుకు సంబంధించిన జీవో 99లో ఈ విషయం స్పష్టంగా ఉందని తెలిపింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఈ తీర్పుపైనే ఇప్పుడు ఎ.వి. రంగనాథ్‌ అప్పీల్‌కు వెళ్లారు. దీంతో ఈ వ్యవహారంలో తదుపరి న్యాయపరమైన పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

Read More
Next Story