x
HYDRAA

అరెస్ట్ నుండి తప్పించుకున్న హైడ్రా కమిషనర్

జస్టిస్ జూకంటి అనీల్ కుమార్ హైడ్రా కమిషనర్ ను అరెస్టుచేయాలని ఆదేశించారు.


హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అరెస్ట్ నుండి తప్పించుకున్నారు. కోర్టు స్టే ఉత్తర్వులున్న నిర్మాణాలను పట్టించుకోకుండా హైడ్రా పాక్షికంగా కూల్చేసింది. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన జస్టిస్ జూకంటి అనీల్ కుమార్ హైడ్రా కమిషనర్ ను అరెస్టుచేయాలని ఆదేశించారు. విషయం ఏమిటంటే మల్కాజ్ గిరి మండలంలోని లోతుగుంట గ్రామం సర్వే 1,2లో 40 ఎకరాల్లో ఒక ప్రైవేటు సంస్ధ నిర్మాణాలు చేస్తోంది. నిర్మాణాలు జరుగుతున్న భూమి ప్రభుత్వానిది అని హైడ్రా అధికారులు సదరు నిర్మాణాలను కూల్చేయటానికి జూన్ నెలలో వెళ్ళారు. అయితే తాము నిర్మాణాలు చేస్తున్నది పూర్తిగా ప్రైవేటు భూమేనని, ఇందులో ఎక్కడా ప్రభుత్వ భూమిలేదని యాజమాన్యం చెప్పింది.

అయితే యాజమాన్యం వాదనను హైడ్రా అధికారులు వినిపించుకోలేదు. దాంతో చేసేదిలేక యాజమాన్యం హైకోర్టులో హౌడ్రాకు వ్యతిరేకంగా పిటీషన్ వేసింది. కేసును విచారించిన జస్టిస్ అనీల్ కుమార్ యాజమాన్యానికి అనుకూలంగా స్టే ఇచ్చారు. జూలై నెల మొదట్లో హైడ్రా అధికారులు అవే నిర్మాణాలను కూల్చేస్తామంటు రెండోసారి వెళ్ళారు. అప్పుడు యాజమాన్యం కోర్టు స్టే ఉత్తర్వులను చూపించింది. దాంతో వెనక్కు వచ్చేసిన హైడ్రా అధికారులు మూడోసారి మూడురోజుల క్రితం మళ్ళీ వెళ్ళారు. ఇపుడు కూడా యాజమాన్యం కోర్టు ఉత్తర్వులను చూపించింది. అయితే స్టే ఉత్తర్వులను పట్టించుకోకుండా హైడ్రా అధికారులు కాంపౌండ్ వాల్ తో పాటు నిర్మాణాల్లో కొంతభాగాన్ని కూల్చేశారు.

కూల్చివేతలను వ్యతిరేకించిన యాజమాన్యం హైడ్రాపై కోర్టు థిక్కారం కింద మళ్ళీ కోర్టులో కేసు వేసింది. ఈ కేసును సోమవారం విచారించిన జస్టిస్ చాలా తీవ్రంగా స్పందించారు. కోర్టు ఉత్తర్వులున్నప్పటికీ నిర్మాణాలను కూల్చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని హైడ్రాను నిలదీశారు. కోర్టు స్టే ఉత్తర్వులున్నా హైడ్రా పట్టించుకోలేదంటే కోర్టుల ఆదేశాలంటే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు ఏమాత్రం లెక్కలేదు అని నిర్ణయించారు. అందుకనే తీవ్ర ఆగ్రహంతో కమిషనర్ ను వెంటనే అరెస్టుచేయాలని పోలీసులను జస్టిస్ ఆదేశించారు. అయితే ప్రభుత్వ లాయర్లు జోక్యం చేసుకుని అరెస్టు వంటి తీవ్రమైన ఆదేశాలు వద్దని రిక్వెస్టు చేసుకున్నారు.

లాయర్ల రిక్వెస్టుతో జస్టిస్ అరెస్టు ఆదేశాలను ఉపసంహరించుకున్నప్పటికీ వెంటనే కమిషనర్ వ్యక్తిగతంగా వచ్చి కోర్టులో హాజరుకావాలని ఆదేశించారు. దాంతో రంగనాథ్ హుటాహుటిని వచ్చి కోర్టులో హాజరయ్యారు. అలవాటుపడ్డ నేరగాడిలా రంగనాథ్ తయారైనట్లు జస్టిస్ తీవ్రంగా మండిపడ్డారు. ఇంకోసారి కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించటంతో అరెస్టు నుండి కమిషనర్ తప్పించుకున్నారు.

Read More
Next Story